అలా జరుగుతుందని.. నేను ముందే ఊహించా: ట్రంప్

ABN , First Publish Date - 2021-03-23T17:19:43+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ మెట్లెక్కే క్రమంలో కాలు జారిన విషయం తెలిసిందే.

అలా జరుగుతుందని.. నేను ముందే ఊహించా: ట్రంప్

అధ్యక్షుడు కాలు జారిన ఘటనపై ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు: 'నేను ముందే ఊహించా.. బైడెన్ కింద పడతారని.. కమలా ఆయనను రీప్లెస్ చేస్తారని'  

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ మెట్లెక్కే క్రమంలో కాలు జారిన విషయం తెలిసిందే. 78 ఏళ్ల బైడెన్‌ వేగంగా మెట్లెక్కే క్రమంలో మూడుసార్లు కాలు జారి పడబోయారు. మళ్లీ సర్దుకుని లేచి విమానం ఎక్కారు. ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఈ ఘటనపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సోమవారం ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన ట్రంప్.. బైడెన్ కాలు జారిన ఘటనపై వ్యగ్యంగా సమాధానం ఇచ్చారు. బైడెన్ కిందపడడం.. ఆయన స్థానాన్ని అధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ భర్తీ చేయడం జరుగుతాయని తాను ముందే ఊహించానని ట్రంప్ చమత్కరించారు. బైడెన్ మానసికంగా, శారీరకంగా పూర్తి ఆరోగ్యంతో లేరని ట్రంప్ అన్నారు. అసలు బైడెన్ ఏం చేస్తున్నారో కూడా ఆయనకే తెలియదని ట్రంప్ తెలిపారు.


ప్రస్తుత బైడెన్ ఆరోగ్యపరిస్థితి దృష్ట్యా కనీసం సంతకం చేసేటప్పుడు ఫైళ్లను కూడా పరిశీలిన్నారో లేదోనని ట్రంప్ పేర్కొన్నారు. 'అధ్యక్ష భవనంలో ఏదో జరుగుతుంది. అది త్వరలోనే బయటపడుతుంది. బైడెన్ అటు ఆరోగ్యం పరంగా గానీ, ఇటు మానసికంగా గానీ పూర్తిగా ఫిట్‌గా లేరనే విషయం ఈ ఘటనతో బయటపడింది. నాకు తెలిసి త్వరలోనే ఊహించని మార్పులు సంభవించవచ్చు.' అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇదిలాఉంటే.. అమెరికా ఎన్నికల ప్రచారంలో కూడా ట్రంప్ పదేపదే బైడెన్ ఆరోగ్యం, వయస్సుపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. చిన్న చిన్న విషయాలను కూడా మరిచిపోయే బైడెన్.. తన మతిమరుపుతో దేశాన్ని ఎలా పాలించగలరని ట్రంప్ ప్రశ్నించారు. ఇదంతా కమలాకు పట్టం కట్టడానికేనని అన్నారు. డెమొక్రట్స్ 25వ సవరణను ఉపయోగించి బైడెన్ స్థానంలో కమలాను అధ్యక్షురాలిగా కూర్చొబెట్టాలనే వ్యూహంతో ఉన్నట్లు అప్పుడు ట్రంప్ ఆరోపించారు.     

Updated Date - 2021-03-23T17:19:43+05:30 IST