మళ్లీ విద్యుత్‌ షాక్‌

ABN , First Publish Date - 2022-08-12T06:41:16+05:30 IST

వినియోగదారులపై ఆంధ్రప్రదేశ్‌ తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) మళ్లీ ‘ట్రూ అప్‌’ చార్జీల భారం మోపింది.

మళ్లీ విద్యుత్‌ షాక్‌

‘ట్రూ అప్‌’ చార్జీల పేరిట భారం

2014-19 మధ్య వినియోగించిన యూనిట్‌కు 7 పైసలు చొప్పున వడ్డన

ఆగస్టు నుంచి 18 నెలల పాటు వసూలు

గరిష్ఠంగా నెలకు రూ.100


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వినియోగదారులపై ఆంధ్రప్రదేశ్‌ తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) మళ్లీ ‘ట్రూ అప్‌’ చార్జీల భారం మోపింది. సరిగ్గా ఏడాది క్రితం (ఆగస్టులో) ఒక నెల  ఈ చార్జీలను వసూలుచేసింది. అయితే అనుమతి లేకుండా ట్రూ అప్‌ చార్జీలు వసూలు చేయడంపై ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) కన్నెర్ర చేయడంతో...నాడు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఆ తరువాత అధికారులు ఈఆర్‌సీని ఆశ్రయించారు. 2014 నుంచి 2019 వరకు విద్యుత్‌ కొనుగోళ్లు, సరఫరాల మధ్య భారీగా వ్యత్యాసం ఏర్పడి నష్టాలు వచ్చాయని, వాటిని పూడ్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఆ మేరకు గత ఏడాది ఒక్కో యూనిట్‌పై 44 పైసలు చొప్పున ట్రూ అప్‌ చార్జీలు వసూలుచేశారు. అయితే ఇప్పుడు ఈఆర్‌సీ యూనిట్‌కు ఏడు పైసలు మాత్రమే వసూలు చేయాలని సూచించింది. ఆ లెక్కన నష్టాలను పూడ్చుకోవడానికి 18 నెలలు ఈ భారం మోపాలని ఈపీడీసీఎల్‌ నిర్ణయించింది. ఈ చార్జీలు డిస్కమ్‌ల వారీగా వేర్వేరుగా ఉన్నాయి. అక్కడి వ్యయాలు, నష్టాల ఆధారంగా వసూలు చేసుకోవడానికి అనుమతి లభించింది. గుంటూరు జిల్లాలో యూనిట్‌కు 22 పైసలు చొప్పున 36 నెలలు వసూలు చేస్తున్నారు. ఈపీడీసీఎల్‌లో విద్యుత్‌ పంపిణీ నష్టాలు తక్కువ కావడంతో ఇక్కడ యూనిట్‌కు ఏడు పైసలు చొప్పున 18 నెలలు వసూలు చేయనున్నారు. 

ఉమ్మడి విశాఖ జిల్లాలో 2014-19 మధ్య కాలంలో గల 14,49,556 విద్యుత్‌ సర్వీసుల నుంచి ట్రూ అప్‌ చార్జీలు వసూలు చేయాలని ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ నిర్ణయించింది. ఆ కాలంలో వినియోగదారులు ఉపయోగించిన విద్యుత్‌పై యూనిట్‌కు ఏడు పైౖసలు చొప్పున లెక్కకట్టి దానిని 18 నెలలకు సర్దుబాటు చేసి నెలకు ఇంత అని వసూలు చేయనున్నది. 


600 యూనిట్లు వినియోగిస్తే... రూ.99 వడ్డన

విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో వుండే ఒక వినియోగదారుడు నెలకు సగటున 600 యూనిట్లు వినియోగిస్తున్నారు. ఆయనకు నెలకు రూ.4 వేలు అటుఇటుగా బిల్లు వస్తుంది. ఇప్పుడు ఆయనకు ఆగస్టు బిల్లులో ట్రూ అప్‌ చార్జీల కింద రూ.99 వేశారు.  


100 యూనిట్లు వినియోగిస్తే...రూ.58

ఇసుకతోటకు చెందిన ఓ వినియోగదారుడు నెలకు 100 నుంచి 120 యూనిట్లు వాడుతుంటారు. ఆయనకు ఆగస్టు నెలలో 118 యూనిట్లు వినియోగించినట్టు చూపించి రూ.531 బిల్లు పంపించారు. అందులో ట్రూ అప్‌ చార్జీలుగా రూ.58 వేశారు.


అతి తక్కువ రూ.25

అక్కయ్యపాలెంలోని ఓ వినియోగదారుడు తన ఇంటిని అద్దెకు ఇవ్వాలని కొన్నాళ్లు ఖాళీగా ఉంచారు. ఆయనకు ఆగస్టు నెల వినియోగం 27 యూనిట్లే రికార్డు అయింది. బిల్లు రూ.133కి ఇచ్చారు. అందులో ట్రూ అప్‌ చార్జీలుగా రూ.25 చూపించారు.


అద్దెకు ఉండేవారికి ఇబ్బందే

అద్దె ఇళ్లలో ఉండే వారికి ఈ ట్రూ అప్‌ చార్జీలు భారం కానున్నాయి. ఎవరూ ఏళ్ల తరబడి ఒకే ఇంటిలో ఉండరు. ఇప్పుడు వసూలుచేస్తున్న ట్రూ అప్‌ చార్జీలు 2014-2019 మధ్య కాలానివి. ఇప్పుడు ఆ ఇళ్లలో వారే ఉంటారన్న గ్యారంటీ లేదు. ఆ ఐదేళ్లలో అద్దెకు ఉన్నవారు వినియోగించిన యూనిట్లకు...ఏడు పైసల చొప్పున ఇప్పుడు వుంటున్న వారు ట్రూ అప్‌ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నెలకు అత్యధికంగా రూ.100 పడుతుంది. 

Updated Date - 2022-08-12T06:41:16+05:30 IST