కాంగ్రెస్‌, బీజేపీలతో టీఆర్‌ఎస్‌ లోపాయికారి ఒప్పందం

ABN , First Publish Date - 2021-10-25T05:01:16+05:30 IST

తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలతో టీఆర్‌ఎస్‌

కాంగ్రెస్‌, బీజేపీలతో టీఆర్‌ఎస్‌ లోపాయికారి ఒప్పందం
మహేశ్వరం జరిగిన సభలో మాట్లాడుతున్న షర్మిల, హాజరైన జనం

  • వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల
  • ఐదోరోజు పాదయాత్రలో షర్మిలకు బ్రహ్మరథం పట్టిన మహేశ్వరం ప్రజలు


ఇబ్రహీంపట్నం/మహేశ్వరం : తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలతో టీఆర్‌ఎస్‌ లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకుందని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఆరోపిం చారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డిని జైలుకు పంపకుండా పాలకులు కాపాడుతున్నారంటే ఇది కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ఒప్పందం కాదా అంటూ ప్రశ్నించారు. తన అవినీతి బయటకు రాకూడదనే ఢిల్లీలో మోదీ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్‌ గులాంగిరీచేస్తున్నారంటూ ఆమె పేర్కొన్నారు. 

ప్రజాప్రస్థానం పాదయాత్ర ఐదోరోజు ఆది వారం మహేశ్వరం మండలంలో కొనసాగింది. నాగారం నుంచి కొత్తతండా క్రాస్‌రోడ్డు, డబిల్‌గూడ, మన్సాన్‌పల్లి చౌరస్తా, మన్సాన్‌పల్లి గ్రామం నుంచి మహేశ్వరం మీదుగా 14కిలోమీటర్లు కొనసాగి తుమ్మలూరుకి చేరుకుంది. ఈసందర్భంగా మహేశ్వరంలో ఏర్పాటు చేసిన సభలో షర్మిల ప్రసంగించారు. 

వైఎస్‌ఆర్‌టీపీకి ఎవరితో పొత్తు ఉండదని కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీలు గుర్తెరగాలని ఆమె అన్నారు. హైదరాబాదులో వరదలు వచ్చి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపితే మున్సిపల్‌శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌ పట్టిం చుకోలేదని ఆమె విమర్శించారు. ముంపుకు గురైన ప్రాం తాల్లో ప్రతి ఇంటికీ రూ.10 వేలు ఆర్థిక సాయం చేస్తామని చేతులెత్తేశారని మండిపడ్డారు. పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సుంకాన్ని తగ్గించుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ పాలన పోయి వైఎస్‌ఆర్‌ సంక్షేమ పాలన వస్తేనే పేదల బతుకులు మారుతాయన్నారు. ప్రశ్నించేవారిని అడ్డుకోవడం పాలకులకు పరిపాటైందని ఆమె దెప్పిపొడిచారు. తెలంగాణలో వైఎస్‌ సంక్షేమ పాలన వస్తేనే పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్‌ వైద్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌,  పక్కాఇళ్లు, నైపుణ్య శిక్షణ ద్వారా యువతకు ఉద్యోగాలు వస్తాయని భరోసా ఇచ్చారు. మన్సాన్‌పల్లి చౌరస్తాలో రోడ్డు కాలినడకకు కూడా పనికిరాకుండా ఉందని, బంగారు తెలంగాణలో రోడ్లు ఉండేది ఇలాగేనా అని విమ ర్శించారు. తెలంగాణ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. 


ఘనస్వాగతం..

యాత్రలో షర్మిలకు ఆయా గ్రామాల ప్రజలు పూల మాలలతో ఘనస్వాగతం పలికారు. నాగారంలో జరిగిన పాదయాత్రలో రోడ్డు మీద వెళ్తున్న ప్రయాణికులను షర్మిల ఆప్యాయంగా పలకరించారు. డబిల్‌గూడ రోడ్డు పక్కన రైతులు బాల్‌రాజ్‌, యాదమ్మల వ్యవసాయ పొలంలోకి వెళ్లి పంటలకు గిట్టుబాటుధర అందుతుందా? లేదా? అని అడగగా.. పంటలకు గిట్టుబాటుధర లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్పారు. మన్సాన్‌పల్లిలో ఉన్న అంబేద్కర్‌, దివంగత వైఎఎస్‌ఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మన్సాన్‌పల్లిలో ఆటో యూనియన్‌ నాయకులతో షర్మిల మాట్లాడారు. పాదయాత్రలో  ఏపూరి సోమన్న కళాబృందం ఆటపాటలతో ప్రజలను ఉత్తేజపరిచారు. షర్మిలను చూడటానికి ముస్లిం మహిళలు భారీగా తరలివచ్చారు.  పాదయాత్ర భోజన విరామ సమయంలో మన్సాన్‌పల్లి వద్ద తల్లి విజయమ్మ షర్మిలను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో నాయకులు కొండా రాఘవరెడ్డి, అమృతాసాగర్‌, వేణుగోపాల్‌రెడ్డి, చెరుకు శ్రీను పాల్గొన్నారు. 




Updated Date - 2021-10-25T05:01:16+05:30 IST