అంతా అలెర్ట్‌!

ABN , First Publish Date - 2020-11-25T03:42:45+05:30 IST

నివర్‌ తుఫాన్‌ దూసుకు వస్తోంది. బుధవారం సాయంత్రం పుదుచ్చేరి సమీపంలో తీరందాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

అంతా అలెర్ట్‌!
వాకాడు : తూపిలిపాళెంలో అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్‌

దూసుకొస్తున్న నివర్‌ తుఫాన్‌

సాయంత్రం తీరం దాటే అవకాశం

మొదలైన వర్షాలు.. పొంచి ఉన్న ప్రమాదం

జిల్లాకు చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

సర్వం సిద్ధం చేసుకుంటున్న యంత్రాంగం

అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు

సహాయక చర్యలపై సీఎం ఆరా

నెల్లూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : నివర్‌ తుఫాన్‌ దూసుకు వస్తోంది. బుధవారం సాయంత్రం పుదుచ్చేరి సమీపంలో తీరందాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మధ్యాహ్నానికి అతి తీవ్ర తుఫాన్‌గా నివర్‌ మారుతుందని హెచ్చరించింది. దీని ప్రభావం తమిళనాడుతోపాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బుధ, గురువారాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం రోజంతా వాతావరణంలో పూర్తిగా మార్పు వచ్చింది. అక్కడక్కడా వర్షం కురవగా మిగిలిన ప్రాంతాల్లో చల్లగాలులు వీచాయి. స్వయంగా సీఎం జగన్మోహన్‌రెడ్డి కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సూచనలు జారీ చేశారు. కలెక్టర్‌ చక్రధర్‌బాబు కూడా జిల్లాలోని పలు తీర ప్రాంతాల్లో పర్యటించారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో సుమారు వంద మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నాయి. ఇదే సమయంలో లోతట్టు ప్రాంతాలు జలమయమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లా ఎమర్జెన్సీ సెంటర్‌తోపాటు, అన్ని డివిజన్‌ కార్యాలయాల్లో కూడా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కాగా, కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలకు బుధ, గురు, శుక్రవారాల్లో సెలువులు ప్రకటిస్తున్నట్లు ఆర్‌ఐవో మాల్యాద్రి చౌదరి తెలిపారు.


ఫ కలెక్టర్‌తో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

నెల్లూరు(హరనాథఫురం) : నివర్‌ తుఫాన్‌ వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌ కలెక్టర్‌ చక్రధర్‌బాబును ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌తో మాట్లాడారు. ఇప్పటికే 100 మంది ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది జిల్లాకు చేరుకొన్నారని, మంగళగిరి నుంచి ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, వెంకటగిరి నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్‌, 9వ బెటాలియన్‌ బృందాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్‌ సీఎంకు వివరించారు. ఇస్రో, ఐఎండీ అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం పంచుకొంటూ తుఫాన్‌ ప్రభావానికి తగ్గట్టుగా చర్యలు తీసుకొంటున్నట్లు వివరించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కు రప్పిస్తున్నామని, ఎవరూ వేటక వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశామన్నారు. తుఫాన్‌ ప్రభావంతో రేకులు, పూరిగుడిసెల్లో ఉన్నవారు, లోతట్టు ప్రాంతాలలో ఉన్న వారిని సచివాలయ సిబ్బంది ద్వారా షెల్టర్‌ హోమ్స్‌కు తరలిస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేశామని, డివిజన్‌, మండల, గ్రామ స్పెషల్‌ అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. వచ్చే 2, 3 రోజులు వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నందున ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. సోమశిల, కండలేరు జలాశయాలు పూర్తి సామర్థ్యంతో ఉండటం వల్ల మంగళవారం దిగువకు నీరు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. 1077 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ప్రజలు ఫోన్‌ చేస్తే క్విక్‌ రెస్పాన్స్‌ టీంలు వచ్చి సహాయం చేసేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జేసీ హరేందిర ప్రసాద్‌, జేసీ (ఆసరా) సూర్యప్రకాష్‌, డీఈఓ ఎంవీ రమణ, వ్యవసాయశాఖ జేడీ ఆనందకుమారి, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కమాండర్‌ ఆర్‌. అబేన్‌ తదితరులు పాల్గొన్నారు. 


అగ్నిమాపక దళం సిద్ధం

నెల్లూరు(క్రైం) : తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అగ్నిమాపక దళం సిద్ధమైంది. కావలి, నెల్లూరులలో రెండు పడవలు, గూడూరు, కోట, సూళ్ళూరుపేట, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో ఒక్కో బోటు అందుబాటులో ఉంచారు. అధికారులు, సిబ్బంది బోట్లతోపాటు, సామగ్రిని బయటకు తీసి వాటి పనితీరును పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. 


పోర్టులో రెండో ప్రమాద హెచ్చరిక

ముత్తుకూరు : తుఫాను కారణంగా కృష్ణపట్నం పోర్టులో మంగళవారం రెండవ నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగరవేశారు. తీరంలో గాలులు, భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి.  మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశించారు. తీర గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సమాచారం అందజేయాలని కోరారు.


తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటన

వాకాడు : తీరప్రాంతంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకు మంగళవారం కలెక్టర్‌ చక్రధర్‌బాబు వాకాడు మండలంలోని కొండూరుపాళెం, తూపిలిపాళెం, బాలిరెడ్డిపాళెం గ్రామాల్లో పర్యటించారు. తుఫాను షెల్టర్లు,  సముద్రపు అలల తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ వెంట సబ్‌కలెక్టర్‌ రోణంకి గోపాలకృష్ణ, తహసీల్దార్‌ పద్మావతి, ఎంపీడీవో గోపినాథ్‌, ప్రత్యేక అధికారి ప్రమోద్‌కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


50 మీటర్లు ముందుకొచ్చిన కడలి

కావలి రూరల్‌ : తుఫాన్‌ ప్రభావంతో కడలిలో ఉవ్వెత్తున అలలు ఎగసి పడుతున్నాయి. కావలి రూరల్‌ మండలం తుమ్మలపెంట, కొత్తసత్రం తీరప్రాంతాల్లో తుఫాన్‌ ప్రభావంతో మంగళవారం సముద్రం సుమారు 50 మీటర్ల మేర ముందుకు  వచ్చింది. ఇస్కపల్లి మెరైన్‌ ఎస్‌ఐ రసూల్‌ మత్స్యకారులను అప్రమత్తం చేశారు. తీరానికి  వచ్చే పర్యాటకులను సముద్ర స్నానాలకు వెళ్లకుండా మెరైన్‌ పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు.







Updated Date - 2020-11-25T03:42:45+05:30 IST