కేంద్రంపై చావుడప్పు

ABN , First Publish Date - 2021-12-21T06:47:07+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు కదం తొక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించాయి. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టారు.

కేంద్రంపై చావుడప్పు

  • రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నిరసనల హోరు
  • జిల్లా కేంద్రం నుంచి గ్రామాల దాకా
  • కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాలు, ర్యాలీలు
  • బీజేపీ సర్కారుపై చావుడప్పు మోతలు
  • మోదీ శవయాత్రలు, దిష్టిబొమ్మ దహనాలు
  • వడ్లు కొనుగోలు కోసం రైతులు
  • బీజేపీ నేతలను నిలదీయాలి: హరీశ్‌రావు
  • కేసీఆర్‌ను ముట్టుకుంటే దేశం భగ్గు 
  • రైతులతో పెట్టుకుంటే బీజేపీ పతనమే
  • శ్రీనివాస్‌గౌడ్‌, పువ్వాడ అజయ్‌ వ్యాఖ్యలు
  • నిరసనల్లో పాల్గొనని కేసీఆర్‌, కేటీఆర్‌


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు కదం తొక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించాయి. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టారు. మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, నేతలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రాల నుంచి గ్రామ స్థాయి వరకు ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రధాని నరేంద్రమోదీ శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనం చేపట్టారు.  రైతులు పండించిన ప్రతి వడ్ల గింజనూ కేంద్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం సేకరణ చేపట్టకుండా కేంద్రం మొండివైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. కేంద్ర సర్కారు వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. పంజాబ్‌ సహా పలు రాష్ట్రాల్లో వంద శాతం ధాన్యాన్ని సేకరిస్తూ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఆంక్షలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో నిర్వహించిన ధర్నాలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు.


వడ్ల కొనుగోలు కోసం రైతులు బీజేపీ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఆహార భద్రత బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. పంటలు పండించడం రాష్ట్రం బాధ్యత అని, పంటలను సేకరించే బాధ్యత కేంద్రానిదని తెలిపారు. ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న మంచిపేరును దెబ్బతీయడానికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను ఆగం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ప్రధానిని ఒప్పించి యాసంగిలో వడ్లు కొనుగోలు చేయించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. చావుడప్పు మోగించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన నిరసనలో మంత్రి సత్యవతిరాథోడ్‌, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై చావుడప్పు కొట్టి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.


శ్రుతి మించిన నిరసన..

హనుమకొండ జిల్లా ఐనవోలులో ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు పాడెకట్టి చావుడప్పులతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఖిలా వరంగల్‌లో చేపట్టిన నిరసన శ్రుతి మించింది. మోదీని పోలిన బొమ్మను తయారుచేసి పాడెకు కట్టి స్వర్గరథంపై ఊరేగించారు. నిజమైన అంతిమయాత్ర, అంత్యక్రియల వలె  కార్యక్రమం నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి.. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. వ్యవసాయ రంగాన్ని అదానీ, అంబానీలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి ఆరోపించారు. తెలంగాణలో భయాందోళనలు కలిగించి వశం చేసుకోవాలనుకోవడం బీజేపీ వల్ల కాదు కదా.. వారి జేజమ్మ వల్ల కూడా కాదన్నారు.  కేసీఆర్‌ను ముట్టుకుంటే దేశం భగ్గుమంటుందని హెచ్చరించారు.  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘ఊరూరా చావు డప్పు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ శవయాత్ర, దిష్టిబొమ్మల దహనం చేపట్టారు. చిట్యాలలో శాసనమండలి మాజీ చైర్మన్‌, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని గుత్తా ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు సీఎం కేసీఆర్‌ను జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని, కానీ.. వీటికి కేసీఆర్‌ భయపడరని అన్నారు. నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌లో నిరసన కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. 


డప్పు కొట్టి పువ్వాడ నిరసన..

ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ డప్పుకొట్టి నిరసన తెలిపారు. రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలు, పార్టీలు దేశంలో మనుగడ సాఽగించలేవని, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకీ పతనం తప్పదని అన్నారు. అబద్ధాలు చెబుతూ, మోసాలు చేస్తూ బీజేపీ నేతలు రైతులను మభ్యపెడుతున్నారని, యాసంగి ధాన్యాన్ని కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ దమ్ముంటే కొని చూపించాలని సవాల్‌ విసిరారు. ఖమ్మం జిల్లా తల్లాడలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఎడ్లబండ్లతో ప్రదర్శన నిర్వహించి నల్లదుస్తులు ధరించి ధాన్యం బస్తాలు మోస్తూ నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆకులమైలారంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఽమల్లాపూర్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ నిరసనలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో పలు చోట్ల ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. కాగా, టీఆర్‌ఎస్‌ నిరసనల్లో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఎక్కడా పాల్గొనలేదు.


ఎమ్మెల్యే రాజయ్యకు తప్పిన ప్రమాదం

స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్యకు త్రుటిలో ప్రమాదం తప్పింది. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో దిష్టిబొమ్మ వద్ద ఆయన నిలబడి ఉండగా ఓ కార్యకర్త దానిపై పెట్రోల్‌ పోశాడు. మరో కార్యకర్త వెంటనే అగ్గిపుల్ల గీసి దిష్టిబొమ్మపై వేశాడు. దీంతో ఒక్కసారిగా మంట పైకి లేచింది. ఎమ్మెల్యే ముఖానికి సెగ తగిలింది. ఐదు నిమిషాల పాటు ఆయన అచేతనావస్థలో ఉండిపోయారు. వెంటనే కార్యకర్తలు ఆయనకు నీళ్లు తాగించగా కొంతసేపటికి తేరుకున్నారు. 


నిరసనలో అడ్డా కూలీలు

నిజామాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు బదులు అడ్డా కూలీలు హాజరు కావడం చర్చనీయాంశమైంది. కార్యక్రమం అనంతరం కూలీలకు రూ.200 మాత్రమే ఇవ్వడంతో వారు నేతలతో గొడవకు దిగారు. దీంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఇక రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. దిష్టిబొమ్మపై పెట్రోల్‌ చల్లుతుండగా మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ రమేశ్‌నాయక్‌ కాలిపై పడి నిప్పంటుకుంది. కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై మంటను ఆర్పారు. రమేశ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

Updated Date - 2021-12-21T06:47:07+05:30 IST