మంచిర్యాల జిల్లాలో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ

ABN , First Publish Date - 2022-05-02T04:06:48+05:30 IST

జిల్లాలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయ కుల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇరు పార్టీల నాయ కులు పరస్పర విమర్శలు, దాడులకు పాల్పడుతూ ప్రజల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. అధినేతల మధ్య రేగిన చిచ్చు జిల్లాకు పాకడంతో ఇరు పార్టీల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇంతకా లం ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకోవడమే చూశాం. భౌతిక దాడులకు పాల్పడ్డ సంఘటనలు అరుదు. జిల్లాలో ఆ పరిస్థితికి భిన్నంగా నాయకుల వైఖరి తయారైంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పరిస్థితి మరింత అదుపు తప్పుతోంది.

మంచిర్యాల జిల్లాలో  టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ

ఇరుపార్టీల మధ్య భగ్గుమంటున్న విభేదాలు

భౌతిక దాడులకు పాల్పడుతున్న శ్రేణులు

వరుస ఘటనలతో భయానక వాతావరణం

చెన్నూరులో శ్రుతిమించుతున్న నాయకుల వైఖరి

మంచిర్యాల, మే 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయ కుల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇరు పార్టీల నాయ కులు పరస్పర విమర్శలు, దాడులకు పాల్పడుతూ ప్రజల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. అధినేతల మధ్య రేగిన చిచ్చు జిల్లాకు పాకడంతో ఇరు పార్టీల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇంతకా లం ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకోవడమే చూశాం. భౌతిక దాడులకు పాల్పడ్డ సంఘటనలు అరుదు. జిల్లాలో ఆ పరిస్థితికి భిన్నంగా నాయకుల వైఖరి తయారైంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పరిస్థితి మరింత అదుపు తప్పుతోంది. ద్వితీయ శ్రేణి నాయకుల చర్యల కారణంగా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

తారాస్థాయికి చేరిన విభేదాలు...

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రాన్ని పాలిస్తున్న టీఆర్‌ఎస్‌ క్యాడర్‌ నువ్వా....నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపొందినప్పటి నుంచి రెండు పార్టీల మధ్య వైషమ్యాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇటీవల సీఎం కేసీఆర్‌ బీజేపీ నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌ నాయకులకు ఊతమిచ్చినట్లు కనిపిస్తోంది. ఇన్ని రోజులు మేము ఓపిక పట్టినం...ఇగ మీరు రోడ్ల మీదికి ఎట్లా వస్తరో మేమూ జూస్తం...మేమూ రోడ్లమీదికి వస్తమని వ్యాఖ్యానించారు.  ధాన్యాన్ని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని నవంబర్‌ 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ధర్నాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో చెన్నూరులో ఏర్పాటు చేసిన ధర్నాను ఉద్దేశించి ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పైనా, టీఆర్‌ఎస్‌ పైనా ఎవరు విమర్శలు చేసినా ఊరుకోవద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మీరు ఏమైనా చేయండి....నేను చూసుకుంటానని వ్యాఖ్యానించడం పార్టీ నాయకులకు మరింత ఊతమిచ్చినట్లయింది. 

చెన్నూరు నియోజకవర్గంలో...

చెన్నూరు పట్టణంలో నవంబర్‌ 14న బీజేపీ పట్టణ అధ్యక్షుడు సుశీల్‌కుమార్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడికి యత్నించారు. కోటపల్లి మండలం బబ్బెర చెల్క గ్రామానికి చెందిన ఆసంపల్లి మహేష్‌ ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదనే మనస్తాపంతో నవంబర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఓయూ జేఏసీ నాయకులు వస్తున్నారనే సమాచారంతో వారిని అడ్డుకొనేందుకు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధపడ్డారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కర్రలతో మకాం వేసి వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తూ హల్‌చల్‌ చేశారు. ఆ సమయంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బీజేపీ నాయకులు రాగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు వారిని దూషిస్తూ దాడికి యత్నించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపు లోకి రాగా, బీజేపీ నాయకులనే అదుపులోకి తీసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసులు అధికార పార్టీ నాయకులకు వంతపాడుతున్నా రనే విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. అదే నెల 13న నల్లగొండ జిల్లాలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై కోడిగుడ్లు, రాళ్లతో జరిగిన దాడిపై ఆ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. మరునాడు లక్షెట్టిపేటలో జాతీయ రహదారిపై బీజేపీ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య విబేధాలు ఉధృతం కాగా ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న జిల్లాలో అలజడి ప్రారంభమైంది.  

చెన్నూరులో రోడ్డు వెడల్పు పనుల సందర్భంగా కొత్త బస్టాండ్‌ సమీపంలో చిరు వ్యాపారులకు చెందిన షాపులు పోతుండటంతో 133 కేవీ సబ్‌స్టేషన్‌ సమీపంలో స్థలాలు కేటాయిస్తామని ఎమ్మెల్యే సుమన్‌ హామీ ఇచ్చారు. డిసెంబర్‌ 6న షాపులకు ముగ్గు పోసేందుకు అధికార పార్టీ నాయకులు సబ్‌స్టేషన్‌కు చెందిన స్థలంలోకి వెళ్లడంతో అధికారులు అడ్డుకున్నారు. విద్యుత్‌ ఏఈ రామ్మూర్తి, ఇద్దరు లైన్‌మెన్లపైన టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు రేవెల్లి మహేష్‌, జగన్నాథుల శ్రీను, వేల్పుల సుధాకర్‌, పెండ్యాల స్వర్ణలత భర్త లక్ష్మన్‌లు దాడికి పాల్పడ్డారు. అధికారుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా, తమను కులం పేరుతో దూషించారని కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. 

తాజాగా మరో దాడి

ఈ నెల 30న బీజేపీ నాయకులపై టీఆర్‌ఎస్‌ నాయకులు కర్రలతో దాడి చేశారు. చెన్నూరు నియోజకవర్గ ఇన్‌చార్జి అందుగుల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మిర్చి రైతుల కష్టాలను తెలుసుకుంటుండగా విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు అక్కడకు చేరుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకొని కర్రలతో దాడి చేశారు. దాడిలో అందుగుల శ్రీనివాస్‌, సంపత్‌లకు చెయ్యి విరగగా సుశీల్‌కుమార్‌కు గాయాలయ్యాయి. తమపై దాడి చేసి వారిపై బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా జరిగిన దాడితో చెన్నూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఈ పరిస్థితిని ఇంతటితో నిలువరింప జేసేందుకు పోలీసులు, ఉన్నతాధికారులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. 







 

Updated Date - 2022-05-02T04:06:48+05:30 IST