భవన్‌లో TRS వ్యూహాలు.. బెరుకు ఉండొద్దు.. ‘మేడమ్‌.. మీరూ సహకరించాలి.. ఆసక్తి రేకేత్తిస్తున్న సమావేశం!

ABN , First Publish Date - 2021-12-16T16:42:48+05:30 IST

‘మేడమ్‌.. మీరూ కార్పొరేటర్‌గా ఓ పర్యాయం పని చేసి మేయర్‌ అయ్యారు. మాకు...

భవన్‌లో TRS వ్యూహాలు.. బెరుకు ఉండొద్దు.. ‘మేడమ్‌.. మీరూ సహకరించాలి.. ఆసక్తి రేకేత్తిస్తున్న సమావేశం!

  • గ్రేటర్‌ కౌన్సిల్‌ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ సమావేశం
  • కార్పొరేటర్లకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల దిశానిర్దేశం
  • సర్వసభ్య సమావేశంలో మాట్లాడేందుకు పలువురు కార్పొరేటర్ల ఎంపిక
  • ఎవరెవరు ఏం మాట్లాడాలో నేడు నిర్ణయం

హైదరాబాద్‌ సిటీ : గతం కంటే ప్రతిపక్షాల బలం పెరిగిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై టీఆర్‌ఎస్‌ సమావేశమైంది. 18న జరగనున్న కౌన్సిల్‌ సమావేశంలో ప్రతిపక్షాల ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి, వారి విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టడం ఎలా అన్న అంశాలపై మంత్రులు, ఎంపీలు కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. కౌన్సిల్‌ సమావేశం సమన్వయం కోసం ఏకంగా కమిటీని నియమించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రేటర్‌ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను వివరించడంతోపాటు.. కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో రహదారుల విస్తరణ, ఇతరత్రా అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకార లోపాన్నీ ప్రస్తావించాలని సూచించారు.


వ్యూహరచన..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2016లో మొదటిసారి జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తిరుగు లేని విజయం సాధించింది. రికార్డు స్థాయిలో 99 డివిజన్లలో గెలిచి బల్దియా పీఠం కైవసం చేసుకుంది. ఎంఐఎం 44, బీజేపీ-4, కాంగ్రెస్‌-2, టీడీపీ ఒక స్థానంలో గెలిచాయి. రెండో స్థానంలో ఉన్న ఎంఐఎం మిత్రపక్షంగా ఉండడంతో కౌన్సిల్‌ సమావేశాలు అవాంతరాలు, అభ్యంతరాలు లేకుండా అధికార పార్టీ కోరుకున్నట్టు జరిగేవి. ఇప్పుడా పరిస్థితి దాదాపుగా ఉండదు. 2020 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 56 స్థానాలకు పరిమితమైంది. అధికార పార్టీకి ఈ ఫలితాలు మింగుడుపడని విషయం. అదే సమయంలో బీజేపీ 46 సభ్యుల సంఖ్యాబలంతో ఉంది. 44 మంది సభ్యులున్న టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం సహకరించే అవకాశం ఉన్నా.. బీజేపీ బలం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండడంతో కౌన్సిల్‌లో ప్రతికూల వాతావరణం ఏర్పడే పరిస్థితులున్నాయి. నిబంధనల ప్రకారం సమావేశం నిర్వహించనందుకే బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. మేయర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నేపథ్యంలో మీటింగ్‌లో ఎలా వ్యవహరిస్తారో అన్న ఆందోళన టీఆర్‌ఎస్‌ నేతల్లో కనిపిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ భవన్‌లో వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది.


అభివృద్ధిని వివరించండి..

జీహెచ్‌ఎంసీ పరిధిలోని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో నగర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ, మల్లారెడ్డిలు బుధవారం తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. వేల కోట్ల రూపాయలతో గ్రేటర్‌లో చేపట్టిన వంతెనలు, అండర్‌పా‌స్‌లు, ఇతరత్రా అభివృద్ధి పనులు, సురక్షిత తాగునీటి సరఫరా, ముంపు ముప్పునకు చెక్‌ పెట్టేందుకు అమలు చేస్తోన్న ప్రణాళికలు, 4500 స్వచ్ఛ ట్రాలీల ద్వారా చెత్త సేకరణ తదితర అంశాలను సమావేశంలో వివరించాలన్నారు. కార్పొరేటర్లు తమ డివిజన్‌ సమస్యల వరకే పరిమితం కాకుండా.. జీహెచ్‌ఎంసీ ఏ పనులు చేస్తోందనే దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. మొదటిసారి సమావేశంలో పాల్గొంటున్నామన్న బెరుకు ఉండవద్దని, తామూ మీ స్థాయి నుంచే ఇక్కడకు వచ్చామని ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్పారు. మొత్తంగా శనివారం జరుగనున్న కౌన్సిల్‌ సమావేశం ఆసక్తికరంగా సాగే అవకాశముంది.


పలువురి ఎంపిక..

టీఆర్‌ఎస్‌కు చెందిన 56 మంది కార్పొరేటర్లలో మెజార్టీ మొదటిసారి గెలిచిన వారే. కౌన్సిల్‌లో మాట్లాడడం వారికి ఇబ్బందికరంగా ఉంటుందన్న ఉద్దేశంతో సమావేశం నిర్వహించినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలపై చర్చ జరిగే సమయంలో మాట్లాడేందుకు పలువురు కార్పొరేటర్లను ఎంపిక చేసినట్టు తెలిసింది. వీరిని సమన్వయం చేసే బాధ్యతను శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన ఓ కార్పొరేటర్‌కు అప్పగించారు. నేడు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో ఏ అంశంపై ఎవరు..? ఎలా మాట్లాడాలి..? అన్న దానిపై కార్పొరేటర్లకు మరోసారి పలు సూచనలు చేస్తారని ఓ సభ్యుడు తెలిపారు. కౌన్సిల్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై 10 మంది కార్పొరేటర్లతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు.


మేడమ్‌.. మీరూ సహకరించాలి..

మేయర్‌ గద్వాల విజయలక్ష్మి విషయాన్నీ సమావేశంలో పలువురు కార్పొరేటర్లు ప్రస్తావించినట్టు తెలిసింది. ‘మేడమ్‌.. మీరూ కార్పొరేటర్‌గా ఓ పర్యాయం పని చేసి మేయర్‌ అయ్యారు. మాకు సలహాలు, సూచనలు ఇవ్వండి. మమ్మల్ని కలుపుకొని వెళ్లాలి’ అని కోరినట్టు తెలిసింది. పౌర సమస్యల పరిష్కారంపై మేం చేసే విజ్ఞప్తులను కొందరు అధికారులు పట్టించుకోవడం లేదని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కొందరు మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ విషయాలపై మరోసారి సమావేశం ఏర్పాటు చేసుకొని మాట్లాడుదామని వారు సూచించారు. శివారు ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయింపు సరిగా లేదని ఓ ఎమ్మెల్యే పేర్కొన్నట్టు తెలిసింది.

Updated Date - 2021-12-16T16:42:48+05:30 IST