ట్రంప్ నోట మళ్లీ పాత పాటే.. వైట్‌హౌస్‌ను వీడేది అప్పుడేనట!

ABN , First Publish Date - 2020-11-27T20:13:35+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన ప్రభుత్వ ఏర్పాటుకు పనులు మొదలుపెట్టారు. ఇప్పటికే కీలక పరిపాలన శాఖలకు మంత్రులను సైతం బైడెన్ ఎన్నుకోవడం జరిగింది.

ట్రంప్ నోట మళ్లీ పాత పాటే.. వైట్‌హౌస్‌ను వీడేది అప్పుడేనట!

ఎలక్టోరల్ కాలేజీలో బైడెన్ ఆధిక్యాన్ని నిరూపించుకోవాలి.. అప్పుడే వైట్‌హౌస్‌ను వీడతాను: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన ప్రభుత్వ ఏర్పాటుకు పనులు మొదలుపెట్టారు. ఇప్పటికే కీలక పరిపాలన శాఖలకు మంత్రులను సైతం బైడెన్ ఎన్నుకోవడం జరిగింది. అయితే, ట్రంప్ మాత్రం తన ఓటమిని అంగీకరించడం లేదు. పైగా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. అలాగే ఓ ప్రత్యేకవర్గం మీడియా తనను టార్గెట్ చేస్తూ బైడెన్‌కు మద్దతుగా వ్యహరిస్తుందని, ట్విటర్ కూడా అసలు ట్రెండింగ్‌లో లేని దానిని ట్రెండ్ చేస్తూ, అసలు విషయాన్ని పట్టించుకోకుండా తనపై పక్షపాతం చూపిస్తుందని చెబుతున్నారు. అంతటితో ఆగకుండా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఎలక్టోరల్ కాలేజీలో తన ఆధిక్యాన్ని నిరూపించుకుంటే గానీ తాను వైట్‌హౌస్‌ను వీడేదిలేదని ట్రంప్ తేగేసి చెప్పడం గమనార్హం. 


"ఓటమిని అంగీకరించడం చాలా కష్టంగా ఉంది. ఈ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్‌ జరిగింది. ఎన్నికల ఫలితాలపై నాకు ఇంకా నమ్మకముంది. ఈ ఎన్నికల్లో నేనే గెలిచాను. కావాలనే దేశంలో ఓ ప్రత్యేక వర్గం మీడియా నన్ను టార్గెట్ చేస్తూ బైడెన్‌కు మద్దతుగా వ్యవహరిస్తోంది. నాకు వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తోంది. అటు ట్విటర్‌ కూడా నాపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ట్రెండింగ్‌లో లేని దానిని ట్రెండ్ చేస్తూ చూపిస్తోంది. అసలు ట్రెండ్ అయ్యే విషయాన్ని మాత్రం పట్టించుకోదు. ఈసారి ఎన్నికల్లో పెద్ద ఎత్తున్న అవకతవకలు జరిగాయన్న విషయం అందరికీ తెలుసు. బైడెన్ తదుపరి అధ్యక్షుడని ఎలక్టోరల్ కాలేజీ ధ్రువీకరిస్తే శ్వేతసౌధాన్ని వీడతాను" అని ట్రంప్ చెప్పుకొచ్చారు.


ఇక ఈ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 50 రాష్ట్రాలకు గాను 528 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా... బైడెన్‌ 306, ట్రంప్ 232 ఓట్లు గెలుచుకున్నారు. దీంతో అధ్యక్ష పీఠం అధిరోహించడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ ఓట్లను దాటిన బైడెన్ అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతేగాక బైడెన్‌కు ఈ అధ్యక్ష ఎన్నికల్లో  రికార్డు స్థాయిలో 8 కోట్లకు పైగా ఓట్లు పోలవడం విశేషం. ట్రంప్‌కు 7.38 కోట్ల ఓట్లు పోలయ్యాయి. ఇదిలాఉంటే... డిసెంబర్ 14న కొత్తగా ఎన్నికైన అన్ని రాష్ట్రాలకు చెందిన ఎలక్టోర్స్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో వారు తమ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ ఎలక్టోరల్ కాలేజీలోనే బైడెన్ తన ఆధిక్యాన్ని నిరూపించుకోవాలని ట్రంప్ చెబుతున్నారు. అప్పుడు గానీ తాను వైట్‌హౌజ్‌ను వీడేది లేదని అంటున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడి ఎన్నికలో ఇదే ఆఖరి ఘట్టం. దీని తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికైన అభ్యర్థి జనవరి 20న బాధ్యతలు చేపడతారు. 

Updated Date - 2020-11-27T20:13:35+05:30 IST