గ్రామ పంచాయతీ కార్యాలయం ఇల్లంతకుంట
- పల్లెలకు చేరనున్న టీఎస్‌బీపాస్
- వచ్చే నెల నుంచి అమలుకు కసరత్తు
- ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- భవన నిర్మాణ అనుమతుల్లో అవినీతికి చెక్
- జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు
(ఆఽంధ్రజ్యోతి సిరిసిల్ల)
మున్సిపాలిటీ తరహాలోనే తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సేల్స్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్‌బీపాస్) వచ్చే నెల నుంచి గ్రామాల్లో అమలు కానుంది. దీంతో గ్రామ పంచాయతీల్లో భవన నిర్మాణ అనుమతుల్లో ప్రజాప్రతినిధుల జోక్యం తగ్గిపోవడంతోపాటు అక్రమ నిర్మాణాలకు బ్రేక్ పడనుంది. టీఎస్‌బీపాస్ విధానాన్ని వచ్చే నెల నుంచి గ్రామ పంచాయతీల పరిధిలో అమలు చేయడానికి ప్రభుత్వం ఈ నెల 12న జీవో 52ను జారీ చేసింది. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా రూపొందించారు. చేర్పులు, మార్పులతో గ్రామీణుల ముంగిటకు రానుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాల్లో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వెయ్యి కన్నా తక్కువ జనాభా ఉన్న గ్రామాలు 100, వెయ్యి నుంచి 5 వేల వరకు 148 పంచాయతీలు, 5001 జనాభా పైన ఉన్న గ్రామ పంచాయతీలు 7 ఉన్నాయి. మున్సిపల్ పరిధిలో అమలవుతున్న పద్ధతిలోనే భవన నిర్మాణాలకు గ్రామ పంచాయతీల్లోనూ అనుమతులు పొందాలి. ప్రస్తుతం ఈ-పంచాయతీ ద్వారా మంజూరు చేస్తున్నారు. 300 గజాల వరకు స్థలం ఉండి నిర్మాణాల అనుమతికి దరఖాస్తు చేసుకుంటే కార్యదర్శులు పరిశీలించి అనుమతులు ఇస్తున్నారు. అంతకుమించి ఉంటే టౌన్ అండ్ ప్లానింగ్ శాఖ ద్వారా అనుమతులు వస్తున్నాయి. ప్రస్తుతం కొత్త విధానం ద్వారా టీఎస్ బీపాస్ ద్వారా అనుమతులు వస్తాయి.
21 రోజుల్లోనే అనుమతులు
టీఎస్ బీపాస్ ద్వారా ప్రస్తుతం మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నారు. మీ సేవా ద్వారా అన్ని డాక్యుమెంట్లు, ప్లాటు వివరాలు పొందుపర్చి టీఎస్బీపాస్కు దరఖాస్తు చేయగానే అక్కడి అధికారి పరిశీలిస్తారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, ఆర్అండ్బీ అధికారులు పరిశీలించి 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నారు. డాక్యుమెంట్లు సరిగ్గా లేకుంటే తిరస్కరిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో కూడా 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నారు. టీఎస్‌బీపాస్‌తో గ్రామాల్లో ఉపయోగకరంగా ఉన్నా సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అన్న గ్రామాల్లో మీ సేవా కేంద్రాలు అందుబాటులో లేవు. డాక్యుమెంట్ల కోసం మండల కేంద్రాలకు వెళ్లి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో డాక్యుమెంటేషన్ ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మరోవైపు ఇప్పటికే టీఎస్‌బీపాస్ ద్వారా తిరస్కరించిన దరఖాస్తుల ఫీజులు తిరిగిరానట్లు తెలుస్తోంది. టీఎస్‌బీపాస్ ద్వారా పారదర్శకత పెరగనుంది. అక్రమ నిర్మాణాలకు బ్రేక్ పడడమే కాకుండా గ్రామాల్లోనూ సెట్ బ్యాక్, అంతర్గత రోడ్లలో తప్పనిసరిగా 30 ఫీట్లు నిబంధనలు పాటించడం కచ్చితం కానున్నాయి. టీఎస్‌బీపాస్ అమలుపై గ్రామీణుల్లో మాత్రం ఆసక్తి నెలకొంది.
పల్లెల్లో జోరందుకున్న రియల్ వ్యాపారం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఏర్పడిన తరువాత భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. మరోవైపు జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ, జేఎన్టీయూ, అగ్రికల్చర్ కాలేజీలతోపాటు అపెరల్ పార్కు, అనేక సంస్థలు ఏర్పాటు అవుతున్న క్రమంలో జిల్లాలో రియల్ వ్యాపారం జోరందుకుంది. హైదరాబాద్ నగరం నుంచి జిల్లాకు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో కోట్లలోనే వ్యాపారాలు సాగుతున్నాయి. మరోవైపు మండల కేంద్రాలు కూడా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుండడంతో అనుమతులు లేకుండానే వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారుతున్నాయి. ప్రభుత్వ భూములను సైతం విక్రయిస్తున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రానికి సరిహద్ధు మండలాల్లో భూ అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రజావాణిలో దరఖాస్తులు ఇవ్వడంతోపాటు ఆందోళనలు కూడా చేపడుతున్నారు. తంగళ్లపల్లిలో ఇటీవల అక్రమ రిజిస్ర్టేషన్లపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం అమలు చేయనున్న టీఎస్‌బీపాస్ ద్వారా అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడనుందని భావిస్తున్నారు.