Adilabad Trs: ఆశావహుల్లో కొత్త టెన్షన్.. కేసీఆర్ నిర్ణయం ఏంటో..?

ABN , First Publish Date - 2022-09-08T03:25:24+05:30 IST

టీఆర్ఎస్‌ ‌ఎల్పీ మీట్‌లో గులాబీ బాస్ సీఎం కేసీఆర్ (Cm Kcr) మరో బాంబు పేల్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు...

Adilabad Trs: ఆశావహుల్లో కొత్త టెన్షన్.. కేసీఆర్ నిర్ణయం ఏంటో..?

ఆదిలాబాద్ (Adilabad):  టీఆర్ఎస్‌ ‌ఎల్పీ (Trslp) మీట్‌లో గులాబీ బాస్ సీఎం కేసీఆర్ (Cm Kcr) మరో బాంబు పేల్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు ఇవ్వడం ఖాయమని.. కొందరు పని తీరు మెరుగుపరుచుకోవాలని చేసిన ప్రకటనపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలు కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో జోష్ నింపగా.. మరికొందరిని టెన్షన్ పెట్టిస్తోంది. అలాగే.. ఆశావహులను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. 


ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2018 ఎన్నికల్లో 9 టీఆర్ఎస్, ఒక స్థానంలో కాంగ్రెస్ గెలుపొందింది. ఆ తర్వాత.. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే సక్కు కూడా టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఈ లెక్కన ప్రస్తుతం 10 స్థానాల్లోనూ టీఆర్ఎస్‌కు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయా స్థానాల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.  అయితే సిట్టింగులకే టికెట్లు ఇస్తామన్న కేసీఆర్ ప్రకటనతో ఆశావహులు షాక్‌ అయ్యారు. ఇంకా టీఆర్ఎస్‌లోనే ఉంటే ప్రయోజనం లేదని కొందరు ప్రత్యామ్నాయంపై దృష్టి సారిస్తున్నారట. 


ఉమ్మడి ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పరిస్థితిని పరిశీలిస్తే.. నిర్మల్ నుంచి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి (Minister indrakaran Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వయస్సులో పెద్ద వారైనా చాలా యాక్టివ్‌గా ఉంటూ కేసీఆర్ దృష్టిలో పడ్డారు. ఈ క్రమంలో తిరిగి ఆయననే బరిలో దించడం ఖాయంగా కనిపిస్తోంది. తప్పదు అంటే ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇచ్చే అవకాశం ఉందట. ఇక్కడ సీనియర్ నేతలు శ్రీహరిరావు, సత్యనారాయణగౌడ్ టికెట్ రేసులో ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్-బీజేపీని ఢీకొట్టాలంటే ఇంద్రకరణ్‌రెడ్డే సరైన అభ్యర్థి అని కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.


అటు ముథోల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి టికెట్ ఆశిస్తున్నా సమీకరణలు మాత్రం విఠల్‌రెడ్డికే అనుకూలంగా ఉన్నట్టు గులాబీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. ఇక.. చెన్నూరు, ఆదిలాబాద్, సిర్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జోగు రామన్న, కోనేరు కోనప్ప టిక్కెట్ల విషయంలో ఎలాంటి ఢోకా లేనట్టే తెలుస్తోంది. ప్రభుత్వ విప్‌గా ఉన్న బాల్క సుమన్‌కు అధిష్టానంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో.. నియోజకవర్గంలోనూ ఎదురులేకుండా పోయింది. జోగు రామన్నకు ప్రత్యామ్నాయంగా ఒకరిద్దరు ఉన్నా.. వాళ్లకు నియోజకవర్గంలో పెద్దగా పట్టు లేదు. ఇక.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కోనేరు కోనప్పకు టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది.


ఇదిలావుంటే.. ఖానాపూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు తిరిగి టికెట్ దక్కడం అనుమానమేనన్న చర్చ సాగుతోంది. ఆమెకు ప్రత్యామ్నాయంగా కేటీఆర్‌కు సన్నిహితుడైన ఓ ఎన్ఆర్ఐ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. తప్పదనుకుంటే ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్థన్‌ రాథోడ్‌కు అవకాశం దక్కొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక మంచిర్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్‌రావును మారుస్తారన్న ప్రచారం ఉండగా మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. మరోవైపు వయోభారం తదితర కారణాలు అర్వింద్‌కు మైనస్‌గా మారాయి. ఇది కాస్త నిత్యం జనాల్లో ఉండే దివాకర్‌రావుకు అనుకూలంగా మారుతోందట. దివాకర్‌రావు కుమారుడు విజిత్‌కుమార్ వర్కింగ్ ఎమ్మెల్యేగా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. దీంతో అవకాశం వస్తే బరిలో దిగాలని ఆశతో ఉన్నారట.


మరోవైపు.. ఆసిఫాబాద్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి చేరిన ఆయనకు అప్పట్లోనే టికెట్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే గతంలో సక్కు చేతిలో ఓడిపోయిన ప్రస్తుత జెడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మీ పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.  ఆమె చివరి నిమిషం వరకూ వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక.. బోథ్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వ్యతిరేక వర్గం బలంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు టికెట్ దక్కదని ప్రచారం చేస్తున్నారు. బాపురావుకు ప్రత్యామ్నాయంగా మాజీ ఎంపీ నగేష్, జెడ్పీటీసీ సభ్యుడు అనిల్ జాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. నగేష్ గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనిల్ జాదవ్ కూడా గతంలో పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో ముగ్గురిలో టికెట్ దక్కని వారు రెబెల్‌గా బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది.


ఇంతవరకూ బాగానే ఉన్నా అన్ని నియోజకవర్గాల్లో రాజకీయం ఓ ఎత్తు ఐతే.. బెల్లంపల్లి వ్యవహారం మరో ఎత్తుగా మారింది. బెల్లంపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు కొత్త తల నొప్పి వచ్చి పడింది. సీపీఐ పొత్తుతో  ఆయనకు చిక్కు వచ్చి పడింది. ఒకవేళ బెల్లంపల్లి సీటు కోసం సీపీఐ పట్టు బడితే చిన్నయ్య ఆశలు వదులుకోవాల్సిందేనట. సీపీఐకి గతంలో మాదిరిగా బలం లేదని, ఏ సమీకరణలు చూసినా తనకే అనుకూలంగా ఉన్నాయని చిన్నయ్య ధీమాతో ఉన్నారట. అయితే.. కేసీఆర్‌ మాట ప్రకారం సిట్టింగులకే టికెట్లు ఇస్తే 5 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పవని రాజకీయ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను 9 స్థానాల్లో సిట్టింగులకే అవకాశం ఇచ్చారు. ఒక్క చెన్నూరులో మాత్రమే అప్పటి విప్ ఓదెలును మార్చేసి పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్‌ను బరిలో దించారు. మొత్తంగా కేసీఆర్‌ ప్రకటన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా టీఆర్ఎస్‌ ఆశావహుల్లో కొత్త టెన్షన్‌ తెచ్చి పెట్టింది. చూడాలి మరి.. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండబోతోందో.



Updated Date - 2022-09-08T03:25:24+05:30 IST