ట్రంప్‌ కొత్త ఎత్తులు

Jun 4 2020 @ 00:47AM

చైనామీద ప్రచ్ఛన్నయుద్ధం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, దానిని పతాకస్థాయికి తీసుకుపోవడానికి వీలుగా ఆర్థికంగా ఎదిగిన దేశాల కూటమి జీ7ను తనకు అనుకూలంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడున్న జీ7 ఆయనకు కాలం చెల్లినదిగా, నిరుపయోగమైనదిగా కనిపించింది. మారిన ప్రాపంచిక పరిస్థితులకు ఏమాత్రం తగని విధంగా ఉన్న ఈ కూటమిని భారత్‌, రష్యా, దక్షిణకొరియా, ఆస్ట్రేలియాలను చేర్చుకోవడం ద్వారా ప్రయోజనకరంగా తీర్చిదిద్దే సంకల్పాన్ని ప్రకటించారు. మరోవారంలో జరగాల్సిన సమావేశం జర్మనీ కారణంగా రద్దయిపోయిన తరుణంలో, తాను సంకల్పించిన విస్తరణకోసం దానిని సెప్టెంబరుకు వాయిదావేస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించారు. చైనాకు అమితాగ్రహం కలిగించిన ఈ ప్రతిపాదనకు తోడుగా ఇప్పుడాయన భవిష్యత్‌ సమావేశానికి భారతప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించారు.


గత ఏడాది ఫ్రాన్స్‌ అధ్యక్షస్థానంలో ఉండగా నరేంద్రమోదీ ఈ సదస్సులో పాల్గొంటే, ఈ ఏడాది ఆ పీఠం అమెరికాదే కనుక ఆప్తమిత్రుడికి ఆహ్వానం అందడం సహజం. ఆహ్వాన సందర్భంగా ఇద్దరు నాయకులూ ఎక్కువ సేపు కరోనా గురించీ, భారత్‌–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల గురించీ, ప్రపంచ ఆరోగ్యసంస్థను బాగుచేయడం గురించీ మాట్లాడుకున్నారు. చైనాను ఎదుర్కొనేందుకు ఈ గ్రూప్‌ను ఎలా ఉపయోగించాలో మధిస్తున్నాం అంటూ అధ్యక్షుడి విస్తరణ ప్రకటన వెంటనే వైట్‌హౌస్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సెప్టెంబరు నాటికి కరోనాకల్లోలంలో కాస్తంతైనా తేడా వస్తే తప్ప సదస్సు జరిగే అవకాశాలు లేవు. జరుగుతుందా లేదా అన్నది అటుంచితే, మోదీని ఇలా పిలవడం, విస్తరణతో భారత్‌కు స్థానాన్ని కల్పించాలనుకోవడం సంతోషించవలసినవే. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ ప్రాభవాన్ని పట్టిచ్చే పరిణామం ఇది. గతంలోనే జీ 7లో చేరి, క్రిమియా దురాక్రమణతో ఆరేళ్ళక్రితం కూటమికి దూరమైపోయిన రష్యాకు తిరిగి స్థానం కల్పించాలని ట్రంప్‌ భావించడంలో ఆశ్చర్యమేమీ లేదు. రష్యా కంటే పుతిన్‌ ఆయనకు ప్రీతి. అయితే, జీ7 విస్తరణ ప్రతిపాదనను భారతదేశం స్వాగతించినప్పటికీ, చైనాను దూరం పెట్టే ఇటువంటి ప్రతిపాదనలతో ప్రపంచానికి మేలు జరగదంటూ రష్యా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కూటమిని విస్తరించడం మంచిదే కానీ, తగిన ప్రాతినిథ్యం ఉన్నప్పుడు మాత్రమే దానివల్ల ప్రయోజనం ఉంటుందనీ, కూటమిలో చైనాలేకుండా ప్రపంచాన్ని గాడినపెట్టలేమని రష్యా తేల్చేసింది. ఉన్న గ్రూపులు చాలవా అని కూడా అడుగుతోంది. ఇక, రష్యాను తిరిగి ఆహ్వానించడం పట్ల బ్రిటన్‌, కెనడాలు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చుతున్నాయి. క్రిమియా వ్యవహారంలో అంతర్జాతీయ నియమనిబంధనలను తుంగలో తొక్కి బయటకుపోయిన రష్యా తిరిగి వెనక్కు వచ్చే ప్రసక్తిలేదని కెనడా అంటున్నది. రష్యాను తిరిగి గ్రూపులో చేర్చుకొనే ప్రతిపాదనను తాను వీటో చేస్తానని బ్రిటన్‌ తేల్చేసింది. జీ7 సభ్యులు ఇలా మోకాలడ్డుతున్నా ట్రంప్‌ ప్రతీ ఏటా రష్యా పునరాగమనాన్ని కలవరిస్తూనే ఉన్నారు.


మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత అమెరికా భారత్‌ మధ్య దోస్తీ ద్విగుళం బహుళం అయింది. అమెరికా దృష్టిలో భారత్‌ ఓ సహజభాగస్వామి కావచ్చునేమో కానీ, తన ప్రయోజాలను సైతం భారత్‌ దృష్టిలో పెట్టుకొని అడుగులు వేయక తప్పదు. చైనాకు వ్యతిరేకంగా అమెరికా తీర్చిదిద్దుతున్న ఓ కూటమిలో నిరభ్యంతరంగా చేరిపోవడం వల్ల ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువ. అమెరికా ఒక్కటే కాక, జీ7లోని అన్ని దేశాలతో అదేస్థాయి సంబంధబాంధవ్యాలు నెరపడం, తన ప్రాధాన్యత పెంచుకోవడం అవసరం. భారత్‌తో పాటు రష్యాను సైతం తన పక్షాన లాగి చైనాను బలహీనపరచాలన్న అమెరికా లక్ష్యాన్ని పక్కనబెట్టి, భారత్‌ రష్యాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న బంధం బలహీనపడకుండా చూసుకోవాలి. ఏడుదేశాల కూటమిని ట్రంప్‌ విస్తరించగలరా లేదా అన్నది అటుంచితే చైనాతో సరిహద్దులు పంచుకుంటున్న ఈ రెండు దేశాల మధ్యా పరస్పర సహకారమే వ్యూహాత్మకంగా మేలుచేస్తుంది.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.