Tungabhadra గేట్ల ఎత్తివేత

ABN , First Publish Date - 2022-07-13T17:11:43+05:30 IST

తుంగభద్ర జలాశయం పైభాగంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గత ఏడాది కంటే ముందుగానే ఈసారి జలాశయం పూర్తిస్థాయిలో

Tungabhadra గేట్ల ఎత్తివేత

- 20 గేట్ల ద్వారా నదికి నీరు

- హెచ్చెల్సీకి నీటిని వదిలిన అధికారులు


బళ్లారి(బెంగళూరు), జూలై 12(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర జలాశయం పైభాగంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గత ఏడాది కంటే ముందుగానే ఈసారి జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. దీంతో జలాశయం భద్రతా దృష్ట్యా 20 క్రస్ట్‌గేట్ల గుండా అధికారులు నదికి నీటిని విడుదల చేశారు. దీంతో పాటు తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ కాలువ(హెచ్చెల్సీ)కి మంగళవారం బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర బోర్డు కార్యదర్శి నాగమోహన్‌, ఎస్‌ఈ శ్రీకాంత్‌రెడ్డి, ఎల్లెల్సీ ఈఈ సురేష్ రెడ్డి, హెచ్చెల్సీ ఈఈ రవిచంద్ర, డ్యాం వద్ద స్విచ్‌ ఆన్‌ చేసి హెచ్చెల్సీకి నీటిని వదిలారు. అంతకు ముందు బోర్డు అధికారులు జలాశయంపై పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయంగా వాయనం వదిలారు. ఈ సందర్భంగా బోర్డు కార్యదర్శి నాగమోహన్‌ విలేకరులతో మాట్లాడుతూ తుంగభద్ర ఎగువ కాలువకు తొలుత 100 క్యూసెక్కుల నీరు వదిలామని, తరువాత ప్రతి రెండు గంటలొకసారి పెంచుతామని తెలిపారు. జలాశయం నుంచి 20 గేట్లు ఎత్తి నీటిని నదికి వదిలినట్లు తెలిపారు. 10 గేట్లు రెండు అడుగులు, మరో 10 గేట్లు ఒక అడుగు ఎత్తు తెరిచి 43,450 క్యూసెక్కులు నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో బాగా వస్తోందన్నారు. ప్రస్తుతం డ్యాంలో 96.916 టీఎంసీల నీరు చేరాయన్నారు. ఇన్‌ఫ్లో సరాసరి 80,049 క్యూసెక్కులు ఉందని తెలిపారు. కార్యక్రమంలో డీఈలు జగదీశ్‌, అమర్‌నాథ్‌రెడ్డి, ఎస్టీ ఎస్‌టీవో అసాన్‌ బాషా, విశ్వనాథ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-13T17:11:43+05:30 IST