టీఆర్‌ఎస్‌ను వణికిస్తున్న ‘రెండు గుర్తులు’

ABN , First Publish Date - 2021-10-16T22:37:04+05:30 IST

హుజురాబాద్ ఉప ఎన్నికలో తమదే విజయమని ధీమా ఉన్న టీఆర్‌ఎస్ పార్టీని ఇప్పుడు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు వణికిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ను వణికిస్తున్న ‘రెండు గుర్తులు’

హుజురాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికలో తమదే విజయమని ధీమాగా ఉన్న టీఆర్‌ఎస్ పార్టీని ఇప్పుడు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు వణికిస్తున్నారు. హుజురాబాద్‌లో మొత్తం 42 మంది నామినేషన్లు దాఖలు చేయగా అందులో 12 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల గుర్తులున్నాయి. మిలిగిన స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. ఇందులో ఒకరికి రోడ్డు రోలర్, మరో అభ్యర్థికి చపాతీ రోలర్ గుర్తులను ఇచ్చారు. అప్పటి వరకు ధీమాగా ఉన్న టీఆర్‌ఎస్ శ్రేణులు ఈ రెండు గుర్తులు కేటాయించగానే వణికిపోతున్నారంట. 


ఎందుకంటే 2019 భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఓ ఇండిపెడెంట్ అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తును కేటాయించారు. ఆ అభ్యర్థికి ఏకంగా 27 వేల ఓట్లు పడ్డాయి. స్వతంత్ర అభ్యర్థి వల్లే ఓడిపోయామని టీఆర్‌ఎస్ శ్రేణులు వాపోయాయి. ఈ తర్వాత ఇదే సీన్ దుబ్బాకలో కూడా రిపీట్ అయింది. ఎలాగంటే దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత 1079 ఓట్ల తేడాతో ఓడి పోయారు. ఈ ఎన్నికలో ఓ స్వతంత్ర అభ్యర్థికి చపాతీ రోలర్ గుర్తును కేటాయించారు. ఆ అభ్యర్థికి 3,570 ఓట్లు వచ్చాయి. ఈ రెండు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమికి రోడ్డు రోలర్, చపాతీ రోలర్ కారణమయ్యాయని ఇప్పటికీ ఆ పార్టీ నేతలు విలపిస్తున్నారు. ఇప్పుడు హుజురాబాద్‌లో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు ఇవే గుర్తులు కేటాయించారు. ఈ రెండు గుర్తులను చూసిన టీఆర్‌ఎస్ నేతలు వణికిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2021-10-16T22:37:04+05:30 IST