తుంటరి చేపపిల్ల!

ABN , First Publish Date - 2022-08-03T05:30:00+05:30 IST

అనగనగా ఓ రాజు. ఆ రాజుకి ఆరుగురు కొడుకులు. ఆరుగురు కొడుకులూ దగ్గరలోని నదికెళ్లి ఆరు చేపల్ని పట్టుకొచ్చారు. ఐదు మంది మాత్రం పెద్ద చేపలను పట్టుకొచ్చారు.

తుంటరి చేపపిల్ల!

అనగనగా ఓ రాజు. ఆ రాజుకి ఆరుగురు కొడుకులు. ఆరుగురు కొడుకులూ దగ్గరలోని నదికెళ్లి ఆరు చేపల్ని పట్టుకొచ్చారు. ఐదు మంది మాత్రం పెద్ద చేపలను పట్టుకొచ్చారు. ఆరో కొడుకు మాత్రం చిన్న చేప పిల్లను పట్టుకొచ్చాడు. ‘ఎవరి చేపల్ని వాళ్లు వండి ఆహారం ఇస్తే.. మేం తిని తరిస్తాం. రుచికరమైన చేపకూర చేసిన వాళ్లకు బహుమతి కూడా ఇస్తాం’ అన్నారు రాజా వారు. ఎవరికి వాళ్లు వాళ్ల పనిలో పడ్డారు. ఆ సమయంలోనే మెల్లగా మాటలు వినిపించాయి ఆరో కొడుక్కి. అవి చేప మాట్లాడే మాటలని అర్థమైంది. ‘కుమార రాజా.. చిన్న చేపపిల్లను నేను. నన్ను వండితే ఏమొస్తుంది. రుచీ ఉండను. ముల్లులుంటాయి కడుపులో ఎక్కువ. కండలేని నాలాంటి బక్క చేపపిల్లను రాజుగారు తింటే మీ మీద కోప్పడతారేమో’ అన్నది. ‘మరేం చేయాలో నీవే చెప్పు’ అన్నాడు. ‘మా నది దగ్గరికొస్తే రెండు పెద్ద చేపలుండే ప్రాంతాన్ని చూపిస్తా’ అన్నది. సరే అన్నాడు రాజుగారి కుమారుడు. 


మహారాజు దగ్గరికి వెళ్లి.. ‘రాజావారు.. మేం చిన్న చేపపిల్లను సంహరించలేం. పెద్ద చేపను తీసుకొచ్చాక.. మీ ఆజ్ఞను శిరసావహిస్తాం’ అన్నాడు ఆరో అబ్బాయి. సరేనన్నాడు రాజావారు. తెచ్చిన కుండలోనే చేపను తీసుకుని రాజావారబ్బాయి బయలుదేరాడు. దారంటా చేప ఏవో కథలు చెప్పింది. నది దగ్గరికి వచ్చాక.. ‘ఏదీ పెద్ద చేపలుండే ప్రాంతం చెప్పు’ అన్నాడు రాజుగారి అబ్బాయి. ‘ఆ ఎర్రరాయి కనిపిస్తుంది కదా.. అక్కడికి తీసుకెళ్లు’ అన్నది చేపపిల్ల. అక్కడికి వెళ్తుండగానే.. కుండలోని చేపపిల్ల ఎగిరి నది ప్రవాహంలోకి దూకింది. ‘ఆ రాయి దగ్గర.. పెద్ద చేపలేదు.. ఏమీ లేదు. ఽ‘దన్యవాదాలు కుమార రాజా. నన్ను తింటే రుచి ఎలా ఉంటుందో తెలీదు.


ఆ సమయంలో ఏమి చెప్పాలో అర్థం కాలేదు’ అన్నది చేప పిల్ల. చిన్నరాజావారు నవ్వారు. ‘నీ మాటలు తెలీదా. నీ ముఖం చూస్తే చంపాలనిపించలేదు. నీకథ అంతా ఓపిగ్గా విన్నా. బతుక్కో ఓ తుంటరి చేపపిల్లా’ అన్నాడు. చేపపిల్ల వెనక్కి వచ్చి.. ఆ రాజుగారి అబ్బాయి కాలివేళ్లను తాకి నమస్కరించింది. ‘ఇంత మంచి మనసుండే నువ్వే అసలైన రాజువి’ అంటూ నీళ్లలో మునిగింది. 

Updated Date - 2022-08-03T05:30:00+05:30 IST