
200 ఏళ్లనాటి బన్సీలాల్‌పేట మెట్లబావికి మహర్దశ
53 ఫీట్ల బావి నుంచి 500 టన్నుల చెత్త తొలగింపు
రోజుకు 5-6ఫీట్ల మేర ఊట. 33 ఫీట్ల వరకు చేరిక
రెయిన్ వాటర్ ప్రాజెక్టు స్వచ్ఛంద సంస్థ చొరవతో శుద్ధి
‘మన్ కీబాత్’లో మోదీ ప్రస్తావించడంతో ప్రాచుర్యం
మా లక్ష్యానికి గుర్తింపు: కల్పనా రమేశ్
హైదరాబాద్ సిటీ/పద్మారావునగర్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలోని మెట్లబావి గురించి ‘మన్‌కీ బాత్’లో ప్రధాని మోదీ చెప్పేవరకు బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. అక్కడ మెట్లబావి ఉండేదా? అని అనుమానం వచ్చేలా ఏడాది కిందటి దాకా చెత్తాచెదారంతో నిండిపోయిన బావి, ఇప్పుడు చక్కగా నీటితో కనువిందు చేస్తోంది. నిజాం నాటి గొప్ప నిర్మాణశైలి, ఆ వైభవం కళ్లముందు సాక్షాత్కరించి సందర్శకులను అబ్బురపరుస్తోంది. రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఏన్జీవో సంస్థ, మునిసిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ చొరవతోనే ఇది సాధ్యమైంది. నీటి ప్రాధాన్యం గురించి చెబుతూ ప్రతినీటి బొట్టును సంరక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చిన సందర్భంగా ఈ మెట్లబావి పునరుద్ధరణను మోదీ ప్రశంసించారు! దీంతో బావికి ప్రచారం లభిస్తోంది.
18వ శతాబ్దం నాటి మెట్లబావి
బన్సీలాల్ పేటలోని మెట్లబావి 18వ శతాబ్దం నాటిది. ప్రజలకు మంచినీటి వసతి కోసం అప్పట్లో నిజాం రాజులు కట్టించారు. బావి సామర్థ్యం 22 లక్షల లీటర్లు. నీళ్లు ఎంతలోతుకెళ్లినా ప్రజలు ఇబ్బంది పడకుండా లోపలికి దిగి కడవలతో తెచ్చుకునేందుకు వీలుగా బావి అడుగుదాకా మెట్లను నిర్మించారు. బావి లోతు 53 అడుగులు. అప్పట్లో ప్రజల దాహార్తిని తీర్చిన ఈ మెట్లబావి... నల్లాలు, బోరుబావులు అందుబాటులోకి రావడంతో నిరాదరణకు గురై చెత్తకుప్పగా మారింది. గత 40 ఏళ్లలోనే ఇదంతా జరిగింది. ఏడాది క్రితం దాకా బావి అంతా చెత్తాచెదారంతో నిండి ఉండేది.
రెయిన్వాటర్ ప్రాజెక్టు చొరవతోనే..
మెట్లబావి పునరుద్ధరణకు రెయిన్ వాటర్ ప్రాజెక్టు సంస్థ ముందుకొస్తే మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వీంద్కుమార్ ప్రోత్సహించారు. బావి నుంచి 500 టన్నుల మట్టి, చెత్తను తొలగించారు. దీంతో కొత్తనీరు ఊరడం మొదలైంది. రోజుకు 5-6 ఫీట్ల మేర శుద్ధమైన జలం వచ్చింది. ప్రస్తుతం 33 ఫీట్ల మేరకు నీరు చేరింది. చూసేందుకు జనం వస్తున్నారు.
నిరాదరణకు గురైన మెట్లబావులు చాలా ఉన్నాయి
మేం బయటకు తీసిన చారిత్రక వైభవాన్ని, నీటి వనరులను పరిరక్షించాలనే మా లక్ష్యాన్ని ప్రధాని మోదీ గుర్తించి.. ‘మన్‌కీ బాత్’లో ప్రస్తావించడం ఆనందంగా ఉంది. ప్లైఓవర్ల కింద రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడానికి జోనల్ కమిషనర్‌ను సంప్రదించాం. ఆ క్రమంలోనే బన్సీలాల్‌పేటలో మెట్లబావిని చూశాం. గండిపేట్ వెల్ఫేర్ అసోసియేషన్, పలువురు ఆర్కిటెక్చర్ల సహకారంతో ప్రభుత్వానికి మేం చేసే పనులను ప్రతిపాదిస్తే సర్కారు సహకరించింది. క్రెయిన్లు ఏర్పాటు చేసి, రోజుకు 70-80మందితో చెత్తను తొలగించాం. నిరాదరణకు గురైన మెట్ల బావులు హైదరాబాద్‌లో చాలా ఉన్నాయి.
- ది రెయిన్వాటర్ ప్రాజెక్టు వ్యవస్థాపకులు కల్పనా రమేశ్