విపక్ష నేతలపై గూండాల్లా దాడి

ABN , First Publish Date - 2021-07-25T08:30:54+05:30 IST

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం, పోలీసులు కాలరాస్తున్నారని.. ప్రజా సమస్యలపై కొట్లాడే ప్రతిపక్ష నేతలపై గూండాల్లా దాడి చేస్తున్నారని...

విపక్ష నేతలపై గూండాల్లా దాడి

  • పోలీసుల తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేస్తాం: రేవంత్‌

హైదరాబాద్‌/రాంనగర్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం, పోలీసులు కాలరాస్తున్నారని.. ప్రజా సమస్యలపై కొట్లాడే ప్రతిపక్ష నేతలపై గూండాల్లా దాడి చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పోలీసుల అండతో పోరాటాలను ఆపలేరని అన్నారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం సందర్భంగా పోలీసుల దాడిలో ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్‌ వెంకట్‌ గాయపడ్డారని తెలిపారు. పోలీసుల తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. నారాయణగూడలోని వెంకట్‌ నివాసంలో శనివారం ఆయనను రేవంత్‌ పరామర్శించారు. రేవంత్‌తో పాటు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివా్‌సకృష్ణన్‌ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడారు. వెంకట్‌ను టార్గెట్‌ చేసి పక్కటెముకలు విరిగేలా కొట్టారని, దాడికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా, మన ఉద్యోగాలు మనకు కావాలన్న ఉద్యమ ఆకాంక్షకు టీఆర్‌ఎస్‌ సర్కారు తూట్లు పొడిచిందని, కేసీఆర్‌ పాలనలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్యాయం అనేక రెట్లయిందని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో తెలంగాణ బిడ్డల పట్ల వివక్షే దీనికి మరో నిదర్శనమన్నారు. ఈ ఆందోళనలు తుది దశ ఉద్యమ సంకేతాలని, కేసీఆర్‌ సిద్ధంగా ఉండాలని శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. 


Updated Date - 2021-07-25T08:30:54+05:30 IST