వేసవిపంట బోనస్‌ రాక తంట

ABN , First Publish Date - 2021-02-26T05:18:26+05:30 IST

మండల వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం అటవీ శాఖ ఆధ్వర్యంలో తునికాకును సేకరిస్తారు. అందుకు కోసం మండలంలోని ప్రజలు అటవీ ప్రాం తాల్లో తునికాకు సేకరించి ఇంటి వద్ద కట్టలు కట్టి అధికారులు ఏర్పాటు చేసిన కల్లాల్లో విక్రయిస్తారు

వేసవిపంట బోనస్‌ రాక తంట

ఏడేళ్లయినా అందని తునికాకు సేకరణ బోనస్‌

ఆశగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు

ప్రభుత్వం ఇవ్వగానే పంపిణీ చేస్తాం: ఆంధ్రజ్యోతితో అటవీశాఖ రేంజర్‌ వెంకటేశ్వర్లు

కరకగూడెం, ఫిబ్రవరి 25: మండల వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం అటవీ శాఖ ఆధ్వర్యంలో తునికాకును సేకరిస్తారు. అందుకు కోసం మండలంలోని ప్రజలు అటవీ ప్రాం తాల్లో తునికాకు సేకరించి ఇంటి వద్ద కట్టలు కట్టి అధికారులు ఏర్పాటు చేసిన కల్లాల్లో విక్రయిస్తారు. తునికాకు సేకరణ పూర్తయ్యాక సేకరణను నిలిపివేస్తారు. అనంతరం ఆయా కల్లాలలో తునికాకు సేకరించిన లబ్ధిదారులకు నగదును చెల్లిస్తారు. కానీ ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు అందాల్సిన తునికాకు బోనస్‌ మాత్రం లబ్ధిదారుల దరిచేరడం లేదు. బోనస్‌ నగదు కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2013 సంవత్సరానికి సంబంధించి తునికాకు బోనస్‌ కొందరికి రాగా మరికొందరికి అందలేదు. 2013లో మండలంలోని కరకగూడెం ఏ-సెక్షన్‌లో 18 కల్లాలు, బీ-సెక్షన్‌లో 16 కల్లాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో కరకగూడెం ఏ-సెక్షన్‌లో 1,301 మంది లబ్ధిదారులు 25 లక్షలు, బీ సెక్షన్‌లో 1,584 మంది లబ్ధిదారులు 23 లక్షల తునికాకు సేకరించారు. ఇందుకు గానూ ప్రభుత్వం లబ్ధిదారులకుబోనస్‌ రూ. 24 లక్షలు అందించాలి. మండలంలోని కొందరు లబ్ధిదారులకు 2013లో ఇవ్వాల్సిన బోనస్‌ 2019 లో ఇచ్చారు. ఇంకా మండలంలోని 678 మంది లబ్ధిదారులకు రూ. తొమ్మిది లక్షలు అందివ్వాల్సి ఉంది. కానీ ఇప్పటికీ బోనస్‌ అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. 

త్వరితగతిన లబ్ధిదారులకు అందించాలి

సాంబశివరావు, సీపీఎం మండల కార్యదర్శి 

సంవత్సరాలు గడిచినా తునికాకు సేకరించిన బోనస్‌ ఇంతవరకు లబ్ధిదారులకు అందించలేదు. అధికారుల నిర్లక్ష్యంతో నెలలు గడుస్తున్నాయి. ఉన్నతాదికారులు స్పందిం చి త్వరగతిన తునికాకు బోనస్‌ అందేలా చర్యలు తీసుకోవాలి.

అధికారుల నిర్లక్ష్యం: రామనాథం, కరకగూడెం సర్పంచ్‌

సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ తునికాకు బోనస్‌ అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేస్తే లబ్ధిదారులకు బోనస్‌ నగదును పంపిణీ చేస్తామంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బోనస్‌ నగదు అందించేలా చూడాలి.

ప్రభుత్వం ఇవ్వగానే లబ్ధిదారులకు అందిస్తాం

వెంకటేశ్వర్లు, అటవీశాఖ రేంజర్‌

లబ్ధిదారులకు తునికాకు బోనస్‌ అందని విషయంపై ఏడూళ్లబయ్యారం రేంజర్‌ వెంకటేశ్వర్లును ఆంధ్రజ్యోతి వివరణ కోరగా.. లబ్ధిదారులకు బోనస్‌ నగదు వచ్చాయి. రూ, 15 లక్షల 20 వేల 317 అందజేశాం. 678 మంది లబ్ధిదారుల ఆధారాలు సరిగా లేక పోవడంతో రూ, 9 లక్షల 76 వేల 302 నగదు వెనక్కి వెళ్లాయి. ప్రభుత్వం మంజూరు చేయగానే లబ్ధిదారులకు అందజేస్తాం.


Updated Date - 2021-02-26T05:18:26+05:30 IST