వేసవి భత్యానికి మంగళం

Published: Sat, 26 Mar 2022 00:52:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
   వేసవి భత్యానికి మంగళం జిల్లాలో ఉపాధిహామీ కూలీలు

- ఉపాధిహామీ కూలీలకు ఈ ఏడాది నిలిపివేత

- కేంద్ర ప్రభుత్వ  సాఫ్ట్‌వేర్‌లో కనిపించని ఆప్షన్‌ 

- కేంద్రం కనుసన్నల్లో ఉపాధి పనులు 

 - జిల్లాలో 2.22 లక్షల మంది ఉపాధి కూలీలు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఉపాధిహామీ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెత్తనానికి కేంద్రం బ్రేక్‌ వేసింది.  తన అజమాయిషీలోనే పనులు జరిగే విధంగా కొత్త  సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. నేషన్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) సర్వర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో టీజీఏ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఉపాధి పనులు జరిగేవి. కేంద్ర ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి వచ్చింది. పథకం అమలు తీరులో మార్పులు ఎలా ఉన్నా వేసవిలో ఉపాధి హామీ కూలీలకు అందించే సమ్మర్‌ అలవెన్స్‌ను మాత్రం నిలిపివేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌లో ఆప్షన్‌ను తొలగించారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధిహామీ కూలీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధిహామీ కూలీలకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ వరకు లభించే వేసవి భత్యం లేకుండా పోవడంతో ఆందోళన చెందుతున్నారు. వేసవిలో ఎండ వేడి తీవ్రతతో ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. మరోవైపు తాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా ఆచరణలో  కనిపించడం లేదు. వేసవి భత్యం నిలిపివేయడంతో తమకు కూలి గిట్టుబాటు కాదని ఉపాధిహామీ కూలీలు చెబుతున్నారు. 

జిల్లాలో 2.22 లక్షల మంది కూలీలు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో లక్ష 393 జాబ్‌ కార్డులు ఉండగా 2 లక్షల 22 వేల 610 మంది కూలీలు ఉన్నారు. 6195 శ్రమశక్తి సంఘాలు ఉండగా లక్షా 20 వేల 303 మంది కూలీలు ఉన్నారు. జిల్లాలో కొత్తగా ఈ ఏడాది 3626 జాబ్‌ కార్డులను మంజూరు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం 51,976 కుటుంబాల్లో 78,884 మంది కూలీలకు ఉపాధి అందించారు. 2021-22 లేబర్‌ బడ్జెట్‌లో 46.50 లక్షల పనిదినాల్లో 26.17 లక్షల పనిదినాలు కల్పించారు. ఉపాధిహామీ కూలి రూ.245 ఉండగా జిల్లాలో సరాసరి రూ.202.69 పొందుతున్నారు. ఇప్పటి వరకు రూ.50.39 కోట్ల కూలి అందుకున్నారు. జిల్లాలో సరాసరి పనిదినాలు 48.80 లక్షలు ఉండగా 7482 కుటుంబాలు వంద రోజులు పని చేశాయి.  

  యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం 

2022-23 సంవత్సరానికి యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. 35,38,705 పనిదినాలు కల్పించేందుకు నిర్ణయించారు. రూ.121.37 కోట్ల బడ్జెట్‌ రూపొందించారు. రూ.360 కోట్ల విలువైన పనులను గుర్తించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూలీలకు బోయినపల్లి మండలంలో 2.04.929 పనిదినాలు, చందుర్తి 2,66,564, ఇల్లంతకుంట 3,27,255, గంభీరావుపేట 4,80,057, కోనరావుపేట 3,89,398, ముస్తాబాద్‌ 3,93,648, రుద్రంగి 1,10,488, తంగళ్లపల్లి 3,87,636, వీర్నపల్లి 2,63,812, వేములవాడ మండలంలో 67,268, వేములవాడ రూరల్‌ 1,76,259, ఎల్లారెడ్డిపేటలో 4,71,391 పనిదినాలు కల్పించాలని యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. జిల్లాలో కంపోస్ట్‌ షెడ్‌, వైకుంఠధామాలు, కల్లాలు, పశువుల పాకల నిర్మాణాలు, గొర్రెలు, మేకల పాక నిర్మాణాలు, మ్యాజిక్‌ సోప్నిక్‌, ఫాంపాండ్‌లు, గ్రామ సంతలు, పల్లె ప్రకృతి వనాలు, హరితహారం, పనుల్లో ఉపాధిహామీ కూలీలు పనిచేస్తున్నారు. సాధారణంగా వేసవిలో ఉపాధిహామీ కూలీలు అనేక ఇబ్బందులు పడుతూ పనిచేస్తారు. దీని దృష్ట్యా ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా  పనిగంటలు తగ్గించి వేసవి అలవెన్స్‌ అందిస్తోంది.  ఫిబ్రవరిలో 20 శాతం, మార్చి 25, ఏప్రిల్‌, మే 30, జూన్‌లో 20 శాతం ఉండేది. ప్రస్తుతం కేంద్రం కొత్త విధానాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న క్రమంలో సమ్మర్‌ అలవెన్స్‌కు మంగళం పాడారు.   ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో పనుల వివరాలు కూడా పూర్తిగా తెలుస్తాయి. వేసవిలో ఉపాధిహామీ కూలీలకు ఇబ్బందులు కలగకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు కల్పించడానికి నిర్ణయించారు. వేతనాలు కూడా నేరుగా కూలీల ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. ఉపాధిహామీలో వస్తున్న మార్పులు అశాజనకంగా ఉన్నా సమ్మర్‌ అలవెన్స్‌పై నిరాశ చెందుతున్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.