శ్రీవారి ఆలయంలో అధికారులదే రాజ్యం..ఆగమ సలహా మండలి నియామకంపై టీటీడీ ఎందుకు మౌనం పాటిస్తోంది..!

ABN , First Publish Date - 2022-03-17T18:20:08+05:30 IST

తిరుమల. హిందూవుల ఆరాధ్య దైవం వేంకటేశ్వరుడు కొలువైన క్షేత్రం. నిత్యకల్యాణం పచ్చతోరణం తిరుమల ట్యాగ్ లైన్‌. నిత్సోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరీకోత్సవాలంటూ

శ్రీవారి ఆలయంలో అధికారులదే రాజ్యం..ఆగమ సలహా మండలి నియామకంపై టీటీడీ ఎందుకు మౌనం పాటిస్తోంది..!

దేశంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థగా ఖ్యాతి గడించిన టీటీడీలో ఆగమ సలహామండలి నియామకం ఎందుకు జరగడం లేదు. శ్రీవారి కైంకర్యాలు ఆగమోక్తంగా ఉన్నాయో లేదో పరిశీలించే అత్యంత కీలకమైన ఆగమ సలహా మండలి నియామకంపై టీటీడీ ఎందుకు మౌనం పాటిస్తోంది. నిర్ణయం తీసుకున్నా అమలు విషయంలో జాప్యమెందుకు చేస్తోంది. ఈ నియామకాన్ని అడ్డుకుంటున్నది ఎవరు..అనే ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం... 


హిందూవుల ఆరాధ్య దైవం వేంకటేశ్వరుడు

తిరుమల. హిందూవుల ఆరాధ్య దైవం వేంకటేశ్వరుడు కొలువైన క్షేత్రం. నిత్యకల్యాణం పచ్చతోరణం తిరుమల ట్యాగ్ లైన్‌. నిత్సోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరీకోత్సవాలంటూ శ్రీవారి ఆలయంలో ఎప్పుడు ఏ సేవలు చేయాలో ముందుగానే నిర్దేశిస్తారు. స్వామివారి కైంకర్యాలలో అపశృతి దొర్లకుండా భగవద్రామానుజాచార్యులు వెయ్యేళ్ళ కిందటే కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటుచేశారు. వైఖానాసాగమోక్తంగా కైంకర్యాలు జరగాలని నిర్దేశించారు.  కైంకర్యాల పర్యవేక్షణకు జియ్యంగార్ల వ్యవస్థనూ ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి శ్రీవారికి వైభవోపేతంగా ఎన్నోసేవలు జరుగుతున్నాయి. అయితే కొండకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో స్వామివారి కైంకర్యాలకు కోత పడుతోందనే ఆరోపణలు వచ్చాయి. 


ఫలితంగా టీటీడీపై ఎన్నో విమర్శలు.. ఆరోపణలు. దీనిపై స్పందించిన టీటీడీ కైంకర్యాలు ఆగమోక్తంగా, నిర్ణీత సమయంప్రకారమే జరుగుతున్నాయో లేదో పరిశీలించడంతోపాటు,  వివిధ ఆగమపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా ఆగమసలహా మండలిని ని నియమించింది. పాతికేళ్ళ కిందటే ఈ కమిటీ నియామకం జరిగింది.  శ్రీవారి ఆలయంలో పూజలు, ఇతర ఉత్సవాలకు ముహుర్తం ఖరారు, ఆలయంలో భక్తుల సౌకర్యార్ధం  ఏమైనా మార్పులు చేయాలనిభావిస్తే టీటీడీ ఈ మండలి సలహాలను తీసుకునేది.  గతంలో భక్తులు సౌకర్యార్దమంటు శ్రీవారి ఆలయంలో నేత్రద్వారాలను ఏర్పాటు చేయాలని భావించారు.  అయితే ఇది ఆగమశాస్త్ర విరుద్ధమని పండితులు తేల్చడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. 


