సమస్యల వెం‘బడి’

ABN , First Publish Date - 2022-07-04T04:36:17+05:30 IST

పాఠశాలలు రేపటి నుంచి పునః ప్రారంభం కానున్నాయి. జిల్లాలో చాలా ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకుని విద్యార్థులకు సమస్యల స్వాగతం పలుకుతున్నాయి. తాగునీరు, మరుగుదొడ్ల వంటి కనీస వసతుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ‘నాడు-నేడు’ కింద చేపడుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్నిచోట్ల పనులు పునాదుల దశలో ఉండగా.. మరికొన్ని చోట్ల వివాదాల కారణంగా పనులు ప్రారంభం కాలేదు. మరోవైపు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు ఇంతవరకూ పూర్తిస్థాయిలో పాఠశాలలకు చేరలేదు. దీంతో విద్యార్థులకు ఈ ఏడాది ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

సమస్యల వెం‘బడి’
టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ధ్వంసమైన గోడ

- రేపటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం

- కానరాని కనీస సౌకర్యాలు

- కొనసాగుతున్న ‘నాడు-నేడు’ పనులు 

- ఈ ఏడాదీ విద్యార్థులకు తప్పని ఇబ్బందులు


(పలాస/కాశీబుగ్గ/ టెక్కలి రూరల్‌/ రణస్థలం/ నరసన్నపేట/ ఇచ్ఛాపురం/ ఇచ్ఛాపురం రూరల్‌/ పాతపట్నం/ మెళియాపుట్టి/ జలుమూరు/ ఎచ్చెర్ల/ గార/ సోంపేట/ ఆమదాలవలస)


పాఠశాలలు రేపటి నుంచి పునః ప్రారంభం కానున్నాయి. జిల్లాలో చాలా ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకుని విద్యార్థులకు సమస్యల స్వాగతం పలుకుతున్నాయి. తాగునీరు, మరుగుదొడ్ల వంటి కనీస వసతుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ‘నాడు-నేడు’ కింద చేపడుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్నిచోట్ల పనులు పునాదుల దశలో ఉండగా.. మరికొన్ని చోట్ల వివాదాల కారణంగా పనులు ప్రారంభం కాలేదు. మరోవైపు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు ఇంతవరకూ పూర్తిస్థాయిలో పాఠశాలలకు చేరలేదు. దీంతో విద్యార్థులకు ఈ ఏడాది ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. 


ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు తిష్ఠ వేశాయి. మంగళవారం నుంచి పాఠశాలలు తెరచుకోనున్నాయి. కానీ చాలా పాఠశాలల్లో సౌకర్యాలు కనుమరుగయ్యాయి. పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రెండో విడత నాడు-నేడు పథకం కింద రూ.2 కోట్ల మంజూరయ్యాయి. పాఠశాల భవనాలు జూనియర్‌ కళాశాలకు వినియోగిస్తున్నారు. దీంతో పాత భవనాలపైనే కొత్తగా తరగతి గదులు నిర్మిస్తున్నారు. ఇవి పూర్తయ్యేసరికి కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. చినబడాం పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి. అదనపు తరగతి గదులు నిర్మాణ దశలో ఉన్నాయి. వందేళ చర్రిత కలిగిన కాశీబుగ్గ మూడురోడ్ల జంక్షన్‌ వద్ద పాఠశాలలో రెండు తరగతి గదులు ఉండగా పాత భవనాలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. 


- టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ‘నాడు-నేడు’ తొలివిడత పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. ఇటీవల ‘నాడు-నేడు’ రెండో విడత పనుల నేపథ్యంలో పాతభవనాలు తొలగించారు. ఈ క్రమంలో ప్రస్తుత పాఠశాల గోడ ధ్వంసమైంది. తరగతి గదుల్లోని కిటికీలు, విద్యుత్‌ పరికరాలు, మరుగుదొడ్లలో పరికరాలు, ట్యాప్‌లు పాడైపోయాయి. వాటర్‌ ప్లాంట్‌ మరమ్మతులకు గురైంది. పాఠశాల భవనాలకు వేసిన పెయింటింగ్‌లు చాలాచోట్ల పెచ్చులూడిపోయాయి. పాఠశాల ఆవరణ అంతా దుమ్ము ధూలి వ్యాపించింది. 


- నరసన్నపేట మండలంలో మొత్తం 84 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా గదులు లేవు. గోపాలపెంట పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒకే ఒక్క చిన్న గది ఉంది. ఈ గదిలో కేవలం పది బెంచీలు ఉండగా.. మిగిలిన విద్యార్థులు ఆరుబయట కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. లుకలాం ఉన్నత పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి. దేవాదిలో పాత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. చిన్నపాటి వర్షం కురిసినా.. బోర్డు ప్రాథమిక పాఠశాల ఆవరణ చెరువును తలపిస్తోంది. పాతపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండేళ్లుగా నాడు-నేడు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులు కూర్చొనేందుకు కనీసం బెంచీలు లేవు. 


