అమెరికాలో ప్రారంభమైన శ్రీనివాస కల్యాణాలు

ABN , First Publish Date - 2022-06-20T02:24:13+05:30 IST

అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీతో కలిసి ఆదివారం తెల్లవారుజామున (భారతకాలమానం ప్రకారం) శ్రీనివాస కల్యాణాన్ని టీటీడీ కన్నులపండువగా నిర్వహించింది.

అమెరికాలో ప్రారంభమైన శ్రీనివాస కల్యాణాలు

తిరుమల: అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీతో కలిసి ఆదివారం తెల్లవారుజామున (భారతకాలమానం ప్రకారం) శ్రీనివాస కల్యాణాన్ని టీటీడీ కన్నులపండువగా నిర్వహించింది. ఇండియన్‌ కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన ఈ కల్యాణోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. పుణ్యాహవచనంలో భాగంగా కల్యాణోత్సవ ప్రారంభానికి ముందు అన్ని వస్తువులను, ప్రాంగణాలను శుభ్రపరిచారు. అలాగే శ్రీ వేంకటేశ్వరస్వామి సర్వసైన్యాధిపతి విశ్వక్సేనుడి ఆరాధన నిర్వహించారు. కలశంలోని శుద్ధి చేసిన నీటిని హోమగుండం, మంటపంలోని అన్ని వస్తువులపై చల్లి శుద్ధి కార్యక్రమం జరిపారు. అష్టదిక్పాలకులను ఆవాహన చేసి అంకురార్పణ చేశారు. 


అలాగే అర్చకులు పవిత్రమైన కంకణాలను స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు సమర్పించారు. పవిత్రమైన అగ్నిని వెలిగించి ప్రాయశ్చిత్త హోమం నిర్వహించారు. అగ్నిప్రతిష్ఠానంతరం దేవతలకు కొత్త పట్టువస్ర్తాలు సమర్పించారు. అలాగే తాళ్లపాక వంశస్థులు అమ్మవారి తరఫున కన్యాదానం చేసి మహా సంకల్పం చేశారు. ఆపై వివాహ వేడుక నేత్రపర్వంగా జరిగింది. చివరిగా కర్పూర, నక్షత్ర, మహా హారతితో కల్యాణోత్సవం ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ప్రవాసాంధ్రుల సమతి చైర్మన్‌ మేడపాటి వెంకట్‌, ఎస్వీబీసీ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రత్నాకర్‌, నాటా అధ్యక్షుడు శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-06-20T02:24:13+05:30 IST