జులై ఫస్ట్ నుంచి టీఎస్‌ బీపాస్‌...

Jun 20 2021 @ 13:07PM

  • డీపీఎంఎస్‌ బంద్‌.. 
  • ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల పరిశీలన
  • టీఎస్‌బీఎస్‌ కమిటీ మొదటి సమావేశంలో కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌ సిటీ : సులభతర నిర్మాణ అనుమతుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన టీఎ్‌స-బీపాస్‌ జులై ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో అమలులోకి రానుంది. ఇందుకు సంబంధించిన సాంకేతిక ఏర్పాట్లను జీహెచ్‌ఎంసీ ముమ్మరం చేసింది. వచ్చే నెల నుంచి డెవల్‌పమెంట్‌ పర్మిషన్‌ మెనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (డీపీఎంఎస్‌)లో భాగంగా దరఖాస్తుల స్వీకరణ ఉండదని జీహెచ్‌ఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరు వరకు డీపీఎంఎస్‌‌లో వచ్చే దరఖాస్తులను యథావిధిగా పరిశీలిస్తారు. శనివారం జరిగిన టీఎస్-బీపాస్‌ కమిటీ ప్రథమ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 


  • నిర్మాణ అనుమతుల జారీకి సంబంధించి పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదులను లైన్‌ డిపార్ట్‌మెంట్లతో కలిపి పరిశీలించాలి. 
  • భవన నిర్మాణ, లే అవుట్‌ అనుమతులకు సంబంధించి వివరాలు అందుబాటులో ఉంచాలి. 
  • నిర్ణీత కాలవ్యవధిలో తిరస్కరించిన దరఖాస్తులు, జాప్యానికి కారణాలను సమీక్షించాలి. 
  • టీఎస్‌- బీపాస్‌లో వచ్చిన దరఖాస్తులు, అనుమతుల జారీ, పెండింగ్‌లో ఉన్న వాటి వివరాలతో సర్కారుకు నివేదిక పంపాలి. 
  • నెలలో రెండుసార్లు కమిటీ సమావేశం జరగాలి. మొదటి, మూడో ఆదివారం లేదా రెండు, నాలుగో ఆదివారాల్లో సమావేశం నిర్వహించాలి. మీటింగ్‌ ఎప్పుడన్నది కమిటీ చైర్మన్‌ నిర్ణయిస్తారు.

సింగిల్‌ విండో దరఖాస్తులపై...

టీఎస్-బీపా‌స్‌లో బహుళ అంతస్తుల భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులు సింగిల్‌ విండో ద్వారా స్వీకరించాలని నిర్ణయించారు. అవసరాన్ని బట్టి రెవెన్యూ, నీటి పారుదల, అగ్ని మాపక శాఖలకు దరఖాస్తు వివరాలు ఆన్‌లైన్‌లో పంపుతారు. ఆయా విభాగాలు నిరభ్యంతర పత్రం/క్లియరెన్స్‌ ఇచ్చిన తర్వాతే జీహెచ్‌ఎంసీ అనుమతులు జారీ చేస్తుంది. ఆయా విభాగాలు ఎన్‌ఓసీ/క్లియరెన్స్‌ నిర్ణీత సమయంలో ఇవ్వాలనే నిబంధన కొత్త విధానంలో అమలులోకి వచ్చింది. ఆ లోపు ఫైల్‌ పరిశీలన పూర్తి చేయని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారు. సింగిల్‌ విండోలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, లైన్‌ డిపార్ట్‌మెంట్ల క్లియరెన్స్‌/ఎన్‌ఓసీ కోసం వెళ్లినవి ఎన్ని, గడువులోపు పరిశీలన పూర్తయినవి, పెండింగ్‌లో ఉన్నవి, కారణాలేంటి అన్న దానిపై 15 రోజులకోమారు జరిగే కమిటీ సమావేశంలో సమీక్షించనున్నారు.


కమిటీలో వీరు...

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ - చైర్మన్‌ 

చీఫ్‌ సిటీ ప్లానర్‌ - మెంబర్‌ కన్వీనర్‌ 

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లాల కలెక్టర్లు - సభ్యులు

నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ - సభ్యుడు

డైరెక్టర్‌ ఈవీడీఎం (జీహెచ్‌ఎంసీ) - సభ్యుడు 

డీజీ ఫైర్‌ సర్వీసెస్‌ లేదా ఆయన తరఫున ప్రతినిధి - సభ్యుడు 

కమిషనర్‌ నామినేట్‌ చేసిన మరో అధికారి - సభ్యుడు


Follow Us on: