ఈ నేపథ్యంలో ట్రంప్ పిలుపుతో అక్కడకు చేరుకున్న వేలాది మంది ఆయన మద్దతుదారులు.. కేపిటల్ భవనంలోకి దూసుకెళ్లి, బీభత్సం సృష్టించారు. దీంతో అభిశంసన తీర్మానం ద్వారా ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు యూఎస్ ప్రతినిధుల సభ ఉపక్రమించింది. ఇదిలా ఉంటే.. బైడెన్ అధికార బాధ్యతలు స్వీకరించడానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో దేశ వ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు చేసేందుకు ట్రంప్ మద్దతుదారులు ప్రణాళికలు రచిస్తున్నారనే సమాచారం అందిందని ఎఫ్‌బీఐ వెల్లడించింది. ఈ క్రమంలో ట్రంప్.. ఓ ప్రకటన చేశారు. ‘దేశ వ్యాప్తంగా మరిన్ని నిసరన ప్రదర్శనలు జరగొచ్చని నివేదికలు చెబుతున్నాయి. అందులో చట్ట ఉల్లంఘనలు, విధ్వంసాలు, అల్లర్లు చోటు చేసుకోకూడదని నేను కోరుకుంటున్నాను. వాటికి నేను వ్యతిరేకం. అమెరికన్లు అందరూ శాంతియుతంగా ఉండాలి. సంయమనం పాటించాలి. థాంక్యూ’ అని అందులో పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం ఇది చర్చనీయాంశం అయింది.