నిబంధనలు తుంగలోకి

ABN , First Publish Date - 2022-01-19T07:45:00+05:30 IST

నిబంధనలు తుంగలోకి

నిబంధనలు తుంగలోకి

విశాఖ ‘భూస్కామ్‌’లో వెలుగులోకి ఉల్లంఘనలు

బీచ్‌లో నిర్మాణాలను అనుమతించొద్దు

2005లోనే వుడాకు కేంద్ర పర్యావరణశాఖ స్పష్టీకరణ

పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే పనులొద్దని ఆదేశం

అయినా 22 ఎకరాల కేటాయింపునకు అధికారులు సిద్ధం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం-భీమిలి కారిడార్‌లో సముద్ర తీరాన ఎటువంటి నిర్మాణాలకూ అనుమతులు ఇవ్వకూడదని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ(ఎంఓఈఎఫ్‌) 2005లోనే విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ(వుడా)ను ఆదేశించింది. ఆ సమయంలో డబుల్‌ రోడ్డుగా ఉన్న ఈ మార్గాన్ని నాలుగు లేన్లుగా విస్తరించారు. అనుమతుల కోసం దరఖాస్తు చేయగా, బీచ్‌ వైపు మాత్రం ఎటువంటి నిర్మాణాలూ చేపట్టకూడదని ఎంఓఈఎఫ్‌ స్పష్టం చేసింది. ఇసుక తిన్నెలను తవ్వకూడదని హెచ్చరించింది. సముద్ర ఇసుక తిన్నెలు కోస్తా నియంత్రణ మండలి-1 పరిధిలోకి వస్తాయని, అక్కడ తాబేళ్లు గుడ్లు పెడతాయని, సీ గ్రాస్‌ పెరుగుతుందని, అందువల్ల అక్కడ పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసేలా ఎటువంటి పనులూ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఇప్పుడు ఆ మార్గాన్నే భోగాపురం వరకు పొడిగించి, ఆరు లేన్లుగా విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో బీచ్‌ రిసార్ట్‌లు నిర్మిస్తామని, తిమ్మాపురం, గుడ్లవానిపాలెం వద్ద సముద్ర తీరంలో 22 ఎకరాలు కేటాయించాలంటూ మ్యాప్‌ బీచ్‌ రిసార్ట్స్‌, మెరైన్‌ బ్రిజో సంస్థలు అటవీ శాఖకు దరఖాస్తు చేశాయి. వాస్తవానికి వీటిని షెల్టర్‌ బెల్ట్‌గా అభివృద్ధి చేస్తున్నట్టు అటవీ శాఖ ప్రకటించి, ఆయా ప్రాంతాల్లో బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. ఈ రెండు ప్రాంతాలు పూర్తిగా ఇసుక తిన్నెలతో ఉన్నాయి. అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు నిబంధనలు అంగీకరించవు. ఎటువంటి ఒత్తిళ్లు వచ్చాయో తెలియదు కానీ, విశాఖ జిల్లా అటవీ శాఖాధికారి ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి అమరావతి పంపితే, అక్కడ  ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్సర్వేటివ్‌ ఆఫీసర్‌ కార్యాలయం కూడా ఓకే చేసింది. నిబంధనల ప్రకారం ఈ దరఖాస్తులను తిరస్కరించాలి. ఆయా భూముల్లో నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని, అనుమతులు ఇవ్వలేమని స్పష్టంచేయాలి. కానీ అలా చేయకుండా దరఖాస్తును పరిశీలించి ఉన్నతాధికారుల పరిశీలనకు పంపడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇస్తే, నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించినట్టేనని, వీటి వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ ఒకరు అభిప్రాయపడ్డారు. వీటికి ఆమోదం లభిస్తే, భోగాపురం వరకు ఈ విధంగానే మరిన్ని సంస్థలు అనుమతులు తెచ్చుకుంటాయని, అది మరింత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తంచేశారు.

Updated Date - 2022-01-19T07:45:00+05:30 IST