బాలికపై టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధి అత్యాచారం

ABN , First Publish Date - 2022-02-28T07:53:13+05:30 IST

అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అభంశుభం తెలియని ఓ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘాతుకాన్ని గోప్యంగా పెట్టే ప్రయత్నం చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో విషయం వెలుగుచూసింది.

బాలికపై టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధి అత్యాచారం

  • దావత్‌ పేరుతో చార్మినార్‌కు తీసుకెళ్లి ఘాతుకం
  • నిందితుడు నిర్మల్‌ మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌
  • దావత్‌ పేరుతో చార్మినార్‌కు తీసుకెళ్లి లాడ్జిలో దాష్టీకం
  • నిర్మల్‌ పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు
  • ఐపీసీ, పోక్సో కింద రేప్‌ కేసు నమోదు 
  • నిందితుల్లో మహిళా మధ్యవర్తి, డ్రైవర్‌
  • పరారీలో నిందితులు.. వీసీ పదవికి ఎసరు


నిర్మల్‌ అర్బన్‌, ఫిబ్రవరి 27: అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అభంశుభం తెలియని ఓ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘాతుకాన్ని గోప్యంగా పెట్టే ప్రయత్నం చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో విషయం వెలుగుచూసింది. నిర్మల్‌ డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి కథనం ప్రకారం.. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్‌పేట్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నేత షేక్‌ సాజిద్‌ స్థానిక వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికై.. చిన్నవయసులోనే వైస్‌ చైర్మన్‌ పదవిని చేపట్టాడు. ఇటీవల ఓ పూజా కార్యక్రమానికి హాజరైన సాజిద్‌.. అక్కడ ఓ 16 ఏళ్ల బాలికపై కన్నేశాడు. అంతే.. ఆ బాలికను శారీరకంగా లొంగదీసుకునేందుకు అన్నపూర్ణమ్మ అనే మహిళను రంగంలోకి దింపాడు. అన్నపూర్ణమ్మ ఆ బాలికను నమ్మించి.. నిజామాబాద్‌ వరకు వెళ్లాలి.. తోడు రమ్మంటూ వెంటబెట్టుకెళ్లింది. ఆ తర్వాత.. ‘‘హైదరాబాద్‌లో ఓ దావత్‌ ఉంది. అక్కడికే వెళ్తున్నాను. ఇక్కడిలాగా కాదు. గ్రాండ్‌గా ఉంటుందా ఫంక్షన్‌. నువ్వుకూడా సరదాగా రావొచ్చు కదా?’’ అంటూ ఆఫరిచ్చింది. సాయంత్రానికి తిరిగి వచ్చేయొచ్చని, కారులోనే వెళ్తామని చెప్పింది. దీంతో.. తెలిసిన మహిళే కదా? అని ఆ బాలిక సరేనని చెప్పింది. ఆ తర్వాత ఆ మహిళ ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది. కాసేపటికి ఓ కారు వచ్చింది. డ్రైవర్‌, అన్నపూర్ణమ్మతో కలిసి ఆ బాలిక కారులో బయలుదేరింది. చార్మినార్‌ సమీపంలోని ఓ లాడ్జిలో అప్పటికే బసచేసిన వైస్‌ చైర్మన్‌ షేక్‌ సాజిద్‌కు ఆ బాలికను అప్పగించింది.


అతను ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమెను బెదిరించి, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశాడు. భయంభయంగా ఇంటికి వచ్చిన బాలికను.. విషయమేంటని తల్లి ప్రశ్నించడంతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. దాంతో ఆ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాజిద్‌పై పోక్సో, ఐపీసీ చట్టాల్లోని రేప్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాజిద్‌కు సహకరించిన అన్నపూర్ణమ్మ, బాలికను నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చిన కారు డ్రైవర్‌లను నిందితులుగా చేర్చారు. ఈ ముగ్గురూ పరారీలో ఉన్నారని డీఎస్పీ వివరించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు గళమెత్తాయి. ఈ ఘటనతో అధికార టీఆర్‌ఎ్‌సలో తీవ్ర కలకలం రేగుతోంది.


పార్టీ నుంచి సస్పెన్షన్‌ వేటుకు రంగం

షేక్‌ సాజిద్‌పై రేప్‌ కేసు నమోదవ్వడంతో అతణ్ని నుంచి సస్పెండ్‌ చేయాలని పార్టీ వర్గాల నుంచే డిమాండ్‌ పెరుగుతోంది. దీనిపై పార్టీ శ్రేణులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. విచారణ కమిటీ వేసి, కఠిన చర్యలు తీసుకునే దిశలో అడుగులు వేస్తున్నాయి. సాజిద్‌ ఇంకా పార్టీలో ఉంటే.. చెడ్డపేరు తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. అతణ్ని తొలగించకుంటే.. పార్టీకే పెద్ద మచ్చ అని ఆందోళన వ్యక్తం చేశారు. అటు సాజిద్‌ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవికీ ముప్పు తప్పదని పార్టీవర్గాలు అంటున్నాయి.


నిర్మల్‌ పరిసరాల్లోనే నిందితులు?

నిందితులను అరెస్టు చేసేందుకు నిర్మల్‌ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అదే సమయంలో సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. వారి సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ అయినట్లు గుర్తించారు. వారి సెల్‌టవర్‌ సిగ్నల్స్‌ చివరిసారి నిర్మల్‌, పరిసరాల్లోనే చూపించినట్లు తెలిసింది. వారు తలదాచుకునే అవకాశాలున్న ప్రాంతాలపై పోలీసులు నిఘా పెట్టారు. ‘‘సోమవారం తెల్లవారుజాముకల్లా అరెస్టులు జరిగే అవకాశం ఉంది’’ అని ఓ పోలీసు అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈ ఘటనపై సోమవారం జిల్లా ఎస్పీ ప్రెస్‌మీట్‌ పెట్టే అవకాశాలున్నాయి.

Updated Date - 2022-02-28T07:53:13+05:30 IST