కలెక్టరేట్‌ వద్ద టీటీడీ అటవీ కార్మికుల ధర్నా

ABN , First Publish Date - 2022-05-24T07:26:06+05:30 IST

తమ సర్వీసును రెగ్యులరైజేషన్‌ చేయాలని కోరుతూ టీటీడీ అటవీ కార్మికులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు.

కలెక్టరేట్‌ వద్ద టీటీడీ అటవీ కార్మికుల ధర్నా
కార్మికులను అడ్డుకున్న పోలీసులు - వినతిపత్రం స్వీకరిస్తున్న కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి

పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత

న్యాయం చేస్తామన్న కలెక్టర్‌ హామీతో విరమణ


తిరుపతి(రవాణా), మే 23: తమ సర్వీసును రెగ్యులరైజేషన్‌ చేయాలని కోరుతూ టీటీడీ అటవీ కార్మికులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. అటవీ కార్మికులకు న్యాయం చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చిన విషయం విదితమే. ఇందులో భాగంగా తిరుపతిలోనూ కార్మికులంతా ఏకమై కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వీరిలో కొందరు శ్రీదేవి, భూదేవి, శ్రీవేంకటేశ్వరుడు వేషధారణలతో వచ్చారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలనుకున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఆదేశాలతో కార్మికులను లోపలకు అనుమతించారు. అనంతరం కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. పాతికేళ్లకుపైగా పనిచేస్తున్న తాము 2019లో పాలకమండలి చేసిన తీర్మానాన్ని అమలు చేయాలని 556 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా.. టీటీడీ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన కోర్కెను పరిష్కరించమని పోరాటం చేస్తుంటే గృహ నిర్బంధం చేస్తున్నారని వాపోయారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. టీటీడీ ఉన్నతాధికారులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ధర్నా విరమించారు. కాగా.. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళిని ఉదయమే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదని, ఎన్నికల ముందు సీఎం ఇచ్చిన హామీలను, టీటీడీ బోర్డు తీర్మానాలను, కోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 


‘స్పందన’కు 104 అర్జీలు: కలెక్టర్‌ 

కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమానికి 104 అర్జీలు వచ్చాయని కలెక్టర్‌ తెలిపారు. వీటిల్లో.. రెవెన్యూ శాఖకు సంబంధించి 78, పంచాయతీరాజ్‌కు 10, మిగిలిన శాఖలకు 16 అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలపై సత్వరమే చర్యలు తీసుకుని పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. జేసీ బాలాజీ, డీఆర్వో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T07:26:06+05:30 IST