భావి కథారచయితల వాగ్దాన సంతకం

Published: Sat, 19 Mar 2022 00:46:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భావి కథారచయితల వాగ్దాన సంతకం

అందరూ చూసిన దానిని చూడడం, ఎవ్వరూ ఆలోచించనిది ఆలోచించడమే సృజనాత్మకత అంటారు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. ఈ విషయాన్ని రూఢీ చేసింది తెలంగాణ సాహిత్య అకాడమి నిర్వహించిన బాలల కథా రచన కార్యక్రమం. సుమారు రెండు సంవత్సరాలుగా కరోనా కాలంలో అరకొర ఆన్‌లైన్ చదువులతో కాలం వెళ్లబుచ్చారు విద్యార్థులు. వారి ఆలోచనల, ఊహల రెక్కలు ముడుచుకున్నాయి. ఈ సందర్భంలో విద్యార్థులలో కొత్త ఉత్తేజాన్ని, ప్రేరణను నింపింది ‘మన ఊరు-- మన చెట్టు’ కథల పోటీ. తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 5, 2022 తేదీన రీడ్ అనే కార్యక్రమం ప్రారంభించింది. సాహిత్య అకాడమి చేపట్టిన ఈ కథల యజ్ఞం ‘రీడ్’కు మరింత ఊతమిచ్చింది.


ఎన్నో రోజులు ఇంటికే పరిమితమైన విద్యార్థులలో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి అకాడమి చేపట్టిన ఈ కార్యక్రమం దారి దీపమైంది. చెట్లు లేనిదే మానవ మనుగడ లేదు. చెట్టులేని ఊరును ఊహించలేము. చెట్లకు ఊరికి ఉన్న అవినాభావ సంబంధం తల్లికి బిడ్డకు ఉన్న మధురానుబంధమే. పిల్లలకు ఊరు అన్నా, చెట్లు అన్నా ఎంతో ఇష్టం. ఈ అంశాన్ని వస్తువుగా ఇవ్వడంలోనే సాహిత్య అకాడమి సగం విజయం సాధించింది. సాహిత్య అకాడమీ ఈ కార్యక్రమం ప్రకటనలోనే ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను అందించింది.


కథలు రాయడానికి పిల్లలను ఎలా సంసిద్ధులను చేయాలో ఉపాధ్యాయులకు మార్గదర్శనం చేసారు. ఉపాధ్యాయులు కూడా అంతే ఉత్సాహంతో విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించి మార్చి 4వ తేదీన ఒక పండుగ వాతావరణంలో కథా రచన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల పాఠశాలల్లోని విద్యార్థుల సృజనను ఈ కార్యక్రమం లోకానికి చాటింది. బాల సాహిత్యానికి అమూల్యమైన కథా సంపదను సమకూర్చి పెట్టింది. విశేషమేమిటంటే, అకాడమి ఇచ్చిన కథావస్తువులు రెండే. ఒకటి ఊరు, రెండు చెట్టు. లక్షలాది విద్యార్థులు ఈ రెండు వస్తువులే నేపథ్యంగా విభిన్న కోణాల్లో సరికొత్త కథలను రచించారు. అందుకే, సృజనాత్మకత గురించి ఐన్‌స్టీన్ మాటలు ఈ సందర్భానికి సరిగ్గా సరిపోతాయి. పోటీలో 6 నుండి 10 తరగతుల విద్యార్థులచే కథలు రాయిస్తే, ఫలానా జిల్లా నుండి విద్యార్థులు పాల్గొన లేకపోయారనే మాటకు తావివ్వకుండా 33 జిల్లాల విద్యార్థులు కథలు రాశారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులు 1,56,115. రంగారెడ్డి జిల్లా నుండి ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలన్ని కలుపుకొని గరిష్టంగా 634 పాఠశాలలు ‘మన ఊరు -మన చెట్టు’ కథల పోటీలో భాగస్వామ్యం కాగా ఆ తర్వాతి వరుసలో ఖమ్మం, నల్గొండ, హనుమకొండ జిల్లాల నుండి అత్యధిక సంఖ్యలో పాఠశాలలున్నాయి. వికారాబాద్ నుండి 36,198 మంది, తర్వాత స్థానంలో రంగారెడ్డి జిల్లా నుండి 19,092 మంది, ఆదిలాబాద్ జిల్లా నుండి 11,953 మంది, ఖమ్మం జిల్లా నుండి 11,274 మంది, నల్లగొండ జిల్లా నుండి 9915 మంది విద్యార్థులు కథలు రాయడంలో సంఖ్యాపరంగా మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు. 


విద్యార్థులు అకాడమి నిర్వహించిన పోటీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమదైన శైలిలో సందేశాత్మకంగా కథలు రాశారు. ఏకకాలంలో రెండు కథావస్తువులు తీసుకొని వైవిధ్యమైన ఆలోచనలతో కథలు అల్లడం ముందెప్పుడూ చూడని విషయం. ఇది ఒక వినూత్న ప్రయోగం. పిల్లలు రాసిన ఈ కథల నుండి వెయ్యి కథలు ఎంపిక చేసి సంకలనంగా ప్రచురిస్తామని సాహిత్య అకాడమి అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ ప్రకటించడం హర్షణీయం. అంతేకాదు, అత్యధిక కథలు రాసిన విద్యార్థులున్న పాఠశాలలకు ప్రత్యేకంగా పుస్తకాలు అచ్చు వేస్తామని ప్రకటించడం భవిష్యత్ సృజనకారులను తయారు చేయడానికి మంచి తోడ్పాటునిస్తుంది. ‘మన ఊరు- మన చెట్టు’ కథా ఉద్యమంలో భాగస్వాములైన విద్యార్థులందరూ బాల రచయితలుగా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాక ప్రసిద్ధ సాహితీవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ గౌరీశంకర్ గారి కృషి అభినందనీయం.


– ఉప్పల పద్మ

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.