అప్పులు పుట్టేది కష్టమే!

ABN , First Publish Date - 2022-05-05T09:31:49+05:30 IST

అప్పులు పుట్టేది కష్టమే!

అప్పులు పుట్టేది కష్టమే!

ఆర్‌బీఐ ద్వారా ఓపెన్‌ మార్కెట్‌ రుణాలకు..

తెలంగాణకు అనుమతులు నిరాకరించిన కేంద్రం

ఏప్రిల్‌ 11 నుంచి ఈ నెల 2 వరకు..

6 వేల కోట్ల రుణాలు ప్రతిపాదించిన రాష్ట్రం

బడ్జెట్‌లో ప్రతిపాదించని ఖర్చులపై కేంద్రం ఆరా

తగిన జవాబులిస్తేనే అనుమతించాలని నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వ అప్పులపై కాగ్‌ ఆందోళన

సర్కారు పూర్తి సమాచారం ఇవ్వలేదని నివేదిక


న్యూఢిల్లీ, మే 4 (ఆంధ్రజ్యోతి): రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్వారా ఓపెన్‌ మార్కెట్‌ రుణాలకు వెళ్లేందుకు తెలంగాణకు కేంద్రం అనుమతులు నిరాకరించడంతో రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి డోలాయమానంలో పడింది. ఏప్రిల్‌ 11 నుంచి ఈ నెల 2 వరకు ఓపెన్‌ మార్కెట్‌ రుణాల కింద రూ.6 వేల కోట్ల రుణాలు సేకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఇందుకు కేంద్రం ఆమోదం తెలపకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దెబ్బతినే అవకాశాలున్నాయి. ప్రధానంగా దళిత బంధు కోసం రూ.17,700 కోట్లు, రైతుబంధు కోసం రూ.14,800 కోట్ల మేరకు బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలను అమలు చేయడంలో తెలంగాణ ఇబ్బందుల్లో పడవచ్చునని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. నిజానికి రాజ్యాంగంలోని 293 ఆర్టికల్‌ కింద మార్కెట్‌ రుణాల కోసం రాష్ట్రాలు కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవాలి. అయితే ఇప్పటివరకూ కేంద్రం సాధారణంగానే అనుమతులిచ్చేది. కానీ, ఇటీవలి కాలంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గురించి కేంద్రం ఆరా తీయడం ప్రారంభించింది. బడ్జెట్‌లో ప్రతిపాదించని ఖర్చుల కోసం చేసిన రుణాలు, కార్పొరేషన్లకు ఇచ్చే గ్యారంటీలపై తగిన సమాధానాలు ఇచ్చిన తర్వాతే అనుమతులివ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజాగా కంప్ర్టోలర్‌ ఆండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) కూడా బడ్జెట్‌ ప్రతిపాదనలతో సంబంధంలేని ఖర్చుల కోసం అప్పులు చేయడంపై తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రుణాలను ఆమోదిస్తే.. కేంద్రం అనుమతించిన దాని కంటే ఎక్కువ అప్పులు చేసినట్లవుతుందని కాగ్‌ అభిప్రాయపడింది. బడ్జెట్‌తో సంబంధంలేని రుణాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సమాచారం ఇవ్వలేదని, తద్వారా ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల్ని అతిక్రమిస్తోందని తన నివేదికలో తెలిపింది. దీనివల్ల శాసనసభకు జవాబుదారీ కాకుండా అప్పులు చేయడం జరుగుతోందని, ఇది ఆర్థిక నిర్వహణలో అవకతవకలకు దారి తీస్తోందని పేర్కొంది. 


వసూళ్ల కంటే పెరిగిన అప్పులు..

గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రుణాలు అంతకుముందు ఏడాది కంటే 19 శాతం పెరిగిపోయాయని కాగ్‌ తెలిపింది. జీఎ్‌సడీపీ, రెవెన్యూ వసూళ్ల కంటే అప్పుల శాతం పెరుగుతోందని పేర్కొంది. తక్కువ వడ్డీ రేట్లతో దీర్ఘకాలిక రుణాలను తీసుకోవడం ద్వారా పడే ఆర్థిక ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం చేయలేదని, వివిధ సంస్థలకు ఇచ్చిన గ్యారంటీల గురించి కూడా పూర్తి సమాచారం ఇవ్వడం లేదని వెల్లడించింది. రెవెన్యూ, ద్రవ్యలోటును భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ రుణాలు చేస్తోందని, దీనికి మించి వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సుల కింద పొందిన మొత్తం కూడా పెరిగిపోతోందని తెలిపింది. కాగా తెలంగాణ ప్రభుత్వం జూన్‌ 7 వరకు మార్కెట్‌ రుణాల కింద రూ.13 వేల కోట్లు సేకరించేందుకు ఆర్‌బీఐకి ప్రతిపాదనలు పంపింది. ఏప్రిల్‌ 5న ఆర్‌బీఐ విడుదల చేసిన క్యాలండర్‌ ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్‌ 11న రూ.వెయ్యి కోట్లు, ఏప్రిల్‌ 16న రూ.2 వేల కోట్లు, మే 2న రూ.3 వేల కోట్లు, మే 10న రూ.2 వేల కోట్లు, మే 31న రూ.వెయ్యి కోట్లు, జూన్‌ 7న రూ.వెయ్యి కోట్లు, జూన్‌ 14న రూ.2 వేల కోట్లు, జూన్‌ 28న రూ.వెయ్యి కోట్లు మార్కెట్‌ రుణాల కింద సేకరించేందుకు  ప్రతిపాదనలు పంపింది. అయితే కేంద్రాన్ని సంతృప్తి పరచకపోతే తెలంగాణ సర్కారు అమలు చేసే పథకాల కోసం నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. 

Read more