రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నిరసనల హోరు

ABN , First Publish Date - 2022-04-09T06:56:54+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కూడా టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనల

రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌  నిరసనల హోరు

  • ఆందోళనల్లో పాల్గొన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు 
  • కేంద్ర సర్కారు, ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనం
  • ధాన్యం కొనేవరకు పోరాటాన్ని ఆపం: పువ్వాడ
  •   క్యాంపు ఆఫీసులపై  నల్లజెండాలు ఎగురవేసి నిరసన 
  •  కేంద్రానిది అణిచివేత ధోరణి: అల్లోల
  • ధాన్యం కొనేవరకు పోరాటమే: పువ్వాడ



(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కూడా టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనల హోరు కొనసాగించారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అధిష్ఠానం ఇచ్చిన పిలుపుమేరకు టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు తమ ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేశారు. బైకు ర్యాలీలు నిర్వహిస్తూ, ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నిర్మల్‌ జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నిరసనలు తెలిపింది. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తన ఇంటిపై నల్ల జెండా ఎగురవేసి, అనంతరం మాట్లాడారు. వడ్లు కొనేదాక రైతుల తరఫున కేంద్రంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.


నిజామాబాద్‌ జిల్లాలోని వేల్పూర్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా తమ ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేశారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ నల్ల చొక్కా ధరించి తన ఇంటిపై నల్ల జెండా ఎగురవేశారు. గల్లీ నుంచి మొదలైన ఈ ఉద్యమాన్ని ఢిల్లీలో కూడా చేపట్టి కేంద్రం మెడలు వంచుతామని ఆయన అన్నారు. మానకొండూర్‌, చొప్పదండి నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌తోపాటు ఆయామండలాలు, గ్రామాల టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజాప్రతినిధులు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేశారు. జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి, కోరుట్ల పట్టణాల్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎమ్మెల్యే బాల్క సుమన్‌ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.


ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కూడా బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని అప్పటివరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర సర్కారు మొండివైఖరిని మానుకోకపోతే రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు తమ ఇళ్లపై నల్లా జెండాలు ఎగురవేశారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హనుమకొండలోని తన నివాసంపై నల్ల జెండా ఎగురవేశారు.


మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంపై ఎంపీ, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత నల్లజెండా ఎగురవే శారు. వికారాబాద్‌ జిల్లాలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి తన ఇంటిపై నల్ల జెండా ఎగురవేసి నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీఆర్‌ఎస్‌ నిర్వహించిన బైక్‌ ర్యాలీలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.


 ఆహార ధాన్యాల సేకరణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా శుక్రవారం సాయంత్రం సత్తుపల్లి పట్టణంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతులతో నిర్వహించిన ద్విచక్ర వాహనాల ర్యాలీలో సండ్ర  వెంకటవీరయ్య పాల్గొన్నారు.


దున్నపోతుకు ఎమ్మెల్యే జోగు వినతిపత్రం 

ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు నల్ల జెండాలు ఎగురవేసి ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న దున్నపోతుకు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేవరకు పోరాటం ఆగదన్నారు. 



తెలంగాణ భవన్‌ వేదికగా ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ధర్నా


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలుపై ఈ నెల 11న ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ చేయబోయే ధర్నా వేదిక ఖరారైంది. ఢిల్లీలోని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ ఉమ్మడి భవన్‌ ప్రాంగణంలో ధర్నా నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం ఎంపీలు జె. సంతోష్‌ కుమార్‌, రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, సీఎం ముఖ్యభద్రతాధికారి శ్రీనివాస్‌, తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌లు పర్యవేక్షించారు. ధర్నాకు దాదాపు 1500 మంది రావచ్చని అంచనా వేస్తున్నారు.


ఈ సందర్భంగా పల్లా విలేకరులతో మాట్లాడుతూ ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.  సీఎం పాల్గొనేదీ లేనిది ఆ రోజు ఉదయం ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి 600 శాతం పెరిగిందని, కానీ కేంద్రం కొనుగోలుకు ఏర్పాట్లు చేయలేదని చెప్పారు. ధర్నాలో పాల్గొనాలని రైతులు అనుకుంటున్నా దూరాభారం దృష్ట్యా ప్రజాప్రతినిధులకే పరిమితం చేశామన్నారు.  

Updated Date - 2022-04-09T06:56:54+05:30 IST