టీఎస్‌ బీపాస్‌ పర్మిషన్‌ పాట్లు

ABN , First Publish Date - 2022-09-30T06:36:43+05:30 IST

భూ యజమానులకు, ప్రాపర్టీ బిల్డర్లకు భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్‌బీపాస్‌ (తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మీషన్‌ అప్రూవల్‌, సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టమ్‌)తో ఇక్కట్లు ఎదురవుతున్నాయి.

టీఎస్‌ బీపాస్‌ పర్మిషన్‌ పాట్లు

టీఎస్‌బీపాస్‌ ద్వారా దరఖాస్తు చేసినా.. నిర్మాణదారులకు తప్పని ఇబ్బందులు

చిన్న కారణాలతో అనేక దరఖాస్తుల తిరస్కరణ

ప్రజాప్రతినిధుల జోక్యంతో అనుమతుల మంజూరు 

సాయంత్రం వేళలో కార్యాలయాల్లో పైరవీ పనులు

జిల్లా వ్యాప్తంగా సాధారణ ప్రజలకు తప్పని తిప్పలు

నిజామాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భూ యజమానులకు, ప్రాపర్టీ బిల్డర్లకు భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్‌బీపాస్‌ (తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మీషన్‌ అప్రూవల్‌, సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టమ్‌)తో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. జిల్లాలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీల పరిధిలో నూతన ఇళ్ల నిర్మాణాల అనుమతులకు ఇబ్బందులు తప్పడంలేదు. టీఎస్‌బీపాస్‌ ద్వారా దరఖాస్తు చేసినా కొన్ని కారణాలతో తిరస్కరిస్తున్నారు. సంబంధిత ధ్రువపత్రాలు జతచేసినా ఇబ్బందులు తప్పడంలేదు. మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల జోక్యం ఉంటే తప్ప అనుమతులు రావడంలేదు. టౌన్‌ప్లానింగ్‌, ఇరిగేషన్‌శాఖల అధికారులు అనుమతులు ఇస్తున్నా ఇళ్ల నిర్మాణాలకు మాత్రం అడ్డంకులు తప్పడంలేదు. స్థానిక ప్రజాప్రతినిఽధుల అనుమతులు ఉంటేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు చేసుకునే పరిస్థితి మున్సిపాలిటీల్లో నెలకొంది. నగర కార్పొరేషన్‌తో పాటు బోధన్‌, ఆర్మూర్‌, భీంగల్‌ మున్సిపాలిటీల పరిధిలో టీఎస్‌బీపాస్‌ ద్వారానే అనుమతులను ఇస్తున్నారు. ఇవేకాకుండా గ్రామాల పరిధిలో కూడా టీఎస్‌బీపాస్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ ద్వారా అనుమతులను మంజూరు చేస్తున్నారు.

