నిజం పలికించే బండ

ABN , First Publish Date - 2022-08-19T05:47:25+05:30 IST

సత్యప్రమాణంగా చెబుతున్నా.. అంటూ రాజనాల బండలో అసత్యం చెప్పడానికి ఎవరూ సాహసించరు. ఇక్కడ ప్రమాణం చేయమనగానే నిందితుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.

నిజం పలికించే బండ
రాజనాలబండ వద్ద ఆంజనేయస్వామి ఆలయం

రేపు, ఎల్లుండి వైభవంగా రాజనాలబండ తిరుణాళ్ల

సత్యప్రమాణంగా చెబుతున్నా.. అంటూ రాజనాల బండలో అసత్యం చెప్పడానికి ఎవరూ సాహసించరు. ఇక్కడ ప్రమాణం చేయమనగానే నిందితుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే దొంగతనాల కేసుల్లో డబ్బు, బంగారం అపహరించినా.. రాజనాల బండ పేరు చెప్పగానే వాటిని బాధితులకు కనబడేలా రహస్యంగా పెట్టేసి వెళ్తుంటారు. ఇలా సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాల బండపై శని, ఆదివారాల్లో తిరుణాళ్లను వైభవంగా నిర్వహించనున్నారు. 

- చౌడేపల్లె


చౌడేపల్లె మండలంలోని రాజనాలబండ కొండపై నరసింహస్వామి.. ఆ ఆలయానికి క్షేత్రపాలకుడిగా రాజనాలబండలో ఆంజనేయస్వామి వెలిశారు. పెద్దలు చెప్పిన ప్రకారం.. సుమారు 500ఏళ్ల కిందట కొండపై నరసింహస్వామికి వానరాలు అడవి పూలతో అభిషేకాలు చేస్తుంటే పశువుల కాపరులు గమనించి కొండా మారిరెడ్డికి చెప్పారు. ఆయన పుంగనూరు జమిందారులకు తెలియజేసి వారి అనుమతితో కొండపైన.. రాజనాలబండపై క్షేత్రపాలకుడిగా వెలసిన ఆంజనేయస్వామికీ ఆలయాలను నిర్మించారు. బండపైనే నిరాధారంగా 22 అడుగుల ఎత్తుగల నాలుగు కాళ్ల మండపం, 18 అడుగుల ఎత్తు గల రెండు మండపాలు కట్టారు. అప్పట్నుంచి స్వామికి ఏటా శ్రావణమాసంలో ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. శ్రావణమాస శనివారాల్లో చుట్టు పక్క గ్రామాల భక్తులు ఉపవాస దీక్షలతో స్వామిని కొలుస్తారు. చివరి శని, ఆది వారాల్లో తిరుణాళ్లను నిర్వహిస్తారు. అలా ఈనెల 20, 21 తేదీల్లో తిరునాళ్లు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వహకులు గురువారం తెలిపారు. 

శనివారం: రాజనాల బండలోని ఆంజనేయస్వామిని, కొండపై ఉన్న నరసింహస్వామిని భక్తులు దర్శించుకుంటారు. కొండపై ఉన్న రాతి ధ్వజస్తంభంపై నేతి దీపం వెలిగించి దీక్షను విరమిస్తారు. కొలింపల్లెలోని బోయకొండ గంగమ్మ, పెద్దూరు, ఊటూరు, దాసర్లపల్లెకు చెందిన మూడు దేవరేద్దులను ఊరేగిస్తూ రాజనాలబండకు తీసుకొస్తారు. ఎత్తయిన వక్క చెట్టును తీసుకొచ్చి చదును చేసి ఆముదం, కలమందగుజ్జు తదితర వాటిని పట్టించి చెట్టు చివరిభాగంలో స్వామివారి ప్రసాదాలను ఏర్పాటుచేసి, పూజలు చేసి ప్రతిష్ఠిస్తారు. 


ఆదివారం: వెంగళపల్లె, మల్లెలవారిపల్లె, గజ్జలవారిపల్లె, గూబలవారిపల్లె, గాజులవారిపల్లె గ్రామాల భక్తులు ఒక్కో ఏడాది ఒక్కో గ్రామం వారు పాకుమాను పాకి స్వామి ప్రసాదం దక్కించుకోవడం ఆనవాయితీ. అలాగే, మల్లెలవారిపల్లె, చిప్పిలివారిపల్లె, గుట్టకిందపల్లె యువకులు నాలుగు కాళ్ల మండపంపై ఏర్పాటు చేసిన ఉట్లను కొట్టి స్వామి ప్రసాదాలను దక్కించుకుంటారు. స్వామిని ఊరేగిస్తారు. 


దారి: చౌడేపల్లె- బోయకొండ మార్గంలోని మల్లెలవారిపల్లె అర్చి నుంచి రాజనాలబండ ఆలయం వద్దకు వెళ్లాలి.



ప్రమాణాలకు నేపథ్యమిలా.. 

శ్రీకృష్ణదేవరాయలు పెనుకొండ నుంచి చంద్రగిరి కోటకు వెళుతూ మార్గమధ్యలో ఈ ప్రాంతంలో విడిది చేశారట. మంత్రి ప్రవర్తనపై ఆయనకు అనుమానం రావడంతో తన నిజాయతీ నిరుపించుకోవాలని, సత్యప్రమాణం చేయాలని, బండపై రాగులు మొలిపించాలని ఆదేశించారట. అప్పుడు మంత్రి బండపై రాగులు చల్లి, దేవుడిపై భారం మోపి, స్వామి ముందు సత్యప్రమాణం చేశారట. ఈక్రమంలో బండపై మూడు రోజులకు రాగులు మొలకెత్తాయట. బండపై రాజనాలు పండటంతో అప్పటి నుంచి ఆ బండకు రాజనాలబండ అని పేరు వచ్చిందని చెబుతారు. ఆ తర్వాత రాజనాలబండపై వెలసిన ఆంజనేయస్వామి ముందు సత్య దేవతలను ప్రతిష్ఠించారు. అప్పట్నుంచి ఇక్కడ సత్యప్రమాణాలకు నెలవుగా మారింది. ఎవరూ అసత్య ప్రమాణాలు చేయడానికి సాహసించరు. రాజనాలబండ పేరు చెప్పగానే చోరీకి గురైన డబ్బు, బంగారు, వస్తువులు లభిస్తున్నాయి. ఇక్కడ న్యాయం, రాజీలు జరుగుతుండడంతో రాజనాలబండ పేరు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్ణాటకల్లోనూ సత్యప్రమాణాలకు నిలయంగా మారింది. 




Updated Date - 2022-08-19T05:47:25+05:30 IST