Dinakaran: సరైన సమయంలో మా వర్గంలోకి ఈపీఎస్‌

ABN , First Publish Date - 2022-10-03T13:10:45+05:30 IST

అన్నాడీఎంకే శాసనసభాపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) సరైన సమయంలో తమ వర్గంలో చేరటం

Dinakaran: సరైన సమయంలో మా వర్గంలోకి ఈపీఎస్‌

                                      - దినకరన్‌ జోస్యం


చెన్నై, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే శాసనసభాపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) సరైన సమయంలో తమ వర్గంలో చేరటం ఖాయమని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నాయకుడు టీటీవీ దినకరన్‌(TTV Dhinakaran) జోస్యం చెప్పారు. తంజావూరులో ఆదివారం ఉదయం గాంధీ జయంతి సందర్భంగా బాపూ చిత్రపటానికి పూలమాల వేసి దినకరన్‌ నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్‌ఎ్‌సఎస్‌ ర్యాలీకి హైకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో ఆ ర్యాలీలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. 2024లో లోక్‌సభ ఎన్నికలతోపాటు, శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతాయనే తాను భావిస్తున్నానన్నారు. ఐదేళ్లుగా తామ పార్టీ సమర్థవంతంగా ప్రజలకు సేవలందిస్తోందని, ఎట్టి పరిస్థితుల్లో అన్నాడీఎంకేలో విలీనమయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అన్ని వర్గాల నాయకులంతా ఏకం కావాలని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం(Former CM Panneerselvam) ఇచ్చిన పిలుపు మంచిదేనన్నారు. శశికళ జైలులో ఉన్నప్పుడు అన్నాడీఎంకేకు చెందిన మంత్రులంతా తనతోపాటు ఆమెను కలిసి  పరామర్శించారని, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎడప్పాడి రాలేదని, ఆ విషయమై ప్రశ్నించినప్పుడు లోకాయుక్తకు సంబంధించిన ఓ సమస్య ఉండటం వల్ల తాను రాలేనని చెప్పారని దినకరన్‌ పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ అన్నాడీఎంకేలో ప్రస్తుత పరిస్థితులను పరిశీలించినట్లయితే వీలైనంత త్వరగా వేర్వేరుగా ఉన్న నాయకులంతా త్వరలో ఏకమవుతారనే నమ్మకం ఉందని దినకరన్‌ వెల్లడించారు.

Updated Date - 2022-10-03T13:10:45+05:30 IST