దరఖాస్తుదారులకు తప్పని ఇబ్బందులు

నగరంతో పాటు ఇతర మున్సిపాలిటీల పరిధిలో టీఎస్‌బీపాస్‌ కింద దరఖాస్తు చేసుకున్న వారికి ఇబ్బందులు తప్పడంలేదు. తమ ప్లాట్‌కు సంబంధించిన అన్ని వివరాలతో టీఎస్‌బీపాస్‌ కింద అన్ని ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకున్నవారికి 15 రోజుల్లో అన్ని అనుమతులను మంజూరు చేయాలి. దరఖాస్తు చేసిన తర్వాత సాగునీటి శాఖకు చెందిన అధికారులు ఈ ప్లాట్‌లను పరిశీలిస్తారు. ప్లాట్‌కు సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు. ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించినది, బఫర్‌జోన్‌కు సంబంధించినది, కోర్టులో ఉన్నభూమి అయితే అనుమతులు ఇవ్వరు. కార్పొరేషన్‌, మున్సిపాలి టీల పరిధిలో రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ పరిశీలించి ఈ అనుమతులను మంజూరు చేస్తున్నారు. ఇరిగేషన్‌శాఖకు ఈ ప్లాట్‌ల పరిశీలన అప్పజెప్పడం వల్ల దరఖాస్తు చేసుకున్న వారికి నెలలు గడిస్తే తప్ప అనుమతులు రావడంలేదు. ఇరిగేషన్‌శాఖ అధికారులు ఆలస్యంగా పరిశీలించడం వల్ల దరఖాస్తులు చేసుకున్నవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత ఇళ్ల స్థానంలో నిర్మాణాలు చేసేవారికి కూడా అనుమతులు రావడంలేదు. ఇరిగేషన్‌శాఖ అనుమతులు ఇచ్చిన తర్వాత టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారులు టెక్నికల్‌కు సంబంధించినవి పరిశీలించి అనుమతులను ఇస్తారు. టీఎస్‌బీపాస్‌ కింద దరఖాస్తు చేసిన వారు అన్ని పత్రాలను దాఖలు చేసిన కొన్నిసార్లు ఈ రెండుశాఖల అధికారులు చిన్న కారణాలతో అనుమతులు నిరాకరిస్తున్నారు. రెండో సారి దరఖాస్తు చేసిన నిర్మాణదారులు ఎక్కువ సమయం పడుతుండడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, ఈ శాఖల అధికారులను కలుస్తూ అనుమతులు వచ్చేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిసార్లు పైరవీలు ఉంటే తప్ప అనుమతులు రావడంలేదు. డబ్బులు ఖర్చుపెడితే తప్ప చాలామందికి టీఎస్‌బీపాస్‌ అనుమతులు రావడంలేదు. 

ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు

టీఎస్‌బీపాస్‌ కింద అనుమతులు వచ్చి నిర్మాణాలు చేపట్టేవారికి ఇక్కట్లు తప్పడంలేదు. స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. వారికి కావాల్సిన నజరానాలు సమర్పిస్తేనే నిర్మాణానికి ఇబ్బం దులు లేకుండా చూస్తున్నారు. ఎవరైనా ఇవ్వకుంటే పలు కారణాలు చెప్పి నిర్మాణాలు నిలిపివేస్తున్నారు. ఆయా జోన్‌ల పరిధిలో అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకుని స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ఒత్తిళ్లను తీసుకువస్తున్నారు. లక్షల రూపాయలు రుణాలు తీసుకుని ఇళ్ల నిర్మా ణం చేపట్టేవారు ఈ నజరానాలు సమర్పించి తమ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. బల్దియాల పరిధిలో పైరవీలు కామన్‌కావడంతో నిర్మాణదారులతో పాటు ఇతర అనుమతులు కావాల్సిన వారు వారి ద్వారానే ప్రయత్నాలు చేస్తున్నారు.

సిఫారసు పనులు చకచకా

నగర కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీల పరిధిలో సాయం త్రం కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. పైరవీలకు సంబంధించిన పనులన్నీ ఈ కార్యాలయాల్లో సాయంత్రం వేళలో పనులు పూర్తవుతున్నాయి. అధికారులు పొద్దంతా డివిజన్‌ల పర్యటన, ఇతర కారణాలతో కార్యాలయాలకు దూరంగా ఉన్నా సాయంత్రం వేళలో మాత్రం టన్షన్‌గా వచ్చి ఈ పనులు పూర్తిచేస్తున్నారు. అన్ని పనులకు ఆయా నేతలు, ప్రజాప్రతినిధుల సిఫారసులు, ఫోన్‌లు ఉండడంతో పనులన్నీ చకచకా పూర్తిచేస్తున్నారు. సామాన్యులు మాత్రం అన్ని పనులకు డబ్బులు వెచ్చించాల్సిరావడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నగర కార్పొరేషన్‌ పరిధిలో అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాతనే టీఎస్‌బీపాస్‌ కింద  అనుమతులను మంజూరు చేస్తున్నట్లు ఇన్‌చార్జి డిప్యూటీ సిటీ ప్లానర్‌ శ్యాంకుమార్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారి కరుణాకర్‌ తెలిపారు. ఏవైనా పత్రాలు లేకపోవడం, ప్రభుత్వ భూములు వంటి ఉంటే తిరస్కరిస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2022-09-30T06:36:43+05:30 IST