‘కారు’ సారథులు ఖరారు

ABN , First Publish Date - 2022-01-27T05:33:40+05:30 IST

ఎట్టకేలకు గులాబీ పార్టీకి లీడర్లు ఎవరో తేలింది. ఆరేళ్లుగా జిల్లా కమిటీలు నియమించకుండా ఎమ్మెల్యేల పర్యవేక్షణలోనే పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్న టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం.. ఎట్టకేలకు పార్టీ జిలాల అధ్యక్షులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

‘కారు’ సారథులు ఖరారు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుల నియామకం
హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌
వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌
ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. నేతల సంబరాలు


వరంగల్‌(ఆంధ్రజ్యోతి)/హనుమకొండ టౌన్‌, జనవరి 26 :
ఎట్టకేలకు గులాబీ పార్టీకి లీడర్లు ఎవరో తేలింది. ఆరేళ్లుగా జిల్లా కమిటీలు నియమించకుండా ఎమ్మెల్యేల పర్యవేక్షణలోనే పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్న టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం.. ఎట్టకేలకు పార్టీ జిలాల అధ్యక్షులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష స్థానాల కోసం జిల్లాల వారిగా సీనియర్ల జాబితాను తీసుకున్న రాష్ట్ర పార్టీ ఆ పేర్లను పక్కను పెట్టి ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్‌లను జిల్లాలకు అధ్యక్షులను నియమించడం విశేషం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమిస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఉద్యమకారుడికే..
తెలంగాణ రాష్ట్ర సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌ నియమితులయ్యారు. 2005లో టీఆర్‌ఎ్‌సలో చేరిన వినయభాస్కర్‌.. పార్టీ అర్బన్‌ అధ్యక్షుడిగా పదవిని చేపట్టి ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. 2005లో కార్పొరేటర్‌గా టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికైన వినయభాస్కర్‌ 2009, 2010, 2014, 2018లో వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై కొనసాగుతున్న వినయభాస్కర్‌ ప్రభుత్వ చీఫ్‌వి్‌పగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అరూరిదే వరంగల్‌
వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్న అరూరి రమేశ్‌ నియామకమయ్యారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం, ఉప్పుగల్లు గ్రామానికి చెందిన అరూరి రమేష్‌ రాజకీయ ప్రస్థానం 1987లో మొదలైంది. 1987లో తెలుగు యువత ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. 1994లో టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున స్టేషన్‌ఘన్‌పూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2012లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.  2013లో వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోటీచేసి 86,349ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం 99,240 ఓట్లతో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

నాగుర్లకు మరోసారి మొండిచేయి

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాగుర్ల వెంకటేశ్వర్లుకు మరోసారి నిరాశే మిగిలింది. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు పేరును ఏకగ్రీవంగా ఎంపిక చేసి రాష్ట్రపార్టీకి పంపగా ఆయన పేరును పక్కన పెట్టినట్లు స్పష్టమవుతోంది. ప్రతీ జిల్లా నుంచి రెండుకు మించి పేర్లు పంపినప్పటికీ హనుమకొండ జిల్లా నుంచి నాగుర్ల వెంకటేశ్వర్లు పేరు ఒక్కటి మాత్రమే పంపారు. అధ్యక్ష పదవి నాగుర్లకే అనే ప్రచారం సాగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన జాబితాలో ఆయన పేరు లేకపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో సైతం మేయర్‌ అభ్యర్థి నాగుర్ల వెంకటేశ్వర్లు అనే ప్రచారం సాగినప్పటికీ ముఖ్యమంత్రి గుండు సుధారాణి పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తంగా నాగుర్ల వెంకటేశ్వర్లు రెండు పదవులు ఆశించి భంగపడ్డట్లు అయింది.

