వాషింగ్టన్‌కు ట్రంప్ టాటా.. చివరగా బైడెన్‌కు సానుకూల వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-01-20T14:23:16+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఉదయం వాషింగ్టన్‌కు టాటా చెప్పారు. ఇన్నాళ్లు బైడెన్ విజయాన్ని ఒప్పుకొని ట్రంప్ చివరగా మాత్రం ఆయనకు సానుకూల వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

వాషింగ్టన్‌కు ట్రంప్ టాటా.. చివరగా బైడెన్‌కు సానుకూల వ్యాఖ్యలు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఉదయం వాషింగ్టన్‌కు టాటా చెప్పారు. ఇన్నాళ్లు బైడెన్ విజయాన్ని ఒప్పుకోని ట్రంప్ చివరగా మాత్రం ఆయనకు సానుకూల వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే... అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నో సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువయ్యారు. తన ట్రంపరితనంతో చివరకు రెండు సార్లు అభిశంసనం ఎదుర్కొన్న అమెరికా అధ్యక్షుడిగా అప్రదిష్టను సైతం మూటగట్టుకున్నారు. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్.. శ్వేతసౌధం నుంచి వెళ్లే వరకు కూడా తన పరాజయాన్ని అంగీకరించలేదు. బుధవారం ఉదయం అధ్యక్ష హోదాలోనే ఆయన వాషింగ్టన్‌ను వీడారు. 


అంతకుముందు బైడెన్ ప్రమాణస్వీకారోత్సవం కోసం వాషింగ్టన్‌కు బయల్దేరుతూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో జరిగిన ఫెర్వెల్‌లో బైడెన్ ఉద్వేగభరిత సందేశం ఇచ్చారు. "నా చివరి శ్వాస వరకు డెలావర్ ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటుంది. నేను ఇక్కడ లేకపోవడం నన్ను బాధిస్తున్న.. మీరు నన్ను ఇక్కడి నుంచి ప్రెసిడెంట్ చేసి పంపుతున్నందుకు చాలా సంతోషంగా" ఉందన్నారు. కాగా, బుధవారం రాత్రి 10.30 గంటలకు(భారత కాలమానం ప్రకారం) బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అమెరికా సుప్రీంకోర్టు సీజే జాన్ రాబర్ట్స్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. బైడెన్ కంటే ముందు ఉపాధ్యక్షురాలు కమలదేవి హ్యారిస్ ప్రమాణస్వీకారం చేస్తారు.    



వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడా వెళ్లే ముందు... జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద వీడ్కోలు స్పీచ్ ఇచ్చారు. కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వానికి అధికారం అప్పగిస్తున్ననన్న ట్రంప్.. తన రాజకీయ జీవితం ఇప్పుడే మొదలైందన్నారు. కేపిటల్ భవనంపై దాడిని ఖండించిన ఆయన.. రాజకీయ అల్లర్లు అగ్రరాజ్యానికే అవమానం అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ తొలిసారి బైడెన్‌కు సానుకూలంగా మాట్లాడడం గమనార్హం. అమెరికన్లందరూ బైడెన్ బృందానికి పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. రాబోయే ప్రభుత్వానికి సహకరించాలన్నారు. బైడెన్ పాలన సక్సెస్ కావాలంటూ ప్రార్థించాలని తెలిపారు. ఇక వారం రోజులుగా బయటకు రాని ట్రంప్.. చివరకు వైట్‌హౌస్‌ను వదిలేముందు మీడియాకు కనిపించారు.

Updated Date - 2021-01-20T14:23:16+05:30 IST