కేంద్రం వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా TRS ధర్నాలు

ABN , First Publish Date - 2021-11-12T17:40:47+05:30 IST

కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం అధికార టీఆర్ఎస్ పార్టీ ధర్నాకు దిగింది.

కేంద్రం వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా TRS ధర్నాలు

హైదరాబాద్: కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం ధర్నాలు, నిరసనలు  చేపట్టారు. రైతు ధర్నాలో భారీగా టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఇందిరాపార్క్ వద్ద అధికార టీఆర్ఎస్ పార్టీ ధర్నాకు దిగింది. నగర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాలో పాల్గొన్నారు. భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు హాజరయ్యారు. 


వరంగల్:  పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తిలో టీఆర్ఎస్ ధర్నాకు దిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంత్రులం రోడ్లపై కూర్చోవలసి వచ్చిందని మంత్రి అన్నారు. ప్రభుత్వంలో ఉండి ధర్నా చేయడం బాధగా ఉన్నా ప్రజల కోసం తప్పడం లేదని తెలిపారు. కేంద్రం నిర్ణయంతో రైతులు నష్టపోతారన్నారు. ఎఫ్సీఐ ద్వారా కొంటామని బీజేపీ నాయకులు ఒప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన చట్టాలను ఉపసంహరించుకోవాలని మంత్రి అన్నారు. అలాగే రైతులు పండించిన వరిని కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని  నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి  ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 


రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలో తెలంగాణ రైతుల మహాధర్నాలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. 


సిద్దిపేట: వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహా ధర్నా చేపట్టారు. మంత్రి హరీష్‌రావు ధర్నాలో పాల్గొన్నారు. ధర్నాకు  పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వచ్చారు. 

* హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులతో కలిసి  ఎమ్మెల్యే సతీష్ కుమార్, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. 


యాదాద్రి-భువనగిరి : వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆలేరులో నిర్వహించిన మహాధర్నాలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పాల్గొన్నారు. అటు భువనగిరి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన టీఆర్ఎస్ ధర్నాలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణా రెడ్డి పాల్గొన్నారు. 


ఖమ్మం:  సత్తుపల్లిలో రైతుధర్నా కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. 


మహబూబాబాద్:  రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని తహాశీల్ధార్ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి, రైతులు, పార్టీ శ్రేణులు ధర్నాలో పాల్గొన్నారు. 


సంగారెడ్డి:  సంగారెడ్డి బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా  నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ , పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. అటు జహీరాబాద్  బస్ స్టాండ్ ఎదుట టీఆర్ఎస్ మహా ధర్నాలో ఎమ్మెల్యే కే మాణిక్‌రావు, తదితరులు పాల్గొన్నారు. 


హనుమకొండ: హనుమకొండలో టీఆర్ఎస్ రైతు ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ ఎడ్ల బండిపై ర్యాలీగా వచ్చారు. హనుమకొండ చౌరస్తా నుంచి ఏకశిల పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏకశిల పార్క్‌లో ధర్నాకు దిగారు. అటు పరకాల పట్టణంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. 


భద్రాద్రికొత్తగూడెం: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల చూపుతున్న వివక్షతను విడనాడాలి అని, తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనుగోలు చేయాలని  డిమాండ్ చేస్తూ ఎమ్మల్సీ బాలసాని లక్ష్మీనారాయణ రైతులతో, పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నా, నిరసన ప్రదర్శన చేపట్టారు.

అలాగే మణుగూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగాకాంతారావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా  రైతులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. 


మంచిర్యాల:  కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో  టీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. జెడ్పి చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే దివాకర్ రావు ధర్నాలో పాల్గొన్నారు. 


ఆదిలాబాద్: వరి ధాన్యం కొనుగోళ్లు జరపాలని బోథ్‌లో టీఆర్ఎస్ నిర్వహించిన మహాధర్నాలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొన్నారు. 


కొమురం భీం: జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ చేపట్టిన మహా ధర్నాలో జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మీ, ఎమ్మెల్యే ఆత్రం సక్కు  పాల్గొన్నారు. 


నిర్మల్ : ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన భారీ ధర్నాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. 


జోగులాంబ గద్వాల: ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అల్లంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి టీఆర్ఎస్ నాయకులతో భారీ ర్యాలీతో జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే అబ్రహం ధర్నాలో పాల్గొన్నారు. 


నారాయణపేట:  రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది రైతులు, కార్యకర్తలు  ధర్నాకు హాజరయ్యారు. 


కామారెడ్డి: వరి ధాన్యంను కేంద్ర ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమ కుమార్, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి  పాల్గొన్నారు. అటు నిజాంసాగర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో జుక్కల్ నియోజక వర్గ స్థాయి రైతు ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఎమ్మెల్యే హన్మంత్ షిండే, టీఆర్ఎస్ నాయకులు, రైతులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. 


కరీంనగర్: జిల్లా  కలెక్టరేట్ ఎదుట టీఆర్‌ఎస్ ఆందోళన చేపట్టింది. ధర్నాలో పాల్గొన్నమంత్రి గంగుల కమలాకర్... కేంద్రం ధాన్యం కొనాల్సిందే అని  డిమాండ్ చేశారు. రైతులను బీజేపీ వేధిస్తోందని మండిపడ్డారు. అలాగే హుజురాబాద్ ఆర్డీవో  కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీఆర్ఎస్ ధర్నా నిర్వహించారు. నియోజక వర్గ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎస్ సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్ పి చైర్మన్ కనుమల్ల విజయ తదితరులు పాల్గొన్నారు. 


మెదక్:  యాసంగిలో కేంద్ర ప్రభుత్వం వడ్లు  కొనుగోలు చేయాలని  డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి రాందాస్ చౌరస్తా వరకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి  , టిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు పాదయాత్ర చేశారు. 

Updated Date - 2021-11-12T17:40:47+05:30 IST