503 గ్రూపు-1 పోస్టులు.. నోటిఫికేషన్‌లోని రూల్స్ ఇలా..!

ABN , First Publish Date - 2022-04-27T14:58:27+05:30 IST

రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతోంది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా గ్రూపు-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ అయింది. 16,614 పోలీసు పోస్టులకు సోమవారం నోటిఫికేషన్‌ జారీ కాగా.. మంగళవారం 503 గ్రూపు-1 కొలువుల భర్తీకి...

503 గ్రూపు-1 పోస్టులు.. నోటిఫికేషన్‌లోని రూల్స్ ఇలా..!

టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల..

తెలంగాణ ఆవిర్భవించాక తొలిసారి

జూలై, ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్ష..

నవంబరు, డిసెంబరులో మెయిన్‌


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతోంది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా గ్రూపు-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ అయింది. 16,614 పోలీసు పోస్టులకు సోమవారం నోటిఫికేషన్‌ జారీ కాగా.. మంగళవారం 503 గ్రూపు-1 కొలువుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఇందులో మొత్తం 18 విభాగాలకు చెందిన పోస్టులు ఉన్నాయి. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో మంగళవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశంలో సభ్యులు ధన్సింగ్‌, లింగారెడ్డి, అరుణ కుమారి, సుమిత్ర ఆనంద్‌, రవీందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రావు, ఆర్‌.సత్యనారాయణ, కార్యదర్శి అనితా రామచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రూపు-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 503 పోస్టులకు పోటీ పడే అభ్యర్థుల కోసం సిలబస్‌, వయో పరిమితి, పరీక్ష విధానం వంటి వివరాలను కమిషన్‌ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పోస్టుల భర్తీ కోసం తెలుగు, ఆంగ్ల భాషల్లోనే కాకుండా తొలిసారిగా ఉర్దూలోనూ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు.


గ్రూపు-1 పోస్టులకు ఇంటర్వ్యూలను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో మెయిన్‌ పరీక్షను మొత్తం 900 మార్కులకు నిర్వహించనున్నారు. ఇందులో అత్యధిక మార్కులు సాధించే అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ నుంచి మెయిన్‌కు ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలను జూలై, ఆగస్టులో; మెయిన్‌ పరీక్షలను నవంబరు, డిసెంబరుల్లో నిర్వహించనున్నారు. మొత్తం 33 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పోస్టుల భర్తీలో వివిధ వర్గాలకు రిజర్వేషన్లతో పాటు ఈడబ్ల్యూఎస్‌, స్పోర్ట్స్‌, పీహెచ్‌ విభాగాల రిజర్వేషన్లను కూడా అమలు చేయనున్నారు. మే 2 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తులను సమర్పించడానికి మే 31 వరకు గడువు ఇచ్చారు.


నోటిఫికేషన్‌లోని ముఖ్యాంశాలు..

  • ఈ నోటిఫికేషన్‌ ద్వారా ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌-2018 ప్రకారం 95 శాతం పోస్టులను స్థానిక అభ్యర్థులతోనే భర్తీ చేయనున్నారు.
  • గ్రూపు-1 పోస్టుల భర్తీలో ప్రిలిమినరీ టెస్ట్‌ను ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో, మెయిన్‌ను రాత పరీక్షగా నిర్వహించనున్నారు.

  • ఇంటర్వ్యూలను రద్దు చేశారు. రాత పరీక్షలో అత్యధిక మార్కులను సాధించిన అభ్యర్థులను పోస్టుల కోసం ఎంపిక చేయనున్నారు.
  • గ్రూపు-1 పోస్టుల కోసం దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా టీఎస్‌పీఎస్సీ ద్వారా ఓటీఆర్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
  • తొలిసారిగా ఈడబ్ల్యూఎస్‌, స్పోర్ట్స్‌ రిజర్వేషన్లను అమలు పరచనున్నారు. 
  • పరీక్షల నిర్వహణలో భాగంగా ముద్రిత ప్రశ్నపత్నం బదులు ఇ-ప్రశ్న పత్రాన్ని అందించాలని కమిషన్‌ నిర్ణయించింది.
  • మెయిన్‌ పరీక్షను నిపుణులతో డిజిటల్‌ మూల్యాంకనం చేయించనున్నారు. 
  • డీఎస్పీ పోస్టుకు అభ్యర్థుల ఎత్తును 165 సెంటీమీటర్లకు తగ్గించలేదు. 167.6 సెంటీమీటర్లుగానే ఉంచారు. అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టుకు ఎత్తు గతంలో 165 సెంటీమీటర్లు ఉంటే దాన్ని 167.6 సెంటీమీటర్లకు పెంచారు.
  • గ్రూపు-1 దరఖాస్తుకు రూ.200 ప్రాసెసింగ్‌ ఫీజుతో పాటు పరీక్ష ఫీజు రూ.120ని ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, పీహెచ్‌, ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. నిరుద్యోగులమని డిక్లరేషన్‌ సమర్పించిన అభ్యర్థులకూ ఫీజు మినహాయింపు వర్తిస్తుందని టీఎ్‌సపీఎస్సీ స్పష్టం చేసింది.
  • ప్రిలిమినరీ పరీక్షను 33 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. హెచ్‌ఎండీఏ పరిధి అంతా హైదరాబాద్‌ కేంద్రంగా పరిగణిస్తారు. ఒక్కో అభ్యర్థి దరఖాస్తు సమయంలో తనకు నచ్చిన 12 కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు. వాటిలో దేన్నయినా కేటాయించే అధికారం తమకు ఉంటుందని కమిషన్‌ స్పష్టం చేసింది. 
  • అభ్యర్థులు వన్‌టైం రిజిస్ట్రేషన్‌ నంబరును నమోదు చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు, హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌  సాంకేతిక సమస్యలు తలెత్తితే 04023542184 లేదా 04023542187 నంబర్లను సంప్రదించాలని టీఎ్‌సపీఎస్సీ సూచించింది.


Updated Date - 2022-04-27T14:58:27+05:30 IST