విమర్శలకు దూరంగా టీటీడీ

తదుపరి ఆగమపండితుల అనుమతితోనే ఆలయం వెలుపల వైభోత్సవ మండపం, బూందీ పోటు ఏర్పాటు చేశారు.ఆలయం ఎదురుగా వున్న వెయ్యికాళ్ల మండప తొలగింపునకూ ఆగమ పండితులు అభ్యంతరం తెలపలేదు. ఇలా శ్రీవారి ఆలయంలో ప్రతిపనికి ఆగమసలహా మండలి సలహాలమేరకు నడుచుకోవడంతో టీటీడీ విమర్శలకు దూరంగా ఉంటోంది.ఇంతటి కీలకమైన సలహా మండలినియామకంటో టీటీడీ మీనమేషాలు లెక్కిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఈ సలహామండలి కాలపరిమితి 2020 డిసెంబరులో పూర్తయింది. తరువాత ఆరునెలల అంటే 2021 జూన్‌లో   టీటీడీ  బోర్డు  కొత్త సలహామండలి నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతోపాటు ఏడుగురి సభ్యుల సంఖ్యను 15కు పెంచాలని నిర్ణయించింది. తమిళనాడు,కర్నాటక  నుంచికూడా ఒకొక్కరిని  నియమించాలని తీర్మానించింది.అందుకు అనుగుణంగా 15 మంది పేర్లనూ  సిఫార్సు చేసింది. వీరిలో ఓ ఇద్దరిని మాత్రం  ఆగమ పండితులుగా నియమించారేకానీ, శ్రీవారి ఆలయానికి సంబంధించిన నియామకాలన మాత్రం ప్రక్కన పెట్టేశారు.


టీటీడిలోని ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పుతున్నారనే  గుసగుసలు

దీంతో శ్రీవారి ఆలయంలో ముఖ్యమైన కార్యక్రమాలకోసం ఆలయ ప్రధాన అర్చకులే ముహూర్తం నిర్ణయిస్తున్నారు. ఆగమ శాస్ర్త పర్యవేక్షణ కూడా చేయాల్సిన సలహమండలి నియామకం కాకుండా టీటీడిలోని ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పుతున్నారనే  గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులోభాగంగా ఎంతో కీలకమైన రెసిడెండ్ ఆగమ సలహాదారుడి పోస్టు భర్తీ చేయడం లేదంటున్నారు.  శ్రీవారి ఆలయంతోపాటు,  మాడ వీధుల్లో ఏదైనా ఆపశృతి జరిగితే  స్ధానికాలయాల ఆగమ సలహాదారుడి సూచనలతో సంప్రోక్షణ చేసి సరిపెట్టేస్తున్నారు. గతంలో ఆగమ సలహా మండలి అనుమతి లేకుండా గుడిలో ఏ కార్యక్రమం చేయని  టీటీడి అధికారులు... 15నెలల నుంచి సలహా మండలి లేకుండానే పనులు కానిచ్చేస్తున్నారు. దీనిని అర్చకులు  కూడా ప్రశ్నించలేకపోతున్నారు.  


ఆ కీలక అధికారి గుడిలో తన మాట నెగ్గించుకోవడానికే 

అర్చకులంతా వంశపార్యపరం నుంచి ఉద్యోగులుగా మారిపోవడంతో మౌనంగా ఉండిపోతున్నారు. గతంలో శ్రీవారి ఆలయంలో పూజాకైంకర్యాలపై మీడియా సమావేశాలలో ఆరోపణలు గుప్పించిన రమణ దీక్షితులు తన ప్రధానఅర్చక పోస్టు కోసం మౌనం పాటిస్తున్నారని అంటున్నారు.ఒకవేళ టీటీడీని ప్రశ్నిస్తే అది ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తెస్తుందనే ఉద్దేశంతో ఆయన నోరుతెరవడంలేదుట. మొత్తం మీద ఆ కీలక అధికారి గుడిలో తన మాట నెగ్గించుకోవడానికిఆగమసలహామండలి నియామాకానికి చెక్‌ పెట్టారని టీటీడీలో ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పటికైనా టీటీడీ తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తుందో లేదో చూడాలి. 

Updated Date - 2022-03-17T18:20:08+05:30 IST