
ధాన్యం ఎలా కొనరో చూస్తాం: హరీశ్
పంజాబ్ మాదిరిగా కొనాలి: శ్రీనివాస్‌గౌడ్
కేంద్రమే ధాన్యం కొనాలి
నిజామాబాద్ జిల్లా
రెంజల్ బీజేపీ ఎంపీపీ తీర్మానం
యాసంగిలో పండిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలను నూకలు తినమంటారా..? ఇది యావత్తు తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీతో పాటు గజ్వేల్ మండలంలో ఆదివారం ఆయన పర్యటించిన సందర్భంగా మాట్లాడారు. నూకలు తినమని అవమానపరిచిన కేంద్ర ప్రభుత్వానికి నూకలు చెల్లేలా తీర్పును ఇవ్వాలని, అప్పుడే ధరలు తగ్గుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, మళ్లీ 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనుందని చెప్పారు. రక్షణ శాఖతో పాటు దేశంలోని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 15లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దమ్ముంటే వెంటనే ఆ ఉద్యోగాలను భర్తీ చేయించేలా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆయన సవాల్ విసిరారు. పంజాబ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లుగా తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రమే కొనాలని, రాష్ట్ర రైతుల పక్షాన తెలంగాణ ప్రభుత్వం ఎంతవరకైనా పోరాడుతుందని మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. యాసంగి ధాన్యాన్ని కేంద్రం భేషరతుగా కొనాలని మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని కోటకదిర ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘం సమావేశంలో, కోడూరు గ్రామ పంచాయతీ పాలక వర్గసమావేశంలోనూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. ఆ ప్రతులను మంత్రికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర పాలకులు తమ విధానాలను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వమే దొడ్డు రకం విత్తనాలను ప్రవేశపెట్టిందని, దొడ్డు రకం బియ్యం, ఉప్పుడు బియ్యం అంటూ ఇప్పుడు కుంటి సాకులు చెబుతూ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం దారుణమని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండలో జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేంతవరకు ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. ఈ మేరకు సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. కేంద్రం తెలంగాణను ఒక రాష్ట్రంగానే గుర్తించడంలేదని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో విలేకరులతో వారు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం మొండి వైఖరికి నిరసనగా ఉద్యమం చేపట్టబోతున్నామని ప్రకటించారు. ఉగాది తర్వాత మోదీ ప్రభుత్వానికి ఉద్యమసత్తా చూపిస్తామని చెప్పారు.
రాష్ట్రాలపై కక్ష కట్టిన కేంద్రం: బాల్క సుమన్
తాము అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష కట్టిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. ఆదివారం టీఆర్‌ఎ్‌సఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ తమ వల్ల కాదని ప్రధాని మోదీ బహిరంగంగా ప్రకటిస్తే.. రాష్ట్ర రైతాంగం కోసం సీఎం కేసీఆర్ ఆ బాధ్యతను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ధాన్యం కొనేవరకు కేంద్రంపై పోరాటాన్ని ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.