ఎరువుల ధరలు పెంచొద్దు

Published: Thu, 13 Jan 2022 04:00:25 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎరువుల ధరలు పెంచొద్దు

  • రైతులపై భారం మోపొద్దు
  • ప్రస్తుత ధరలనే కొనసాగించాలి
  • రైతుల ఆదాయం కాదు..
  • పెట్టుబడి రెట్టింపు అయింది
  • కేంద్రం గుడ్డిగా వ్యవహరిస్తోంది
  • ‘పెట్రో’ భారం కూడా రైతులపై పడుతోంది
  • ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి
  • ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ
  • బీజేపీ రైతు వ్యతిరేకి.. కూకటివేళ్లతో పెకలించాల్సిందే: సీఎం


హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఎరువుల ధరలు పెరగకుండా చూడాలని సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీని కోరారు. ప్రస్తుతం ఉన్న ధరలనే యథాతథంగా కొనసాగించాలన్నారు. ధరలు పెంచి రైతులపై భారం మోపొద్దని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. ‘‘కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కొన్ని అంశాలు.. రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రకటించింది. ఆరేళ్లవుతున్నా ఆ దిశగా ఎలాంటి నిర్మాణాత్మక చర్యలూ చేపట్టలేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన మీ విధానానికి వ్యతిరేకంగా రైతుల పెట్టుబడి వ్యయాలు మాత్రం రెట్టింపు కావడం అందరినీ నిరాశ నిస్పృహలకు గురి చేస్తోంది. ఆరేళ్లలో ఆదాయం క్షీణించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు’’ అని కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. ‘‘ఆరేళ్లుగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నా కేంద్రం గుడ్డిగా వ్యవహరిస్తోంది. యూరియా, డీఏపీ తదితర ఎరువుల వాడకాన్ని తగ్గించేలా ప్రచారం చేయాలంటూ రాష్ట్రాలను పురిగొల్పుతోంది. రైతులు ఎక్కువగా వినియోగించే 28.28.0 ఎరువుల ధరలను 50 శాతానికి పైగా, పొటాషియం ధరను 100 శాతానికి పైగా పెంచడం శోచనీయం. ఎరువుల ముడిసరుకులపై పెరుగుతున్న దిగుమతి సుంకాన్ని భరిస్తూ ధరలను రైతులకు అందుబాటులో ఉంచాల్సిన కేంద్రం.. ఆ భారాన్ని రైతులపైనే రుద్దుతోంది. రాష్ట్రాల్లో వ్యవసాయ యాంత్రీకరణ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ రంగంలో డీజిల్‌, పెట్రోలు వాడకం కూడా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముడి చమురు ధరలు పెరగకున్నా, కేంద్రం విధిస్తున్న అసంబద్ధ సెస్‌ కారణంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగి రైతులకు అదనపు భారంగా మారాయి. 

