ఆంజనేయుడి జన్మస్థలంపై టీటీడీ అధికారిక ప్రకటన

ABN , First Publish Date - 2021-04-21T17:11:48+05:30 IST

శ్రీరాముడి ప్రియ భక్తుడైన హనుమంతుడి జన్మ స్థలంపై శ్రీరామ నవమి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది.

ఆంజనేయుడి జన్మస్థలంపై టీటీడీ అధికారిక ప్రకటన

తిరుమల: శ్రీరాముడి ప్రియ భక్తుడైన హనుమంతుడి జన్మ స్థలంపై శ్రీరామ నవమి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. ధైర్యానికి, అభయానికి మారుపేరుగా భక్తులు కొలిచే ఆంజనేయుని జన్మస్థలం తిరుమల గిరుల్లోని అంజనాద్రి అని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. అంజనాదేవి తపస్సు ఫలితంగా వాయుదేవుని ఆశీర్వాదంతో తిరుమల గిరి కొండల్లోని అంజనాద్రిపై వెలసిన జపాలీ తీర్థమే ఆంజనేయుడి జన్మస్థలమని ఆధారాలతో సహా నిరూపితమైనట్లు టీటీడీ పేర్కొంది. ఈవో కేఎస్ జవహర్ రెడ్డి ఆలోచనతో చిదంబరశాస్త్రి ఆధ్వర్యంలో మురళీధర శర్మ, రాణి సదాశివమూర్తి, రామకృష్ణ తదితరులతో ఒక కమిటీని నియమించారు.


ఈ కమిటీ గత ఏడాది డిసెంబర్ 15న సమావేశమై చర్చించారు. అప్పటి నుంచి అనేక సార్లు కమిటీ సమావేశమై పరిశోధనలు చేసింది. పురాణాలు, ఇతిహాసాలు, ఇన్‌స్క్రిప్షన్స్, జియోగ్రఫీతో పాటు ఇస్రో నుంచి శాస్త్రవేత్తల ద్వారా లాట్యుట్యూడ్స్, లాంగ్యిట్యూడ్స్ అన్నింటినీ పరిశీలించి ఆంజనేయుడి జన్మ స్థానం తిరుమలగిరే అని ధ్రువీకరించింది. ఈ మేరకు శ్రీరామ నవమి రోజున టీటీడీ అధికారిక ప్రకటన చేసింది.


ద్వారకలో ఆధారాలు లేవు: చిదంబరశాస్త్రి

తిమ్మసముద్రం సంస్కృత పాఠశాల రిటైర్డ్‌ అధ్యాపకులు, హనుమద్‌ ఉపాసకులు అన్నదానం చిదంబరశాస్త్రి ప్రకాశం జిల్లా చీరాలకు చెందినవారు. ఆయన హనుమజ్జయంతిపై పీహెచ్‌డీ చేసి.. ఆధారాలతో సహా నిరూపించారు. ద్వారకా పీఠాధిపతి కర్ణాటకలోని హంపి ప్రాంతం ఆంజనేయుని జన్మస్థలంగా ప్రస్తావించారని, అయితే దీనికి ఎలాంటి ప్రమాణాలూ లేవని చిదంబరశాస్త్రి వివరించారు. గుజరాత్, జార్కండ్, మహారాష్ట్ర, కర్ణాటక కూడా హనుమంతుడి జన్మస్థలాన్ని క్లెయిమ్ చేశాయని, కానీ మన రాష్ట్రంలోనే ఆంజనేయుడు జన్మించారని స్పష్టం చేశారు. 1972 నుంచి హనుమంతుని ఉపాసన చేస్తున్న చిదంబరశాస్త్రి పలు తాళపత్ర గ్రంథాలను పరిశీలించిన తర్వాత, వాటిని తెలుగు, ఇంగ్లీషులోకి కూడా అనువదించినట్టు తెలిపారు. ఆ తర్వాత హనుమంతుని జన్మస్థలానికి సంబంధించి పీహెచ్‌డీ కూడా చేసినట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే తిరుమలలోని అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలంగా నిరూపణ అయినట్టు తెలిపారు. 1980 నుంచి 1999 వరకు అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించాలని సంతకాల సేకరణను ఉద్యమంలా నిర్వహించామన్నారు. అప్పటి టీటీడీ ఈవో వినాయకరావుకు పంపించామని, జాపాలి మహర్షి తపస్సు చేసింది కూడా అక్కడేనని, అందుకే ఆ ప్రదేశాన్ని జాపాలితీర్థం అంటారని పేర్కొన్నారు.

Updated Date - 2021-04-21T17:11:48+05:30 IST