వరంగల్‌ తూర్పు, నర్సంపేట నేతలకు నిరాశ..
వరంగల్‌ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం జిల్లాలోని నేతలు తహతహలాడారు. నర్సంపేట, వరంగల్‌ తూర్పు నియోజకవర్గాలకు చెందిన లీడర్లు పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వరంగల్‌ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గంలోనే ఎక్కువ మండలాలు ఉండడంతో ఈ నియోజకవర్గం నుంచే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉంటారని భావించారు. కానీ అనూహ్యంగా వరంగల్‌ సిటీ, నర్సంపేట నియోజకవర్గాలకు కాకుండా రెండు మండలాలున్న వర్ధన్నపేట నియోజకవర్గానికి జిల్లా పార్టీ అ ధ్యక్ష పదవిని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం కట్టబెట్టింది. వరంగల్‌ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాలకు ఎవరికి ఇచ్చినా కూ డా తలనొప్పి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడం తో పార్టీ ఈ ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. వరంగల్‌ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల్లో చాలా మంది నేతలు పార్టీ పదవిపై ఆశలు పెట్టుకోగా, ఎవరికి ఇచ్చినా కూడా పవర్‌ సెంటర్‌లో ప్రకంపనలు వచ్చే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యేలు పార్టీ పదవిపై సిఫార్సులకు దూరంగా ఉన్నట్టు తెలిసింది. ఈ కారణంగానే వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మె ల్యే అరూరి రమేశ్‌కు పగ్గాలను అప్పగించినట్టు తెలిసింది.

సంబరాలు
హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వినయభాస్కర్‌ ఎన్నిక కావడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన వెంటనే వినయభాస్కర్‌ క్యాంపు కార్యాలయానికి చేరుకున్న పార్టీ నేతలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. సంబరాల్లో కార్పొరేటర్లు రంజిత్‌రావు, రాములు, నేతలు ప్రశాంత్‌, పులి రజనీకాంత్‌, చాగంటి రమేశ్‌, ఈశ్వర్‌రాజు తదితరులు పాల్గొన్నారు. ఇక టీఆర్‌ఎస్‌ పార్టీ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచ్ఛాలను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

జనగామలో ‘పాగాల’కు పట్టం
జనగామ (ఆంధ్రజ్యోతి): జనగామ జిల్లా టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుత జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పా గాల సంపత్‌రెడ్డి పేరును సీఎం ఖరారు చేశారు. 2001లో ఆవిర్భావం సమయంలో టీఆర్‌ఎ్‌సలో చేరిన సంపత్‌రెడ్డి ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగుతున్నా రు. 2002లో ఉమ్మడి జిల్లా యువజన విభాగం ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా పనిచేసిన ఆయన.. 2019 నుంచి జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. మొదటి నుంచి పార్టీ పట్ల విధేయుడిగా ఉండడం, మంత్రి దయాకర్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యలను కలుపుకొని పోవడం ఆయనకు కలిసొచ్చింది. దీంతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉండడం కూడా ఉపయోగపడింది.

మానుకోట మాలోతుకే..

మహబూబాబాద్‌ (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ మానుకోట జిల్లా అధ్యక్షురాలిగా స్ధానిక ఎంపీ మాలోతు కవి త నియామకమయ్యారు. డోర్నకల్‌ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యుడు డీఎ్‌స.రెడ్యానాయక్‌ కుమార్తెగా రాజకీయ ఆరంగేట్రం చేసిన మాలోతు కవిత 2009లో మహబూబాబాద్‌ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత తెలంగాణ రా ష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనంతో 2014లో కాంగ్రెస్‌ నుంచి మరోమారు పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా డోర్నకల్‌ నుంచి గెలిచిన రెడ్యానాయక్‌తో కలిసి టీఆర్‌ఎ్‌సలో చేరారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌, వర్థన్నపేట, జనగామ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌తో మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీచేసి భారీ మెజారిటీతో గెలుపొందారు.

ములుగు అఽధ్యక్షుడిగా జగదీశ్‌
ములుగు: టీఆర్‌ఎస్‌ ములుగు జిల్లా అధ్యక్షుడిగా కు సుమ జగదీశ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ములుగు జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా కొనసాగుతున్న ఆయనకు ఈ అవకాశం దక్కడంపై పార్టీ శ్రేణుల్లో హర్హం వ్యక్తమైంది. కొత్తగా జిల్లాగా ఏర్పడిన ములుగుకు తొలి జడ్పీ చైర్మన్‌గా ఆయన గుర్తింపు పొందారు. పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా కొనసాగుతున్న ఆయనకు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం దక్కింది.

భూపాలపల్లికి గండ్ర జ్యోతి
కృష్ణకాలనీ: టీఆర్‌ఎస్‌ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలిగా గండ్ర జ్యోతి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి అయిన గండ్ర జ్యోతి వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. భూపాలపల్లి పార్టీ కార్యకలాపాల్లో భర్తతో కలిసి చురుగ్గా పాల్గొంటున్న ఆమెకు ఈ అవకాశం దక్కడంపై టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.







Updated Date - 2022-01-27T05:33:40+05:30 IST