అల్లాడిపోతున్న ట్రంప్... రోజుకు 10 వేల డాలర్ల ఫైన్..

ABN , First Publish Date - 2022-05-08T03:31:22+05:30 IST

అవును.. ప్రస్తుతం అమెరికా మాజీ అధ్యక్షుడు రోజూ 10 వేల డాలర్లు జరిమానా కింద చెల్లించాల్సిన పరిస్థితి! ఎందుకంటారా..

అల్లాడిపోతున్న ట్రంప్... రోజుకు 10 వేల డాలర్ల ఫైన్..

ఎన్నారై డెస్క్:  అవును.. ప్రస్తుతం అమెరికా మాజీ అధ్యక్షుడు రోజూ 10 వేల డాలర్లు జరిమానా కింద చెల్లించాల్సిన పరిస్థితి! ఎందుకంటారా.. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ట్రంప్‌పై మాన్‌హట్టన్ కోర్టు న్యాయమూర్తి ఈ జరిమానా విధించారు. ఏప్రిల్ 25న ఈ జరిమానా విధించగా.. అప్పటి నుంచీ ఆయన చెల్లించాల్సిన మొత్తం పెరిగిపొతూనే ఉంది. అంతేకాకుండా.. ఈ తీర్పుపై స్టే తెచ్చుకునేందుకు ట్రంప్ మరో అప్పీలు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినా కూడా చుక్కెదురే అయ్యింది. ఆయన పిటిషన్ తిరస్కరిస్తూ మంగళవారం నాడు కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో.. ఏం చేయాలో తెలీక ట్రంప్ తికమకపడుతున్నారు.  పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ స్టేట్ ఆటర్నీ ట్రంప్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ‘ట్రంప్ ఆర్గనైజేషన్‌’లో అవకతవకలపై విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో.. సంస్థ లావాదేవీలకు సంబంధించిన రికార్డులను కోర్టు ద్వారా కోరారు.  


అసలేమిటీ జాక్సన్ అఫిడవిట్..?

జాక్స్‌న్ అఫిడవిట్ దాఖలు చేసేవారు.. తాము ఎందుకు కోర్టు కోరిన డాక్యుమెంట్స్ దాఖలు చేయలేకపోయామో స్పష్టంగా  వివరించాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్లు మొదట ఎక్కడ భద్ర పరిచిందీ వెల్లడించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. కనబడకుండా పోయిన వాటిని వెతికిపట్టుకునేందుకు ఏయే చర్యలు తీసుకున్నారో కూడా వివరించాల్సి ఉంటుంది. ఇవన్నీ అండర్ ఓత్ అంటే ప్రమాణపూర్తిగా చెప్పాల్సి ఉంటుంది. వ్యక్తిగత స్థాయిలో సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. ఇక అమెరికా న్యాయవ్యవస్థలో జాక్సన్ అఫిడవిట్‌ది ప్రత్యేక చరిత్ర. నలభై ఏళ్ల నాటి జాక్సన్ వర్సెస్ న్యూయార్క్ సిటీ కేసులో తొలిసారిగా ‘జాక్సన్ అఫిడవిట్’ తెరపైకి వచ్చింది. అప్పట్లో.. అపార్ట్‌మెంట్‌లో నివసించే ఓ మహిళ మెట్లు దిగుతూ పడిపోయింది. ఆ క్రమంలో ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. ఇది జరిగిన మూడేళ్లకు ఆమె నగర పాలక సంస్థపై కేసు వేసింది. నగర పాలక సంస్థ పర్యవేక్షణ లేని కారణంగా భవనం మొత్తం అధ్వాన్న స్థితికి చేరుకుందని, ఈ కారణంగానే తనకు ప్రమాదం జరిగిందని ఆరోపించింది. ఈ క్రమంలో..  అధికారులు ఎప్పుడెప్పుడు భవంతిని తనిఖీ చేశారో అధికారులు చెప్పాలంటూ కోర్టును ఆశ్రయించింది. 


బాధితురాలు కోరిన డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించాలంటూ న్యాయమూర్తి నగరపాలక సంస్థను ఆదేశించారు. కానీ అధికారులు మాత్రం తమ వద్ద అప్పటి తనిఖీలకు సంబంధించి పాత డాక్యుమెంట్లు ఏవీ లేవని చెప్పే ప్రయత్నం చేశారు. బాధితురాలు కోరిన డాక్యుమెంట్లు ఇవ్వకుండా ఉండేందుకు అనేక కుయుక్తులు కూడా పన్నారు. ఇదంతా చూసి.. చిరెత్తుకొచ్చిన న్యాయమూర్తి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఆదేశించినట్టు అన్ని వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థపై జరిమానా విధించాలని అభిప్రాయాపడ్డారు. అంతేకాకుండా.. కేసు ట్రయల్ దశకు చేరుకున్న పక్షంలో .. నగరపాలక సంస్థ తన బాధ్యతలు సరిగా నిర్వహించలేదని జ్యూరీ సభ్యులు భావించవచ్చని కూడా మార్గదర్శకాలు జారీ చేశారు. దీంతో.. భయపడిపోయిన నగరపాలక సంస్థ బాధితురాలితో అవుట్ ఆఫ్ ది కోర్టు సెటిల్మెంట్ చేసుకుంది. అలా.. ఈ కేసులో కోర్టు కోరిన అఫిడవిట్‌ ఆ తరువాతి కాలంలో జాక్సన్ అఫిడవిట్‌గా పేరు పడింది. ఆ తరువాత అనేక కేసుల్లో న్యాయమూర్తులు ఈ కేసును ప్రస్తావిస్తూ కోర్టు కోరిన డాక్యుమెంట్లు సమర్పించని వారిపై కొరడా ఝళిపిస్తున్నారు.


సులభంగా లోన్లు పొందేందుకు ట్రంప్ ఆర్గనైజేషన్ యాజమాన్యం తమ రియల్ ఆస్తుల విలువలకు చట్టవ్యతిరేక మార్పులు చేసిందనేది ఆ సంస్థపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ దిశగానే సంస్థ రికార్డులను స్టేట్ అటార్నీ పరిశీలించాలనుకున్నారు. అయితే..అప్పటి రికార్డు తమకు దొరకట్లేదని ట్రంప్ కోర్టుకు సమాధానమిచ్చారు. ఈ మేరకు ఓ అఫిడవట్‌ను మాన్‌హట్టన్ కోర్టులో దాఖలు చేశారు. కానీ.. దీనిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పాత రికార్డులు కనిపించట్లేదని చెబితే.. కోర్టు ఆదేశాలకు బద్ధులైనట్టు కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ‘జాక్సన్ అఫిడవిట్‌’ను ట్రంప్ దాఖలు చేసే వరకూ ఆయనపై విధించిన జరిమానా రోజు రోజుకూ  పెరుగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు..

Read more