ధార్మిక కార్యక్రమాలకే టీటీడీ భూములు

ABN , First Publish Date - 2021-01-22T06:01:38+05:30 IST

శ్రీవారికి భక్తులు కానుకగా అందించిన భూములను గోశాలలు, గీతామందిరాలు వంటి ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని టీటీడీ ఆస్తుల పరిరక్షణ కమిటీ సూచించింది.

ధార్మిక కార్యక్రమాలకే టీటీడీ భూములు
సమావేశంలో పాల్గొన్న టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి

టీటీడీ ఆస్తుల పరిరక్షణ కమిటీ సమావేశంలో కీలక చర్చ


తిరుపతి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): శ్రీవారికి భక్తులు కానుకగా అందించిన భూములను గోశాలలు, గీతామందిరాలు వంటి ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని టీటీడీ ఆస్తుల పరిరక్షణ కమిటీ సూచించింది. టీటీడీ ఆస్తులను ప్రస్తుత పాలకమండలి విక్రయించే ప్రతిపాదనలు చేసినప్పుడు పెనుదుమారం రేగిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో టీటీడీ ఆస్తులను ఎలా వినియోగించాలి, సంరక్షించాలనే అంశంపై ఆస్తుల పరిరక్షణ కమిటీని పాలకమండలి నియమించింది. ఈ కమిటీలో శృంగేరి శారదాపీఠం సీఈవో గౌరీశంకర్‌, కంచిమఠం ప్రతినిధి సీతారామమూర్తి, మంత్రాలయ పీఠ ప్రతినిధి శ్రీధర్‌ రావు, ధర్మకర్తల మండలి సభ్యులు వైద్యనాథన్‌ కృష్ణమూర్తి, గోవిందహరి, సీనియర్‌ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి, సామాజిక వేత్త బయ్యా శ్రీనివాసులు ఉన్నారు. ఆ కమిటీ తొలి సమావేశం గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో జవహర్‌రెడ్డి చాంబర్‌లో జరిగింది. 1974 నుంచి 2014 వరకు టీటీడీ దేశ వ్యాప్తంగా విక్రయించిన ఆస్తులు, ప్రస్తుతం టీటీడీ వద్ద ఉన్న ఆస్తుల వివరాలు, కోర్టు కేసులు, ఇతర వివాదాల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వారికి అధికారులు వివరించారు.  ఈ సందర్భంగా ఈవో జవహర్‌రెడ్డి అధికారులతో మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా లీజు పాలసీని పునఃపరిశీలించాలన్నారు. మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో జేఈవో, కమిటీ కన్వీనర్‌ సదాభార్గవి, ఎస్టేట్‌ ఆఫీసర్‌ మలికార్జున తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T06:01:38+05:30 IST