BJP హోర్డింగ్స్‌పై TRS కౌంటర్..

ABN , First Publish Date - 2022-06-29T18:08:25+05:30 IST

బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లపై టీఆర్ఎస్ నేతలు కౌంటరిచ్చారు.

BJP హోర్డింగ్స్‌పై TRS కౌంటర్..

హైదరాబాద్ (Hyderabad): ‘చాలు దొర - చంపకు దొర’ అంటూ నిన్న బీజేపీ నేతలు (BJP leaders) పెట్టిన హోర్డింగ్స్‌కు అంతే ధీటుగా టీఆర్ఎస్ (TRS) కౌంటరిచ్చింది. ‘చాలు మోదీ - చంపకు మోదీ’ అంటూ టీఆర్ఎస్ నేతలు హోర్డింగ్‌లు పెట్టారు. పలు ప్రశ్నలు సంధించారు. జులైలో హైదరాబాద్‌లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ హోర్డింగులు తీవ్రరూపం దాల్చడం చర్చనీయాంశమైంది.


తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. సభలు, సమావేశాలతో టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ చూస్తోంది. మేము కూడా తక్కువ కాదంటూ అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది. కార్యవర్గ సమావేశాల సందర్భంగా నగరాన్ని కాషాయమయం చేయాలనుకున్న కమలనాథుల జోష్‌కు టీఆర్ఎస్ అడ్డుకట్ట వేసింది.


ఇక నగరంలోని హోర్డింగ్స్, మెట్రో ఫిల్లర్స్ అన్నింటిని అధికార పార్టీ ముందే ఆధీనంలోకి తీసుకుంది. పరేడ్ గ్రౌండ్‌లోకి వీఐపీలు వెళ్లే గేట్ వద్ద, బస్సు షెల్టర్స్‌కు టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కట్టారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వెళ్లే ప్రధాన గేటు వద్ద సయితం టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రచారం కోసం యాడ్ ఎజెన్సీలను సంప్రదించిన బీజేపీ షాకయింది.


ఇప్పటికే టీఆర్ఎస్ బుక్ చేసుకుందంటూ యాడ్ ఎజెన్సీల నుంచి సమాధానం వచ్చింది. దీంతో పబ్లిసిటీ ఎలా చేయాలన్న దానిపై బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. మెట్రో ఎల్ అండ్ టీకి కేంద్ర పెద్దలతో చెప్పించే ప్రయత్నాల్లో కమలనాథులున్నారు. మెట్రో రైళ్లు, పేపర్ ఏజెన్సీలను సంప్రదించిన బీజేపీకి ఇదే సమాధానం వచ్చింది. ఆర్టీసీ బస్ షెల్టర్స్‌పై టీఆర్ఎస్ ఎమిదేళ్ల పాలన ఫ్లెక్సీలు వెలిసాయి.

Updated Date - 2022-06-29T18:08:25+05:30 IST