తెలంగాణ ప్రజల గోస తీర్చిన టీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2021-10-24T04:47:23+05:30 IST

సీమాంధ్రుల పాలనలో ఎన్నో కష్టాలకు గురైన తెలంగాణ ప్రజల గోస తీర్చింది టీఆర్‌ఎస్‌ మాత్రమేనని, సీఎం కేసీఆర్‌ చొరవతో దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా నిలిచిందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.

తెలంగాణ ప్రజల గోస తీర్చిన టీఆర్‌ఎస్‌
శివగారి అంజయ్యను అభినందిస్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

 వరంగల్‌ విజయగర్జన సభను జయప్రదం చేయాలి

 జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి


చేర్యాల, అక్టోబరు 23: సీమాంధ్రుల పాలనలో ఎన్నో కష్టాలకు గురైన తెలంగాణ ప్రజల గోస తీర్చింది టీఆర్‌ఎస్‌ మాత్రమేనని, సీఎం కేసీఆర్‌ చొరవతో దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా నిలిచిందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శనివారం చేర్యాలలో మునిసిపల్‌, రూరల్‌ మండలానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి కోసమే ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ 20 ఏళ్లుగా ఎన్నో మైలురాళ్లను దాటి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు రాజకీయ ఉనికి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు. వరంగల్‌లో నిర్వహించతలపెట్టిన విజయగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


కొనుగోళ్లలో అవకతవకలపై అఖిలపక్షాలది రాజకీయం


చేర్యాల పీఏసీఎస్‌, ఐకేపీ ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అవకతవకల విషయమై తాను స్వయంగా రాష్ట్రస్థాయి అధికారులు, మంత్రి కేటీఆర్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి, కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే విచారణ ప్రారంభించారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తెలిపారు. బాధ్యులపై కేసులు నమోదైన అనంతరం అఖిలపక్ష నాయకులు రాజకీయం చేయడం హాస్యాస్పదమన్నారు. బాధ్యులను కస్టడీకి తీసుకున్న పోలీసులు సమగ్రంగా విచారణ జరపకుండా దృష్టి మరల్చేందుకు అఖిలపక్షం బంద్‌తో పక్కదోవ పట్టించారని ఆరోపించారు. 


నాలుగు మండలాల యూత్‌ అధ్యక్షుడిగా అంజయ్య


చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళ్మిట్ట మండలాల యూత్‌ అధ్యక్షుడిగా చేర్యాలకు చెందిన శివగారి అంజయ్యను నియమిస్తున్నట్లు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రకటించారు. అనంతరం అతడిని సన్మానించి అభినందించారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపారాణి, ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌, జడ్పీటీసీ శెట్టె మల్లేశం, పార్టీ మండలాధ్యక్షుడు అనంతుల మల్లేశం, మార్కెట్‌ చైర్మన్‌ సుంకరి మల్లేశం, వైస్‌ చైర్మన్‌ పుర్మ వెంకట్‌రెడ్డి, రైతుసమన్వయ సమితి జిల్లా డైరెక్టర్‌ అంకుగారి శ్రీధర్‌రెడ్డి, మండల కో-ఆర్డినేటర్‌ తాడెం రంజిత, రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాలనర్సయ్య, పట్టణాధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్‌రావు, మహిళావిభాగం మండలాధ్యక్షురాలు మీస పార్వతి, పట్టణాధ్యక్షురాలు పచ్చిమడ్ల మానస తదితరులు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-10-24T04:47:23+05:30 IST