నా యాత్రను అడ్డుకునేందుకు కుట్ర

ABN , First Publish Date - 2022-08-19T05:54:57+05:30 IST

ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవాలని టీఆర్‌ఎస్‌ చూస్తోందని, వాళ్ల దాదాగిరి ఏంటో చూస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎక్కడ అడ్డుకుంటే అక్కడ మళ్లీ యాత్ర చేస్తానని, గల్లీ గల్లీ తిరుగుతానని హెచ్చరించారు.

నా యాత్రను అడ్డుకునేందుకు కుట్ర
జనగామ చౌరస్తాలో జరిగిన రోడ్‌ షోకు హాజరైన ప్రజలు, మాట్లాడుతున్న బండి సంజయ్‌

టీఆర్‌ఎస్‌ దాదాగిరి ఏపాటిదో చూస్తా..
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఓ కబ్జాకోరు
ఈ పోటుగాడికి సమాధానాలు చెప్పాలా?
మూర్ఖుడి చేతిలో తెలంగాణ తల్లి బందీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
జనగామ జిల్లా కేంద్రం చేరిన ప్రజా సంగ్రామ యాత్ర
చౌరస్తాలో హోరెత్తిన రోడ్‌ షో



జనగామ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవాలని టీఆర్‌ఎస్‌ చూస్తోందని, వాళ్ల దాదాగిరి ఏంటో చూస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎక్కడ అడ్డుకుంటే అక్కడ మళ్లీ యాత్ర చేస్తానని, గల్లీ గల్లీ తిరుగుతానని హెచ్చరించారు.  సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర గురువారం రాత్రి జనగామ జిల్లా కేంద్రానికి చేరుకుంది.

జనగామ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో సీఎం కేసీఆర్‌పై, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై తీ వ్ర స్థాయిలో సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఓ పెద్ద కబ్జాకోరు అని మండిపడ్డారు. బతుకమ్మ కుంట, చేర్యాల చెరువును కబ్జా చేశారని విమర్శించారు. జ నగామలో కుమ్మరికుంట కబ్జా చేయాలని చూస్తే కుమ్మరు లు తరిమికొట్టారని గుర్తు చేశారు. ముత్తిరెడ్డి మరోనయీం, మరో డేరా బాబా అని ఎద్దేవా చేశారు. నయీం కు పట్టిన గతే టీఆర్‌ఎస్‌ నాయకులకు పడుతుందని తెలిపారు. జనగామలో కనీస అభివృద్ధి చేయని మూర్ఖుడి ప్రశ్నలకు తా ను సమాధానం చెప్పాల్సిన పనిలేదని మండిపడ్డారు. మిష న్‌ భగీరథ నీళ్లు ఇస్తుంటే జనగామ ప్రజలు వాటర్‌ ఎందు కు కొంటున్నారో చెప్పాలని నిలదీశారు.  ప్రజా సంగ్రామ యాత్ర వస్తుంటే ముత్తిరెడ్డి ఫ్లెక్సీలు పెట్టారని, తమకు ప్లెక్సీలు ముఖ్యం కాదని, ప్రజల్లో ఉంటామన్నారు. కొమురవెళ్లి సిద్ధిపేట జిల్లాకు తరలిపోతుంటే ఆపలేని పోటుగాడు తమ యాత్రను అడ్డుకుంటాడా? అని ప్రశ్నించారు.

సంజయ్‌ ప్రసంగం మధ్యలో చౌరస్తాలో ఐదు నిమిషా ల పాటు కరెంట్‌ పోయింది. దీంతో ముత్తిరెడ్డిపై ఆయన మళ్లీ ఫైర్‌ అయ్యారు. ‘లుచ్చాగాళ్లు కరెంట్‌ తీసేయించారు’ అని మండిపడ్డారు. నక్సలైట్లు బెదిరించినప్పటికీ కాషాయ జెండా కోసం పోరాడి అసువులు బాసిన జనగామకు చెం దిన చెంచారపు రవీందర్‌రెడ్డిని ఈ సందర్భంగా సంజయ్‌ స్మరించుకున్నారు. చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య, షేక్‌ బందగీ, నల్లా నర్సింహులు లాంటి వీరులు పుట్టిన గడ్డ జనగామ అని కొనియాడారు. ముత్తిరెడ్డి దాదాగిరి నడవదని, ఆయన సంగతి చూస్తానని హెచ్చరించారు. ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా అర్థరాత్రి కూడా వస్తానని, జనగామ ప్రజలు భయపడొద్దని, ముత్తిరెడ్డి రౌడీయిజం ఏంటో చూస్తానన్నారు.

మూర్ఖుడి చేతిలో తెలంగాణ బందీ
అమరుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం... కేసీఆర్‌ అనే మూర్ఖుడి చేతిలో చిక్కుకుపోయిందని బండి సంజయ్‌ విమర్శించారు. తెలంగాణ తల్లి కేసీఆర్‌ గడీలో బందీ అయి బంధవిముక్తి కోసం దీనంగా రోదిస్తోందని అన్నారు. కేసీఆర్‌ గడీలు బద్దలు కొట్టి తెలంగాణ తల్లిని విముక్తి చేసేందుకు ప్రతీ ఒక్కరు కదలాలని పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రను చూసి కేసీఆర్‌కు తలనొప్పి వచ్చిందని, ఆయనకు జండూబామ్‌ అవసరమని ఎద్దేవా చేశారు.  