- మెళియాపుట్టిలో రెండేళ్లుగా నాడు-నేడు పనులు కొనసాగుతున్నాయి. జిల్లాపరిషత్‌ పాఠశాలలో సుమారు రూ.5లక్షలతో ఆర్వోప్లాంట్‌లు ఏర్పాటు చేసినా.. తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. గొప్పిలి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో తొలివిడత నాడు-నేడు పనులు ఇంకా పూర్తికాలేదు. ఈ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా బెంచీలు లేవు. పరశురాంపురంలో గిరిజన సంక్షేమశాఖకు చెందిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తరగతి గది బీటలు వారింది. ఎప్పుడు గోడ, శ్లాబు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది.  


- జలుమూరు మండలం దరివాడ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో గత ఏడాది సచివాలయంలో తరగతులు నిర్వహించారు. వెంకటాపురం పంచాయతీ కృష్ణాపురం ప్రాథమిక పాఠశాల భవనం కూడా శిథిలావస్థలో ఉంది. హుస్సేనుపురం ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం లేదు. 


- ఎచ్చెర్ల మండలం దోమాం పంచాయతీ బమ్మిడివానిపేట ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. వర్షం పడిందంటే.. తరగతి గదిలోకి నీరంతా చేరిపోయి కూర్చోలేని దుస్థితి నెలకొంది. 


- రణస్థలం మండలం బండిపాలెం ప్రాథమిక పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. వర్షం పడితే పాఠశాల ప్రాంగణం అంతా చెరువును తలపిస్తుంది. ‘నాడు-నేడు’ రెండో విడత కింద ఈ పాఠశాలను ఎంపిక చేసినా.. కనీసం మరమ్మతులకు కూడా నోచుకోవడం లేదు. 


- గార మండలంలో సుగ్గుదాలినాయుడుపేట, బచ్చుపేట పాఠశాలల భవనాలు శిఽథిలావస్థకు చేరుకున్నాయి. బ్రిటీష్‌ కాలంనాటి నగరాలపేట ప్రాఽథమిక పాఠశాలకు నేటికీ ప్రహరీ లేదు. జడ్పీ ఉన్నత పాఠశాలలో సుమారు 450 మంది విద్యార్థులకు ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉంది. మరుగుదొడ్ల నిర్మాణం మధ్యలోనే నిలిపేశారు. 


- ఇచ్ఛాపురం మండలంలో రెండోవిడత నాడు-నేడులో 43 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.16.39 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు రూ. 3 కోట్లు ఆయా పాఠశాలల ఖాతాల్లో జమ కాగా రూ.85 లక్షలు ఖర్చు చేశారు. కె.శాసనం జడ్పీ ఉన్నత పాఠశాలకు తరగతి గదుల నిర్మాణాలు పునాది దశలో ఉన్నాయి. దీంతో ఈ ఏడాది కూడా ఇక్కడ వరండాలోనే విద్యార్థులు కూర్చోవలసి వస్తుంది. నీలాపుట్టుగ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు, వంటగది నిర్మాణానికి పునాదులు తవ్వారు. మిగతా మౌలిక వసతులు పనులు ప్రారంభించలేదు.  


- సోంపేట మండలంలో పీబీ శాసనాం, కొత్త బాతుపురం, మూలపాలెం పాఠశాలలు ఏకోపాధ్యాయుడితో నడుస్తున్నాయి. విద్యార్థులకు సంబంధించి యూనిఫాంలు ఇంతవరకు చేరలేదు. తాళ్లభద్ర, బారువ, సోంపేట పికే స్ట్రీట్‌ పాఠశాలల్లో నాడు-నేడులో  పనులు నిలిచిపోయాయి.  


- ఆమదాలవలస మండలంలో సేపేనపేట, కొరపాం, కర్నేనపేట, ఇసకలపేట, చిట్టివలస, మెట్టక్కివలస, పాత ఆమదాలవలస, రావికంటిపేట ప్రాథమిక పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్వగ్రామం.. తొగరాం ఉన్నత పాఠశాల కొన్ని భవనాలు తలుపుల కిటికీలు ఊడిపోగా,  కొన్ని చోట్ల పైకప్పు పాడైంది. విద్యార్థినులకు సరిపడా మరుగుదొడ్లు లేవు. వాటర్‌ ప్లాంట్‌ ఉన్నా మూలకుచేరింది. 


- పొందూరు మండలంలో ఈ ఏడాది నాడు-నేడు కింద 16 పాఠశాలలను గుర్తించగా.. నేటికీ పనులు ప్రారంభం కాలేదు. బూర్జ మండలంలోనూ అదే పరిస్థితి. మర్రిపాడు, పీఎల్‌దేవ్‌ పేట, కాళపర్తి గ్రామాల్లో భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. సరుబుజ్జిలి మండలంలో పెద్ద సవళాపురం పాఠశాలలో రైతు భరోసా కేంద్రం నిర్వహిస్తున్నారు.  బురిడివలస కాలనీ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది.  

Updated Date - 2022-07-04T04:36:17+05:30 IST