మద్యం మత్తులో తూలుతూ.. నడిరోడ్డుపై TRS కార్పొరేటర్‌ హంగామా..!

ABN , First Publish Date - 2021-10-24T19:40:42+05:30 IST

నడిరోడ్డుపై వాహనాలను అడ్డంగా నిలిపి రోడ్డును బ్లాక్‌ చేసి...

మద్యం మత్తులో తూలుతూ.. నడిరోడ్డుపై TRS కార్పొరేటర్‌ హంగామా..!

  • కర్రీ పాయింట్‌ యజమానిపై దాడికి యత్నం
  • ట్రాఫిక్‌కు అంతరాయం

హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల : సూరారం డివిజన్‌ కార్పొరేటర్‌ మంత్రి సత్యనారాయణ శుక్రవారం రాత్రి 10గంటల ప్రాంతంలో హంగామా సృష్టించారు. గాజులరామారం రోడ్డులో తన అనుచరులతో కలిసి ఓ కర్రీపాయింట్‌ యజమానిపై దాడికి యత్నించాడు. నడిరోడ్డుపై వాహనాలను అడ్డంగా నిలిపి రోడ్డును బ్లాక్‌ చేసి హల్‌చల్‌ చేశారు. ట్రాఫిక్‌జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. దాదాపు గంటపాటు గాజులరామారం రోడ్డులో కార్పొరేటర్‌ వీరంగం చేశాడు.


గాజులరామారం రోడ్డులోని పోచయ్యహోటల్‌ సమీపంలో మల్లేష్‌ అనే వ్యక్తి క్యాటరింగ్‌, కర్రీ పాయింట్‌ను నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 10గంటల ప్రాంతంలో కార్పొరేటర్‌ మంత్రి సత్యనారాయణ అనుచరులు లక్ష్మణ్‌, మరో యువకుడు అక్కడికి వచ్చి కర్రీ డబ్బుల విషయంలో గొడవపడ్డారు. అక్కడ పనిచేస్తున్న యువకులపై చేయిచేసుకున్నారు. అప్పుడే వచ్చిన మల్లేష్‌ వారితో గొడవపడ్డాడు. కార్పొరేటర్‌ అనుచరులు ఆయనకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. మద్యం మత్తులో తూలుతున్న స్థితిలో వచ్చిన కార్పొరేటర్‌, ఆయన అనుచరులు మల్లేష్‌పై దాడికి యత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. జనం గుమ్మిగూడటంతో పోలీసులు వచ్చారు. ఈ సందర్భంగా జీడిమెట్ల ఎస్‌ఐ మన్మద్‌ అక్కడ లేకపోయినా దుర్బాషలాడుతూ క్షణంలో ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తానని హెచ్చరించాడు.


పరిశీలించి చర్యలు..

గాజులరామారం రోడ్డులో కర్రీ పాయింట్‌ వద్ద కార్పొరేటర్‌, ఆయన అనుచరులు హల్‌చల్‌ చేసినట్లు సమాచారం ఉందని జీడిమెట్ల సీఐ కొక్కొండ బాలరాజు తెలిపారు. సీసీ ఫుటేజీని పరిశీలించి కార్పొరేటర్‌, ఆయన అనుచరులపై చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

Updated Date - 2021-10-24T19:40:42+05:30 IST