బీజేపీ ఎవ్వరికీ భయపడే పార్టీ కాదని అన్నారు. బీజేపీ ముందు గుండాగిరీ, దాదాగిరి పనిచేయదని హెచ్చరించారు. పైసలు, అధికారంతో దాదాగిరి చేయాలని చూస్తే నడవదన్నారు. అవసరమైతే పేదల కోసం టీఆర్‌ఎస్‌ కంటే ఎక్కువ గూండాగిరి, దాదాగిరి, రౌడీయిజం చేస్తామన్నారు.  12 శాతం ఉన్న ముస్లింలు బీహార్‌లో ఎంఐఎంకు 4 సీట్లు ఇచ్చారని, తెలంగాణలో 80 శాతం ఉన్న హిందువులు ఎందుకు గెలిపించుకోకూడదని అన్నారు. ఒక హిందువు తాను హిందువునని చెప్పుకుంటే మతతత్వ వాది అని ముద్ర వేసే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్‌కు మళ్లీ అధికారం రాదని, టీఆర్‌ఎ్‌సలోని ఎమ్మె ల్యేలు మునుగోడు లాగా తమకూ ఉప ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారన్నారు. దాన్ని గ్రహించే అందిన కాడికి దోచుకుంటున్నాడని మండిపడ్డారు. భవిష్యత్తులో అధికారం కోల్పోతే లండన్‌, మస్కట్‌కు తండ్రీ కొడుకులు పారిపోయేందుకే రూ. వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు.  ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా పోలీసులు దుకాణాలను బలవంతంగా మూయుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే పాతబస్తీ ప్రతి గల్లీలో ప్రజా సంగ్రామ యాత్ర చేస్తానన్నారు. కేసీఆర్‌ గడీలను బద్దలు కొట్టేందుకు ఇదే చివరి ఉద్యమం కావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం కలిసి పనిచేద్దామని, ప్రజలు బీజేపీకి సమయం కేటాయించాలని కోరారు.

ప్రజా సంగ్రామయాత్రలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు సుబ్రహ్మణ్యం, సంగ్రామ యాత్ర రాష్ట్ర  ఇన్‌చార్జి గంగిడి మనోహర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, యాత్ర జిల్లా ఇన్‌చార్జి విద్యాసాగర్‌రెడ్డి, నాయకులు కేవీఎల్‌ఎన్‌రెడ్డి, ప్రేమలతారెడ్డి, ముక్కెర తిరుపతిరెడ్డి, ఉడుగుల రమేశ్‌, సౌడ రమేశ్‌, కర్ర శ్రీనివా్‌సరెడ్డి, బొట్ల శ్రీనివాస్‌, మహంకాళి హరిశ్చంద్రగుప్త, శివరాజ్‌యాదవ్‌, పవన్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

జనసంద్రమైన జనగామ చౌరస్తా
జనగామ టౌన్‌, ఆగస్టు 18: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా జనగామ చౌరస్తా ప్రాంతం జనసంద్రమైంది. సంజయ్‌ పాదయాత్ర సాయంత్రం 7 గంటలకు జనగామకు చేరుకోగా.. దానికి రెండు గంటల ముందు నుంచే భారీగా జనం పోగయ్యారు. బీజేపీ నాయకులు పట్టణంలోని అన్ని వార్డుల నుంచి జనాన్ని సమీకరించారు. చౌరస్తాలో నలుదిక్కులూ కార్యకర్తలు, జనంతో నిండిపోయాయి. చౌరస్తాలో బోనాలతో మహిళల ప్రదర్శన ఆకట్టుకుంది. జనం మధ్య ఎక్కడ చూసినా పోలీసులే కనిపించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.

నేటి యాత్ర షెడ్యూల్‌...

జనగామ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర శుక్రవారం జనగామ, రఘునాథపల్లి మండలాల్లో కొనసాగనుంది. గురువారం నాడు లింగాలఘణపురం మండలం కుందారం, నెల్లుట్ల మీదుగా జనగామ జిల్లాకేంద్రానికి చేరుకున్న యాత్ర... అక్కడి నుంచి రాత్రి నెహ్రూ పార్కు, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మీదుగా వీవర్స్‌కాలనీ సమీపంలోని రెడ్డి సంఘం వద్దకు చేరుకుంది.  రాత్రి అక్కడే బస చేసిన సంజయ్‌.. శుక్రవారం ఉదయం అక్కడి నుంచే ఐదో రోజు యాత్ర ప్రారంభించనున్నారు.  జనగామ మండలంలోని చీటకోడూరు, చౌడారం, బాషాతండా, రఘునాథపల్లి మండలంలోని రామచంద్రగూడెం, లక్ష్మీతండా, మాదారం మీదుగా ఖిలాషాపూర్‌ చేరుకుని, రాత్రి అక్కడే బస చేస్తారు.



Updated Date - 2022-08-19T05:54:57+05:30 IST