శ్రీవారి ఆర్జిత సేవలకు కొవిడ్‌ టెస్ట్‌ తప్పనిసరి

ABN , First Publish Date - 2021-03-06T09:34:06+05:30 IST

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న భక్తులు 72 గంటల ముందు కొవిడ్‌-19 పరీక్ష చేయించుకుని నెగెటివ్‌ రిపోర్టు సర్టిఫికెట్‌ తీసుకొస్తేనే అనుమతిస్తామని

శ్రీవారి ఆర్జిత సేవలకు కొవిడ్‌ టెస్ట్‌ తప్పనిసరి

నెగెటివ్‌ రిపోర్టు తీసుకొస్తేనే అనుమతి

ఇకపై ఇతర ఆలయాలను టీటీడీ ఆధీనంలోకి తీసుకోం

త్వరలో అగర్‌బత్తీలు, సబ్బులు, ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ 

ఈవో జవహర్‌రెడ్డి ప్రకటన


తిరుమల, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న భక్తులు 72 గంటల ముందు కొవిడ్‌-19 పరీక్ష చేయించుకుని నెగెటివ్‌ రిపోర్టు సర్టిఫికెట్‌ తీసుకొస్తేనే అనుమతిస్తామని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఏప్రిల్‌ 14 నుంచి ఆలయంలో ఆర్జితసేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో శుక్రవారం ఉదయం డయల్‌ యువర్‌ టీటీడీ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా పూర్తిస్థాయిలో తగ్గాక విచక్షణ కోటా, ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ ద్వారా సేవా టికెట్లను మంజూరు చేస్తామన్నారు. అలాగే, నిర్వహణ భారం దృష్ట్యా ఇకపై ఇతర ఆలయాలు వేటినీ టీటీడీ పరిధిలోకి తీసుకోకూడదని టీటీడీ బోర్డు నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే 32 ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకున్నట్లు వివరించారు.


ఇంకా పంచగవ్య ద్వారా తయారుచేసిన ఉత్పత్తులను టీటీడీ ఆలయాల వద్ద విక్రయించి, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని గోసంరక్షణకు వినియోగించాలని నిర్ణయించామన్నారు. అగరబత్తీలు, సబ్బులు వంటివాటితోపాటు ఆయుర్వేద వైద్యానికి ఉపయోగించే 15 ఉత్పత్తులను త్వరలోనే తయారు చేస్తామని తెలిపారు. భవిష్యత్‌లో విద్యుత్‌తో నడిచే వాహనాలను మాత్రమే తిరుమలకు అనుమతించే ఆలోచనతో ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు ఎన్‌టీపీసీ ద్వారా ధర్మగిరిలో 25 ఎకరాల్లో ఐదు మెగావాట్ల సామర్థ్యంతో సౌరవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈవో తెలిపారు.


శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

అమరావతి: శ్రీకాళ హస్తీశ్వరస్వామి మహాశివరాత్రి బ్రహ్మో త్సవాలకు హాజరుకావాలని సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఎమ్మెల్యే బియ్యపు మధు సూదనరెడ్డి, ఈవో పెద్దిరాజు  ఆహ్వానించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వీరు సీఎంను కలిశారు.

Updated Date - 2021-03-06T09:34:06+05:30 IST