మిస్సైల్‌ తయారీలోనూ ప్రైవేటుకు అవకాశం

ABN , First Publish Date - 2022-01-21T08:40:57+05:30 IST

మిస్సైల్‌ తయారీలోనూ ప్రైవేటుకు అవకాశం

మిస్సైల్‌ తయారీలోనూ ప్రైవేటుకు అవకాశం

రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తున్నాం.. ఎగుమతులు చేసే స్థాయికి చేరాలంటే.. సాంకేతికంగా ఇంకా మెరుగుపడాలి


యువ శాస్త్రవేత్తల కోసం ‘యంగ్‌ సైంటిస్ట్‌ లేబొరేటరీస్‌’

డీఆర్‌డీవో ఛైర్మన్‌ సతీశ్‌ రెడ్డి


(హైదరాబాద్‌ సిటీ, జనవరి 20, ఆంధ్రజ్యోతి): రక్షణ రంగంలో దేశం చాలా విభాగాల్లో స్వయం సమృద్ధి సాధించినప్పటికీ.. సాంకేతికంగా ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉందని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీశ్‌ రెడ్డి అన్నారు. మన రక్షణ అవసరాలకు మాత్రమే కాకుండా.. ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించామని, ఇప్పటికే 14 వేలకు పైగా కంపెనీలతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు. మిస్సైల్‌ తయారీలోనూ ప్రైవేటు రంగానికి అవకాశం కల్పిస్తున్నామన్నారు. అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా(అస్కీ) ఆధ్వర్యంలో.. ‘యాక్సిలరేటింగ్‌ డిఫెన్స్‌ ఆర్‌అండ్‌ఆర్‌ ఫర్‌ ఆత్మనిర్భర్‌ భారత్‌’ అనే అంశంపై గురువారం వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో సతీశ్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన డీఆర్‌డీవో అభివృద్ధి క్రమాన్ని వివరించారు. రక్షణ రంగానికి డీఆర్‌డీవో అందిస్తున్న సేవలు, చేస్తున్న పరిశోధనలు, యువ శాస్త్రవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహం తదితర వివరాలను వెల్లడించారు. ‘‘అబ్దుల్‌ కలాం హయాంలో మిస్సైల్‌ సాంకేతికత అభివృద్ధి చెందింది. సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌ ఆకాశ్‌,  ఎయిర్‌ లాంచ్డ్‌ మిస్సైల్‌ బ్రహ్మోస్‌, క్రూయిజ్‌ మిస్సైల్‌ నిర్భయ్‌, బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ లాంటి ఎన్నో విజయవంతమైన ఆవిష్కరణలు చేశాం. ఎయిర్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌.. అస్త్ర వేరియంట్స్‌, యాంటీ ట్యాంక్‌ మిస్సైల్స్‌ హెలినా, నాగ్‌, అర్జున్‌ లాంటివి విజయవంతమయ్యాయి. తాజాగా నిర్వహించిన బ్రహ్మోస్‌ పరీక్ష కూడా సక్సెస్‌ అయింది’’ అని వివరించారు. అమెరికా, రష్యా, చైనా తర్వాత యాంటీ శాటిలైట్‌ మిస్సైల్‌ టెక్నాలజీ కలిగిన నాలుగవ దేశం, సొంత యుద్ధ ట్యాంకులు కలిగిన ఆరవ దేశం మనదేనని చెప్పారు. యువ శాస్త్రవేత్తలకు సహకారం అందించేందుకు.. యంగ్‌ సైంటిస్ట్‌ లేబరేటరీ్‌సను ఏర్పాటు చేస్తున్నామని, దేశవ్యాప్తంగా ఇప్పటికే ఐదు లేబొరేటరీలను నెలకొల్పామని తెలిపారు. ‘‘డీఆర్‌డీవో.. ఇప్పటికే 300కు పైగా విద్యాసంస్ధలతో కలిసి రూ.వెయ్యి కోట్ల ప్రాజెక్టులకు పనిచేస్తోంది. టెక్నాలజీ డెవల్‌పమెంట్‌ ఫండ్‌ సృష్టించడం ద్వారా పరిశోధన, అభివృద్ధి పరంగా వృద్ధి సాధిస్తున్నాం. మిస్సైల్స్‌ తయారీలో మాత్రమే కాకుండా.. అన్ని రంగాల్లోనూ డీఆర్‌డీవో విజయం సాధించింది’’ అని సతీశ్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో మనం తయారు చేసిన ఇంజన్‌లనే మన ఎయిర్‌క్రా్‌ఫ్టలకు వాడే అవకాశం కూడా ఉందన్నారు. 

Updated Date - 2022-01-21T08:40:57+05:30 IST