కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలే

ABN , First Publish Date - 2022-07-04T09:04:30+05:30 IST

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, విజయ్‌ సంకల్ప్‌ సభ వేదికగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నేతలు మండిపడ్డారు.

కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలే

  • బీజేపీ సమావేశాలపై టీఆర్‌ఎస్‌ నేతల విమర్శ
  • కేసీఆర్‌ ప్రశ్నలకు జవాబు చెప్పలేదు: హరీశ్‌ రావు
  • అహ్మదాబాద్‌ను అదానీబాద్‌ చెయ్యండి: కేటీఆర్‌
  • హైదరాబాద్‌ పేరు మారుస్తామన్న వ్యాఖ్యలపై ఫైర్‌
  • కేసీఆర్‌పై దాడికి మిడతల దండు: జీవన్‌రెడ్డి
  • స్మృతి వాస్తవాలు తెలుసుకోవాలి: వినోద్‌


హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, విజయ్‌ సంకల్ప్‌ సభ వేదికగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నేతలు మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు ఎవ్వరూ రాష్ట్రానికి ఉపయోగపడే మాట ఒక్కటి కూడా చెప్పలేదని విమర్శించారు. బీజేపీ సమావేశాల్లో కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప మరేం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ట్విటర్‌ ద్వారా ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ అడిగిన ఒక్క ప్రశ్నకూ బీజేపీ బదులు చెప్పలేదని పేర్కొన్నారు. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలపై గతంలో పలుమార్లు వరాలు కురిపించిన మోదీ... తెలంగాణకు మరోసారి మొండిచేయి చూపారని హరీశ్‌ అన్నారు. గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశమిచ్చామని గొప్పలు చెప్పుకున్న కేంద్ర మంత్రులకు తెలంగాణలోని గిరిజనులు కనిపించడం లేదా అని హరీశ్‌  ప్రశ్నించారు. కాగా, తెలంగాణలో అధికారంలోకి రాగానే హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామన్న జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్‌ దాస్‌ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ఘాటుగా బదులిచ్చారు. అహ్మదాబాద్‌ పేరును అదానీబాద్‌గా ఎందుకు మార్చరంటూ ట్వీట్‌ చేశారు. 


అంతేకాక బీజేపీని భారతీయ జుమ్లా పార్టీ అనే కేటీఆర్‌.. ఎవరీ జుమ్లా జీవి? అంటూ రఘుబర్‌దా్‌సను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇక, ఆయా రామ్‌ - గయా రామ్‌లతో తెలంగాణకు ఒరిగేదేమి లేదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇలాంటి సభలు ఎన్ని నిర్వహించినా బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మరని ఇంద్రకరణ్‌ స్పష్టం చేశారు. కాగా, సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం మిడతల దండును తీసుకొచ్చిందని పీయూసీ చైర్మన్‌ ఎ.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద విలేకరుల సమావేశంలో విమర్శించారు. బక్కపలచని వ్యక్తిపై ఇంత మంది రాక్షసుల్లా దాడికి దిగడం అమానుషమన్నారు. కేంద్రంలో మోదీ మాజీ కావడం ఖాయమని, బండి సంజయ్‌ ఆధ్వర్యంలో బీజేపీకి ఇవే చివరి కార్యవర్గ సమావేశాలని జోస్యం చెప్పారు. కాగా, ప్రధానికి ఆహ్వానం పలకలేదంటూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ హితవు పలికారు. భారత్‌ బయోటెక్‌ సంస్థ కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసినప్పుడు 2020 నవంబర్‌ 28న మోదీ హైదరాబాద్‌ వచ్చారని, అప్పుడు ప్రధానిని ఎయిర్‌పోర్ట్‌లో సగౌరవంగా ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధమయ్యారని గుర్తు చేశారు. కానీ, ‘కేసీఆర్‌ మీరు రావొద్దు.. మీ ప్రధాన కార్యదర్శిని పంపండి’ అని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) అధికారులు ఆదేశించారని వెల్లడించారు. ఈ విషయంపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు.

Updated Date - 2022-07-04T09:04:30+05:30 IST