'కేపిటల్'పై దాడికి ముందు ట్రంప్ ఫ్యామిలీ పార్టీ? వీడియో వైరల్!

ABN , First Publish Date - 2021-01-10T01:47:06+05:30 IST

అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో కేపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడటం ఆయనను మరింత ఇబ్బందుల్లో నెట్టేసిందనే చెప్పాలి.

'కేపిటల్'పై దాడికి ముందు ట్రంప్ ఫ్యామిలీ పార్టీ? వీడియో వైరల్!

వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో కేపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడటం ఆయనను మరింత ఇబ్బందుల్లో నెట్టేసిందనే చెప్పాలి. ఈ ఘటనతో ట్రంప్‌పై వ్యతిరేకత మరింత పెరిగింది. వెంటనే ఆయనను పదవీ నుంచి తొలగించాలంటూ డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇలాంటి సమయంలో తాజాగా ఈ ఘటనకు ముందు ట్రంప్ కుటుంబ సభ్యులు పార్టీ చేసుకున్నట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలోని దృశ్యాలను పరిశీలిస్తే.. ట్రంప్ మద్దతుదారులు కేపిటల్ భవనాన్ని ముట్టడించే ముందు వైట్‌హౌస్ ఎదుట ఏర్పాటు చేసిన ఓ టెంట్‌లో కొందరు పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుమారుడు జూనియర్ ట్రంప్, కూతురు ఇవాంక, అడ్వైజర్ కింబర్లీ గ్యూఫోయేలే, వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్‌లతో పాటు ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. 


ఈ పార్టీని జూనియర్ ట్రంప్ లైవ్ స్ట్రీమ్ చేసినట్లుగా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. మద్దతుదారులను దేశ భక్తులుగా పేర్కొన్న జూ.ట్రంప్.. వారు కేపిటల్ భవనాన్ని ముట్టడించేందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ట్రంప్ కేపిటల్ ఆందోళనను టీవీలో వీక్షిస్తున్నట్లు వీడియోలో ఉంది. అయితే, ఈ వీడియో బుధవారం ఆందోళనకు ముందు తీసిందా లేక తర్వాత తీసిందా అనేది తెలియాల్సి ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు ట్రంప్‌పై మండిపడుతున్నారు. 



Updated Date - 2021-01-10T01:47:06+05:30 IST