Advertisement

పడగ విప్పిన పురుషాహంకారం

Oct 17 2020 @ 00:25AM

సోలిపేట సుజాతకు అనేక ఉద్యమాలతో అనుబంధం ఉంది. వాటి వల్ల కలిగిన రాజకీయ సంస్కారం ఉంది. భర్త వామపక్ష ఉద్యమాలలో ఉన్నకాలంలో ఆయన వెంట ధైర్యంగా అడుగేసింది. రైతుకూలీల, బీడీ కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటాలలో పాల్గొంది. నిజమైన జీవిత పరిజ్ఞానం ఆమెకు ఎంతగానో ఉంది. తెలంగాణ ఉద్యమంలో భర్తతో పాటు చురుకైన పాత్ర పోషించిన ఆమె జీవితం, రాజకీయ పరిజ్ఞానం మీద అంచనా లేకుండా దాడికి తెగబడుతున్న బిజెపి, కాంగ్రెస్‌ నాయకులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.


రాజకీయరంగంలో ప్రవేశించాలనుకునే మహిళల పట్ల, కాంగ్రెస్, బిజెపి నాయకులకు ఎంతటి సంకుచితమైన అభిప్రాయాలున్నాయో, దుబ్బాక ఉపఎన్నికల సందర్భంగా వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయి. తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత మీద ఆ రెండు పార్టీల నాయకులు చేస్తున్న విమర్శలలో అడుగడునా పురుషాహంకారం పడగవిప్పి నాట్యం చేస్తోంది. సుజాత అభ్యర్థిత్వం ఖరారైన నాటి నుంచి, ఆమెకు చదువురాదంటూ బిజేపి సోషల్ మీడియాలో దుర్మార్గమైన దాడి చేస్తోంది. సుజాత నిరక్ష్యరాస్యురాలు కాదు. ఐదు దశాబ్దాల కింద తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో పేద రైతు కుటుంబాలలోని స్త్రీలు ఎంతవరకు చదువుకునే అవకాశం ఉందో అంతవరకు చదువుకుంది. డిగ్రీలు సర్ట్టిఫికెట్‌లు ఉన్నవాళ్ళే సమర్థులు, మిగతా వాళ్ళు కాదని బిజెపి నాయకులు భావిస్తున్నారా? చాయ్‌వాలా ప్రధాని అయ్యారని వాళ్లు గొప్పలు పోతుంటారు. మరి అదే న్యాయం సుజాతకు వర్తించదా? ఏ సర్టిఫికెట్ లేని స్మృతి ఇరానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి కాలేదా? బిజెపిలో ఉన్న నాయకులందరూ విద్యాధికులా? గొప్ప పండితులా? రాజకీయాలలో సర్టిఫికెట్ చదువుల కన్నా సామాజిక స్ఫూర్తి ముఖ్యం. వివిధ వర్గాల ప్రాతినిథ్యం ముఖ్యం. అందుకే బాబాసాహెబ్ సారథ్యంలో రూపుదిద్దుకున్న మన రాజ్యాంగం, ఎన్నికలలో నిలబడడానికి విద్యార్హతలు ఉండాలనే నిబంధన పెట్టలేదు. బిజెపి నాయకులు రాజ్యంగ విలువలకు, మానవీయ విలువలకు విరుద్ధంగా, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా పురుషాహం కారంతో వ్యవహరిస్తూ సుజాత మీద హేయమైన పోస్టింగులు పెట్టినందుకు ఆమెకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి.


సుజాతకు అనేక ఉద్యమాలతో అనుబంధం ఉంది. వాటి వల్ల కలిగిన రాజకీయ సంస్కారం ఉంది. ఆమె ప్రస్తుత బిజెపి అభ్యర్థి మాదిరిగా వసూళ్ళు, ముడుపులతో పెరిగిన నాయకురాలు కాదు. వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా సభా వివాహానికి సిద్ధపడ్డ చైతన్యశీలి, ధైర్యశాలి. భర్త వామపక్ష ఉద్యమాలలో ఉన్నకాలంలో ఆయన వెంట ధైర్యంగా అడుగేసింది. రైతుకూలీల, బీడీ కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటాలలో పాల్గొంది. రహస్యోద్యమంలో పని చేసే నాయకులెందరో ఇంటికి వచ్చినపుడు కరుణతో వారి ఆకలి తీర్చటంతో పాటు, వారి నుంచి అనేక విషయాలు గ్రహించింది. నిజమైన జీవిత పరిజ్ఞానం ఆమెకు ఎంతగానో ఉంది. తెలంగాణ ఉద్యమంలో భర్తతో పాటు చురుకైన పాత్ర పోషించిన ఆమె జీవితం, రాజకీయ పరిజ్ఞానం మీద అంచనా లేకుండా బిజెపి, కాంగ్రెస్‌ నాయకులు దాడికి తెగబడటం హేయం. 


భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సుజాత ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళగలననే ఆత్మవిశ్వాసంతో ఎన్నికల రణరంగంలో కాలూనింది. ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఆమెకు ఒక తోబుట్టువులా అండగా నిలిచారు. ఎన్నికల బరిలోనూ, పరిపాలనా పరమైన అంశాలలోనూ సుజాతకు పూర్తి సహకారం అందిస్తానని ఎంతోసంస్కార వంతంగా, ఉదాత్తంగా స్పందించారు. కానీ పిసిసి అధ్యక్షులు ఉత్తమకుమార్ రెడ్డి హరీష్‌ మాటలను వక్రీకరిస్తూ, ‘సుజాతను డమ్మీ నాయకురాలిని చేస్తారా’ అని హేళన చేయడం తగనిది. మహిళలు ఎప్పుడూ డమ్మీలే అవుతారని ఆయన అభిప్రాయమా? రాజకీయ పదవులు నిర్వహిస్తున్న ఉత్తమ్‌ భార్య స్వతంత్రంగా రాణించగలిగినప్పుడు సుజాత కూడా రాణించగలరని ఎందుకు విశ్వసించడం లేదు. ఆమెను చిన్న చూపుతో కించపరచడం అంతరాంతరాలలో పేరుకుపోయిన ఆయన పురుషాహంకారానికి నిదర్శనం కాదా? సుజాత పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉత్తమ్‌ ఉపసంహరించుకోవాలి. మహిళల పట్ల ఆయనకున్న అభిప్రాయాన్ని మార్చుకుని ఆమెకు క్షమాపణ చెప్పాలి.


సుజాత టిఆర్‌ఎస్ ప్రతినిధిగా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. విమర్శలు చేయదలిస్తే ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న రాజకీయ పార్టీ విధానాలపై చేయాలి కానీ, ఆమెపై వ్యక్తిగతంగా, కుటుంబపరంగా వ్యంగ్యంగా విమర్శలు చేయడం మరో కాంగ్రెస్‌ నేత రేవంత్ దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనం. వ్యక్తిగత, కుటుంబ అంశాలను చర్చకు పెడితే ఆయన ఎక్కడ నిలుస్తారు? సమైక్యరాష్ట్ర ముఖ్యమంత్రులు చూపిన ప్రలోభాలకు లొంగని ధీరుడు సోలిపేట రామలింగారెడ్డి. ఆయన ఆశయాలకు ప్రతిరూపం సుజాత. తుచ్ఛమైన పదవుల కోసం, డబ్బు కోసం సమైక్యవాద నాయకులకు ఊడిగం చేసిన రేవంత్‌ తెలంగాణ చరిత్రలో ద్రోహిగా నిలబడితే, తెలంగాణ ఉద్యమసింహంగా రామలింగా రెడ్డి దంపతులు శాశ్వతకీర్తి సంపాదించుకున్నారు. ఓటుకు నోటు ఇచ్చి తెలంగాణ నాయకులను కొనేందుకు దళారీగా వ్యవహరించి దొరికిపోయిన రేవంత్ ప్రజాజీవితంలో కొనసాగే హక్కును ఏనాడో కోల్పోయారు. అలాంటి వారు సంస్కారవంతంగా వ్యవహరిస్తారని ఆశించలేం. 


కాంగ్రెస్, బిజెపి వారు నాయకుల మాటేమోగానీ, ముందు మనుషులుగా కూడా గుర్తింపు పోగొట్టుకోకుండా వ్యవహరించడం మంచిది. సుజాత మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నామని బహిరంగ ప్రకటన చేసినప్పుడే వారికి ఆ గుర్తింపు మిగులుతుంది. అందువల్ల వారు పశ్చాత్తాపం ప్రకటించి ప్రాయశ్చిత్తం చేసుకొని సంస్కారం ఉన్న మనుషులమని నిరూపించుకోవాలి.


వేలేటి రోజాశర్మ, సిద్దిపేట జిల్లా పరిషత్ అధ్యక్షురాలు

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.