ఎరువుల ధరలు పెంచొద్దు

పెట్రో, ఎరువుల ధరల పెంపులో కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో ఏడు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ఎరువుల సబ్సిడీ విధానాన్ని రైతుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా మార్చివేయడం వల్ల వారు ఆందోళన చెందుతున్నారు. అందుకే సాగు ఖర్చులో కొంతమేరకైనా తగ్గించాలన్న ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలంటూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. దీనిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని ఆరోపించారు. ‘‘రైతులకు గిట్టుబాటు ధర విషయంలో స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన పలు కీలక సిఫారసులను కేంద్రం పక్కన పెట్టింది. పంటల సాగుకయ్యే మొత్తం వ్యయంపై 50ు మేర పెంచి మద్దతు ధరలు ఇవ్వాలని కమిషన్‌ సిఫారసు చేసింది. భూమి లీజు ధరలను కూడా ఉత్పత్తి వ్యయంలో కలపాలని చెప్పింది. కానీ, స్వామినాథన్‌ సిఫారసుల ప్రకారం 150ు మేర మద్దతు ధరను అమలు పరుస్తున్నామని కేంద్రం ప్రకటించుకోవడం రైతులను తప్పుదారి పట్టించడమే’’ అని ఆరోపించారు. ‘‘పంటలకు మద్దతు ధరలను ప్రకటించి చేతులు దులుపుకొంటున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనడం లేదు. పంటలకు మద్దతు ధరలు లభిస్తాయన్న భరోసాను కేంద్రం కలిగించలేకపోతోంది. అంతర్జాతీయ నాణ్యత పేరుతో కనీస మద్దతు ధరలు ఇవ్వడం లేదు. రైతులు పండించిన పంటను మార్కెట్లో తక్కువ ధరలకే అమ్ముకునే పరిస్థితి కల్పిస్తున్నారు. ఇలాంటి అసంబద్ధ విధానాలతో వ్యవసాయాన్ని లాభసాటి కాకుండా చేస్తున్నారు’’ అని ప్రధానికి కేసీఆర్‌ వివరించారు. ఈ తప్పుడు విధానాలకు తోడుగా వ్యవసాయ రంగంలో విద్యుత్తు సంస్కరణల పేరుతో మోటార్లకు మీటర్లు బిగించాలన్న నిర్ణయం రైతులకు ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. 


బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి..

వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేలా, రైతాంగం నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని కేసీఆర్‌ మండిపడ్డారు. ప్రధానికి లేఖ రాసేముందు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఎరువుల ధరలను పెంచడం వల్ల బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని నిర్ధారణ అయిందని కేసీఆర్‌ ఆరోపించారు. కరెంటు మోటార్లకు మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేయాలనడం, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించకుండా నాన్చడం, ఎరువుల ధరలను విపరీతంగా పెంచడం.. పంటలకు కనీస మద్దతు ధరలు చెల్లించకపోవడం వెనక కుట్ర దాగి ఉందన్నారు. ఇది రైతులను వారి పొలాల్లో వారినే కూలీలుగా మార్చే కుట్ర అని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని, అనుబంధ వృత్తులను నిర్వీర్యం చేసి.. వ్యవసాయాన్ని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి కుట్రలు చేసే బీజేపీని కూకటివేళ్లతో పెకలించివేయాలని ప్రజలకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై దేశ రైతాంగం తిరగబడితే తప్ప వ్యవసాయాన్ని కాపాడుకోలేని పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీకి బుద్ధి వచ్చేదాకా ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పెంచిన ఎరువుల ధరలను తక్షణమే తగ్గించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టి, కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతామని హెచ్చరించారు. 


మోదీజీ.. మాకు కేంద్ర విద్యాసంస్థలివ్వండి

ట్విటర్‌లో ప్రధానిని కోరిన రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ 

 ఐఐఎం, ఐఐటీ, ఐఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థలతోపాటు తెలంగాణకు మెడికల్‌ కాలేజీలు కేటాయించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌.. ట్విటర్‌ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. నేషనల్‌ యూత్‌ డే సందర్భంగా తమిళనాడులో బుధవారం 11 మెడికల్‌ కాలేజీలను ప్రారంభిస్తున్నానని ప్రధాని మోదీ మంగళవారం ఓ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు బుధవారం బదులిచ్చిన కేటీఆర్‌ రాష్ట్ర అవసరాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ‘గౌరవనీయులైన మోదీజీ.. రాష్ట్రం తరఫున ఎన్నిరకాలుగా వినతులు పంపినా గత ఏడేళ్లలో ఎన్‌డీఏ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క విద్యాసంస్థను కేటాయించలేదు. ఆఖరికి విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన యూనివర్సిటీని కూడా ఇవ్వలేదు. ఈ అంశంపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని నేషనల్‌ యూత్‌ డే సందర్భంగా తెలంగాణ యువత, విద్యార్థులు తరఫున కోరుతున్నాను’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.